IND vs SA : ఒక వైఫల్యం ఎదురైతే.. దాని నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఇంకోసారి వైఫల్యం ఎదురుకాకుండా చూసుకోవాలి. దర్జాగా గెలుపు బాట పట్టాలి. కానీ టీమిండియా లో కొందరి ఆటగాళ్లకు వైఫల్యాలు ఎదురవుతున్నా ఏమాత్రం పట్టడం లేదు. పైగా వారు వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవడం లేదు. వారి నిర్లక్ష్యం అంతిమంగా జట్టు విజయావకాశాలను ప్రభావితం చేస్తోంది.
టి20 వరల్డ్ కప్ లో టీమిండియా వరుస విజయాలు సాధించింది. ఇందులో కొందరు ఆటగాళ్లు మాత్రమే జట్టు భారాన్ని మోశారు. మిగతావాళ్లంతా కీలక సమయంలో విఫలమయ్యారు. గ్రూప్, సూపర్ -8 , సెమీస్ అది చెల్లుబాటయింది . కానీ ఫైనల్లో అలా కాదు కదా.. ఫైనల్ మ్యాచ్ అంటేనే విజయమో, వీర స్వర్గమో అన్నట్టుగా ఉంటుంది. అలాంటి సమయంలో టీమిండియాలో కొందరు ఆటగాళ్లు చేతులెత్తేశారు. ఆడుతోంది ఫైనల్ కాదన్నట్టుగా వ్యవహరించారు.. ఫలితంగా తక్కువ పరుగులకే కీలకమైన వికెట్లు కోల్పోయి టీమిండియా కష్టాల్లో పడింది.
టి20 వరల్డ్ కప్ లో గ్రూప్ -8 లో ఆస్ట్రేలియా, సెమీస్ లో ఇంగ్లాండ్ పై అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించిన కెప్టెన్ రోహిత్ శర్మ ఫైనల్ మ్యాచ్లో విఫలమయ్యాడు. కేవలం 9 పరుగులు చేసి క్యాచ్ అవుట్ గా వెనుతిరిగాడు. లీగ్ దశలో అమెరికా, పాకిస్తాన్ వంటి జట్లపై మెరిసిన రిషబ్ పంత్.. కీలకమైన సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లో విఫలమయ్యాడు. మరీ దారుణంగా ఫైనల్ మ్యాచ్లో 0 పరుగులకే అవుట్ అయ్యాడు. మరో భీకరమైన ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ సెమీఫైనల్ మ్యాచ్లో 47 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. కానీ ఫైనల్ మ్యాచ్లో నిర్లక్ష్యపు షాట్ ఆడి ఔటయ్యాడు. కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి.. తీవ్రంగా నిరాశపరిచాడు
ఈ దశలో టీమిండియాను స్పిన్ బౌలర్ అక్షర్ పటేల్ ఆదుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఆదేశాల మేరకు బ్యాటింగ్ కు దిగాడు. కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకున్నాడు. ఓ ఎండ్ లో విరాట్ కోహ్లీకి సహకారం అందిస్తూనే.. మరో ఎండ్ లో అతడికి మించిన స్థాయిలో బ్యాటింగ్ చేశాడు. ప్రొఫెషనల్ ఆటగాడిలా షాట్లు కొట్టాడు. అక్షర్ పటేల్ 31 బంతుల్లో 48 పరుగులు చేశాడు. ఇందులో ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. హాఫ్ సెంచరీ దిశగా వెళ్తున్న అతడు దురదృష్టవశాత్తు రన్ అవుట్ అయ్యాడు. మరోవైపు విరాట్ కోహ్లీ 40 బంతుల్లో 44 పరుగులు(ఈ కథనం రాసే సమయానికి) చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో నాలుగు ఫోర్లు ఉన్నాయి. విరాట్ కోహ్లీ – అక్షర్ పటేల్ నాలుగో వికెట్ కు ఏకంగా 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం విశేషం.
వాస్తవానికి అక్షర్ పటేల్ ను రోహిత్ శర్మ ఎంపిక చేసినప్పుడు చాలామంది విమర్శించారు. కులదీప్ యాదవ్, రవీంద్ర జడేజా ఉండగా అతడు ఎందుకు దండగ అని వ్యాఖ్యానించారు. కానీ ఈ టోర్నీలో కులదీప్ యాదవ్ బౌలింగ్ తో ఆకట్టుకుంటున్నాడు. కానీ అక్షర్ పటేల్ అటు బంతి, ఇటు బ్యాట్ తో రాణిస్తున్నాడు. సెమీ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ పై చివర్లో వచ్చి తొమ్మిది పరుగులు చేశాడు. కీలకమైన మూడు వికెట్లు పడగొట్టి.. టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా వెంట వెంటనే మూడు వికెట్లు కోల్పోయినప్పుడు.. రోహిత్ శర్మ శివం దూబే ను కాకుండా అక్షర్ పటేల్ ను పంపించాడంటేనే.. అతనిపై ఏ స్థాయిలో నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. అన్నట్టు ఈ టోర్నీలో ఇప్పటివరకు అక్షర్ పటేల్ ఏడు మ్యాచ్లలో.. ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ దూకుడుగా బ్యాటింగ్ చేసిన నేపథ్యంలో.. సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. సూర్య కుమార్, రిషబ్ పంత్ నిర్లక్ష్యంగా అవుట్ అయిన నేపథ్యంలో..”కళ్ళు తెరిచి చూడండ్రా.. కొంచమైనా సిగ్గు తెచ్చుకోండి.. అక్షర్ ఎలా ఆడుతున్నాడో చూడండి” అని అర్థం వచ్చేలా కామెంట్స్ చేస్తున్నారు.
TONKED! #AxarPatel releases pressure after smashing Markram for the first MAXIMUM of the finals!
How crucial will his stay at the crease prove to be? #T20WorldCupFinal | #INDvsSA | LIVE NOW pic.twitter.com/9llKGOXqFX
— Star Sports (@StarSportsIndia) June 29, 2024