Virat Kohli And Rohit Sharma Retirement: ఇటీవల కాలంలో ముఖ్యంగా క్రికెట్లో విపరీతంగా చర్చకు దారి తీసిన, తీస్తున్న ప్రశ్న ఏదైనా ఉందంటే అది విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటర్మెంట్ కు సంబంధించిందే. టి20, టెస్ట్ ఫార్మాట్లకు వారిద్దరు శాశ్వత వీడ్కోలు పలకడంతో చాలామంది పరిమిత ఓవర్ల ఫార్మాట్ నుంచి కూడా వారిద్దరూ తప్పుకుంటారని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అయితే దీనిపై అటు విరాట్, రోహిత్ శర్మ ఇంతవరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే దీనిపై తాజాగా కూడా ఒక చర్చ మొదలైంది. అయితే ఈసారి ఏకంగా బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ స్పందించక తప్పలేదు.
త్వరలోనే టీమ్ ఇండియా ఆస్ట్రేలియాలో పర్యటించబోతోంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఆస్ట్రేలియాతో పోటీ పడబోతోంది. మొత్తంగా మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా ఆడబోతోంది. ఇందులో భాగంగా ఈనెల 19న పెర్త్ వేదికగా టీమిండియా ఆస్ట్రేలియాతో తొలి వన్డే ఆడుతుంది. వాస్తవానికి రెండు జట్లు దిగ్గజాలు కావడంతో పోటీ హోరుగా సాగే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు టీమ్ ఇండియాకు గిల్ నాయకత్వం వహిస్తున్నాడు. సారధిగా అతనికి ఇదే తొలి వన్డే సిరీస్. అటు రోహిత్, విరాట్ సాధారణ ఆటగాళ్లు గానే ఆడబోతున్నారు. వీరిద్దరి ఆట తీరుపై అభిమానులకు భారీగా ఆశలు ఉన్నాయి. మునుపటి మాదిరిగా వీరిద్దరూ అదరగొడతారని అభిమానులు భావిస్తున్నారు.
అయితే ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత రోహిత్, విరాట్ పరిమిత ఓవర్ల ఫార్మాట్ నుంచి కూడా తప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది.. అయితే దీనిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. మరోవైపు 2027 వన్డే వరల్డ్ కప్ వరకు రోహిత్, విరాట్ జట్టులో ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరికొందరేమో వారిద్దరి రిటైర్మెంట్ పై విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఈసారి రోహిత్, విరాట్ రిటైర్మెంట్ కి సంబంధించిన ప్రచారంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్ల స్పందించారు. రోహిత్, విరాట్ గొప్ప ప్లేయర్లు అని రాజీవ్ పేర్కొన్నారు. వారిద్దరి ఆట జట్టుకు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. వీడ్కోలు పలకడం అనేది వారిద్దరి ఇష్టమని.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్ మాత్రం వారికి చివరిది కాదని రాజీవ్ క్లారిటీ ఇచ్చారు. అలాంటి ఆలోచన పెట్టుకోవద్దని స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా సిరీస్లో వారిద్దరూ అద్భుతంగా ఆడతారని రాజీవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం రోహిత్ ఆస్ట్రేలియా సిరీస్ కోసం సిద్ధమవుతున్నాడు. మైదానంలో విపరీతంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. తనను ఇబ్బంది పెట్టే బంతులను పదేపదే ఎదుర్కొంటున్నాడు. ఈసారి ఆస్ట్రేలియా ప్లేయర్లకు ఏమాత్రం అవకాశం లేకుండా ఉండాలని రోహిత్ భావిస్తున్నాడు. మరోవైపు విరాట్ ఇంతవరకు ప్రాక్టీస్ మొదలు పెట్టలేదు. అతడు నేరుగా లండన్ నుంచి ఇండియాకు వచ్చాడు. టీమిండియా తో కలిసి ఆస్ట్రేలియాలో అడుగు పెట్టబోతున్నాడు. అయితే సిరిస్ ప్రారంభానికి ముందు లభించే సమయంలో విరాట్ ప్రాక్టీస్ చేస్తాడని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.