IND vs SA : టి20 వరల్డ్ కప్ మనదే.. ఫైనల్ లో సత్తా చాటిన టీమిండియా.. దక్షిణాఫ్రికాపై ఉత్కంఠ విజయం

IND vs SA : బార్బడోస్ మైదానానికి ప్రేమతో ముద్దు ఇచ్చాడు. కీలకమైన ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోవడంతో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కన్నీటి పర్యంతమయ్యారు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 30, 2024 12:02 am

IND vs SA Final

Follow us on

IND vs SA : అనుక్షణం నరాలు తెగే ఉత్కంఠ.. బంతి బంతికి మారుతున్న సమీకరణం.. మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు ముని వేళ్ల మీద నిలబడ్డారు. టెన్షన్ తట్టుకోలేక దేవుడిని ప్రార్థించారు.. కాని చివరికి దేవుడి దీవెనలు టీమిండియా కే దక్కాయి. మొత్తంగా రెండవసారి టీమిండియాను టీ20 వరల్డ్ కప్ విజేతను చేశాయి. చివరి ఓవర్ లో అద్భుతంగా బౌలింగ్ చేసిన హార్దిక్ పాండ్యా టీమిండియా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.

శనివారం బార్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 59 బంతుల్లో 76 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అక్షర పటేల్ 47 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. 34 పరుగులకే కీలకమైన రోహిత్ శర్మ 9, రిషబ్ పంత్ 0, సూర్య కుమార్ యాదవ్ 3 పరుగులకే అవుట్ అయ్యారు. ఈ దశలో టీమిండియా ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను విరాట్ కోహ్లీ భుజాలకు ఎత్తుకున్నాడు. అక్షర్ పటేల్ తో కలిసి నాలుగో వికెట్ కు 72 పరుగులు జోడించాడు. అక్షర్ పటేల్ 47 పరుగుల వద్ద అవుటయినప్పటికీ.. ఆ తర్వాత మైదానంలోకి వచ్చిన శివం దూబే(27) తో కలిసి విరాట్ ఐదో వికెట్ కు 57 పరుగులు జోడించాడు. ఫలితంగా టీం ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో నోర్ట్జే, కేశవ్ మహారాజ్ తలా రెండు వికెట్లు దక్కించుకున్నారు. జాన్సన్ ఒక వికెట్ పడగొట్టాడు.

177 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఏడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. క్లాసెన్ 52(27 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. దక్షిణాఫ్రికా 12 పరుగులకే ఓపెనర్ హెండ్రిక్స్(4), కెప్టెన్ మార్క్రం (4) వికెట్లను కోల్పోయింది. అయితే ఈ దశలో మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ (39), స్టబ్స్(31) దక్షిణాఫ్రికా ను కాపాడే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్ కు 58 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న వీరి జోడిని అక్షర్ పటేల్ విడదీశాడు. ఈ దశలో వచ్చిన క్లాసెన్ భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. చూస్తుండగానే అర్థ సెంచరీ సాధించాడు. కేవలం 27 బంతుల్లో రెండు ఫోర్లు, ఐదు సిక్సర్ల సహాయంతో 52 పరుగులు చేశాడు. వాస్తవానికి ఇతడు క్రీజ్ లో ఉన్నంత సేపు టీమ్ ఇండియాకు గెలుపుపై ఆశలు లేవంటే అతిశయోక్తి కాదు. అక్షర్ పటేల్ వేసిన ఓవర్లో క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫలితంగా సాధించాల్సిన పరుగులు, వేయాల్సిన ఓవర్లు సమం అయిపోయాయి. ఈ దశలో 39 పరుగులు చేసిన క్వింటన్ డికాక్ ను అర్ష్ దీప్ సింగ్ అవుట్ చేశాడు. దీంతో భారత జట్టు కాస్త ఊపిరి పీల్చుకుంది. మరోవైపు హార్దిక్ పాండ్యా క్లాసెన్ కు ఊరించే బంతి వేసి బోల్తా కొట్టించాడు. దీంతో అప్పుడు మ్యాచ్ మరోసారి భారత్ వైపు మొగ్గింది.

ఇక కీలకమైన చివరి ఓవర్లను హార్దిక్ పాండ్యా, అర్ష్ దీప్ సింగ్ కట్టుదిట్టంగా వేయడంతో.. దక్షిణాఫ్రికా చేతులెత్తేసింది. ఒత్తిడిలో పరుగులు చేయకుండా చోకర్ టీం అని నిరూపించుకుంది. వాస్తవానికి వన్డే వరల్డ్ కప్ ఫైనల్, టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్లో ఒత్తిడికి తలవంచిన టీమిండియా.. టి20 వరల్డ్ కప్ ఫైనల్లో మాత్రం అద్భుతంగా ఆడింది. మ్యాచ్ చేయి జారుతున్న ప్రతి సందర్భంలోనూ.. ఫినిక్స్ పక్షి లాగా పుంజుకుంది..ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా కీలకమైన మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అర్ష్ దీప్ సింగ్, బుమ్రా చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు.. 17 సంవత్సరాల తర్వాత టీమిండియా రెండవసారి టి20 వరల్డ్ కప్ సాధించడంతో కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో అలా పడుకుని ఉండిపోయాడు. బార్బడోస్ మైదానానికి ప్రేమతో ముద్దు ఇచ్చాడు. కీలకమైన ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోవడంతో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కన్నీటి పర్యంతమయ్యారు.