IND vs SA : విరాట్ కోహ్లీ.. పరుగులకు మరిగిన హంగ్రీ చీతా

IND vs SA ప్రస్తుత ప్రపంచకప్ లో రోహిత్ 257 పరుగులు చేసి..మూడవ హైయెస్ట్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 29, 2024 10:16 pm

Virat Kohli scored huge runs in the final match of IND vs SA

Follow us on

IND vs SA : టి20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు విరాట్ కోహ్లీ ఐపీఎల్లో సత్తా చాటాడు. ఏకంగా 700+ పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. టి20 వరల్డ్ కప్ లో ఓపెనర్ అవతారం ఎత్తాడు. కానీ ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ఏడు మ్యాచ్లు ఆడి 75 పరుగులు మాత్రమే చేశాడు. అతడి ఇన్నింగ్స్ లలో బంగ్లాదేశ్ జట్టుపై చేసిన 37 పరుగులే హైయెస్ట్ స్కోర్. కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్ లోనూ విఫలమయ్యాడు. అయితే సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ జట్టుపై విజయం సాధించిన అనంతరం.. విరాట్ ఫామ్ పై రోహిత్ శర్మ ను విలేకరులు పలు ప్రశ్నలు సంధించగా..” విరాట్ పై నాకు నమ్మకం ఉంది. అతడి ఫామ్ అనేది లెక్కలోది కాదు. అతడు ఎలా ఆడతాడో నాకు తెలుసు. గత 15 సంవత్సరాలుగా మా ఇద్దరి మధ్య అనుబంధం ఉంది. ఇద్దరం కలిసి క్రికెట్ ఆడుతున్నాం. అతడి ఫామ్ పై పెద్దగా ఆందోళన అవసరం లేదు. ఫైనల్ లో అతని విశ్వరూపం మీరు చూస్తారని” వ్యాఖ్యానించాడు.

రోహిత్ చెప్పినట్టుగానే దక్షిణాఫ్రికా తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో విరాట్ నిజంగానే విశ్వరూపం చూపించాడు.. బార్బడోస్ మైదానాన్ని పరుగులతో హోరెత్తించాడు. తన పూర్వపు ఫామ్ అందుకొని.. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు హాఫ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పుడు.. అక్షర్ పటేల్ తో 72, శివం దూబే తో 57 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పి టీమిండియాను పటిష్ట స్థితిలో నిలిపాడు ఈ దశలో 59 బంతుల్లో 76 పరుగులు చేసి.. జాన్సన్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. అద్భుతంగా బ్యాటింగ్ చేసి తాను పరుగులకు మరిగిన హంగ్రీ చీతానని నిరూపించుకున్నాడు. తనపై వస్తున్న విమర్శలకు సరైన స్థాయిలో సమాధానం చెప్పాడు.

వాస్తవానికి ప్రస్తుత టి20 క్రికెట్ టోర్నీలో విరాట్ పెద్దగా రాణించలేదు. కానీ ఫైనల్ మ్యాచ్లో మాత్రం ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడు. తనకు మాత్రమే సాధ్యమైన షాట్లను కొట్టి అలరించాడు. రోహిత్ శర్మ, రిషబ్ పంత్, సూర్య కుమార్ యాదవ్ వంటి ఆటగాళ్లు అవుట్ అయినప్పటికీ.. స్పిన్ బౌలర్ అక్షర్ పటేల్, శివం దూబే తో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ముఖ్యంగా జాన్సన్ వేసిన 18 ఓవర్ నాలుగో బంతికి విరాట్ భారీ సిక్సర్ కొట్టాడు. అతడు కొట్టిన కొట్టుడుకు బంతి 95 మీటర్ల ఎత్తులో ఎగిసింది. మైదానం రూఫ్ పై పడింది. టీమిండియా ఇన్నింగ్స్ కే ఈ సిక్సర్ హైలెట్ గా నిలిచింది.

ఇక ఈ మ్యాచ్లో అర్థ సెంచరీ చేయడం ద్వారా కోహ్లీ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. 2014లో సౌత్ ఆఫ్రికా తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో విరాట్ 44 బంతుల్లో 72 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. శనివారం నాటి ఫైనల్ మ్యాచ్ లో 76 పరుగులు చేసి.. తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నాడు. అంతేకాదు టి20 ప్రపంచ కప్ చరిత్రలో 1,292 పరుగులు చేసిన భారతీయ ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు.. కోహ్లీ తర్వాత స్థానంలో టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. అతడు 1,220 పరుగులు చేశాడు.. ప్రస్తుత ప్రపంచకప్ లో రోహిత్ 257 పరుగులు చేసి..మూడవ హైయెస్ట్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు.