
Rohit Sharma and Kohli : ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ ముందట టీమిండియాలో కెప్టెన్సీ రచ్చ నడుస్తోంది. ఊహించని విధంగా.. తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు కోహ్లీ. దీంతో.. కోహ్లీ వైదొలగాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? అది కూడా టీ20కి మాత్రమే ఎందుకు పరిమితం చేశాడు? వరల్డ్ కప్ వంటి భారీ టోర్నీ ముందే ఎందుకు ప్రకటించాడు? అనే చర్చ జోరుగా సాగుతోంది. అంతేకాదు.. కోహ్లీ తర్వాత ఎవరికి కెప్టెన్సీ అప్పగిస్తారు? అనే విషయంలోనూ మాజీల నుంచి అభిమానుల వరకు ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో.. రోహిత్ శర్మకు వ్యతిరేకంగా బీసీసీఐకి కోహ్లి సూచన చేశాడన్న వార్త ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తోంది.
విరాట్ కోహ్లీ కెప్టెన్ కు రాజీనామా చేయడంతో.. రోహిత్ శర్మకే పగ్గాలు దక్కుతాయని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. అలా జరగాలని కూడా హిట్ మాన్ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే.. రోహిత్ కెప్టెన్ కాకుండా అడ్డుకునే నెగెటివ్ అంశం కూడా ఒకటి ఉంది. అది చాలా బలమైనది కూడా. అది మరేదో కాదు.. రోహిత్ వయసు. ఇప్పుడు రోహిత్ వయసు 34 సంవత్సరాలు. అంటే.. మరో మూడ్నాలుగు సంవత్సరాలకు రిటైర్ అయ్యే ఏజ్. ఇలాంటి ఆటగాడికి కెప్టెన్సీ కట్టబెట్టడానికి బీసీసీఐ ఆలోచించే అవకాశం ఉందని అంటున్నారు.
సరిగ్గా విరాట్ కోహ్లీ కూడా ఇదే అంశాన్ని ఎత్తి చూపుతూ.. రోహిత్ ను వైస్ కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పించాలని బీసీసీఐని కోరాడనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కోహ్లీ కెప్టెన్ గా ఉంటే.. రోహిత్ వైస్ కెప్టెన్ గా ఉన్న సంగతి తెలిసిందే. రాబోయే టోర్నీల్లో తనకు వైస్ కెప్టెన్ గా రోహిత్ కాకుండా.. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ లో ఒకరిని వైస్ కెప్టెన్ గా ఇవ్వాలని కోరాడట. రోహిత్ వయసు ఎక్కువగా ఉన్నందున వీరిలో ఒకరిని సెలక్ట్ చేయాలని సూచించాడట. ఈ మేరకు ‘‘క్రికెట్ అడిక్టర్’’ తన కథనంలో పేర్కొంది.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ మధ్య విభేదాలు ఉన్నాయని చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇది నిజమే అనిపించేలా పలు ఆధారాలు కూడా కనిపించాయి. రోహిత్ – కోహ్లీ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయనే విషయం ఇప్పుడు కాదు.. 2019లోనే బయటకు వచ్చింది. అప్పటి వన్డే వరల్డ్ కప్ లో తుదిజట్టు విషయంలో కోహ్లీ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో విభేదాలు చోటు చేసుకున్నాయనే ప్రచారం సాగింది. ఈ వార్తలకు మరింత బలం చేకూర్చేలా.. కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మను ఇన్ స్టా గ్రామ్ లో అన్ ఫాలో చేశాడు రోహిత్. అనుష్క సైతం రోహిత్ భార్య రితికాను అన్ ఫాలో చేసేసింది. దీంతో.. అందరూ కన్ఫామ్ చేసుకున్నారు. వీరిద్దరి మధ్య గొడవలు తారస్థాయికి చేరాయని నెటిజన్లు నిర్ధారించుకున్నారు.
ఈ క్రమంలోనే కోహ్లీని తప్పించి రోహిత్ ను కెప్టెన్ చేయాలనే డిమాండ్ రావడం కూడా వీరిమధ్య దూరం పెరగడానికి కారణమైందనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు రోహిత్ ను వైస్ కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టాలని కోహ్లీ కోరాడనే వార్తలు రావడం కూడా సంచలనం రేకెత్తిస్తోంది. దీనికి వయసును కారణంగా చూపాడంటే.. పరోక్షంగా టీ20 కెప్టెన్సీని కూడా రోహిత్ కు ఇవ్వొద్దని సూచించడమేనని అంటున్నారు. మరి, ఇందులో నిజమెంత? బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాలి.