
ఇంగ్లండ్ క్రికెటర్ల నోటి దురుసే భారత ఆటగాళ్లలో కసిని పెంచాయని.. అదే భారత ఆటగాళ్లు అద్భుతంగా ఆడడానికి దారి తీసి వారిని చిత్తుగా ఓడించాయని తెలుస్తోంది. నిజానికి ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఇండియా ఓటమి నుంచి గెలిచిందంటే అదంతా బౌలర్ల ఘనతనే..
బ్యాటింగ్ లోనూ బుమ్రా, షమీలు రెచ్చిపోయి భారత్ కు ఆధిక్యాన్ని అందించారు. ఇంగ్లండ్ ఆటగాళ్లు స్లెడ్జింగ్ చేస్తూ తిట్టడంతో కసిగా బ్యాటింగ్ చేసి భారత్ ను ఓటమి నుంచి గెలిచే స్థితికి తీసుకొచ్చారు. షమీ ఆఫ్ సెంచరీతో చెలరేగితే.. బుమ్రా సహకరించి 30కి పైగా పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లండ్ ముందు 271 పరుగుల లక్ష్యాన్ని ఇండియా ఉంచింది. అయితే ఇంగ్లండ్ కేవలం 60 ఓవర్లు ఆడడం పెద్ద కష్టం కాదని మ్యాచ్ డ్రా అవుతుందని అందరూ అనుకున్నారు.
కానీ మనల్ని తిట్టిన ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘నరకం’ చూపించాలని కోహ్లీ అన్న మాటలే బౌలర్లలో కసిని పెంచాయని తెలిసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ వల్లే బౌలర్లు కసిగా బౌలింగ్ చేశారని..అతడి హితబోధనే భారత్ ను మ్యాచ్ లో పట్టుబిగించేలా చేసిందని అంటున్నారు.
ఆఖరి రోజు షమీ, బుమ్రా దంచికొట్టుడుకు టీమిండియా భారీ స్కోరు చేసింది. అయితే భోజన విరామం తర్వాత ఒక ఓవర్ కే స్కోరును సమం చేసి ఇంగ్లండ్ కు ఊహించని షాక్ ఇచ్చాడు కోహ్లీ. ఇది తెలియని ఇంగ్లండ్ ఆటగాళ్లు మానసికంగా దెబ్బతిన్నారు. ఆలౌట్ చేయలేక.. ఏకంగా ఇండియా లక్ష్యం విధించడం చూసి ఖంగుతిన్నారు.
ఇక ఫీల్డింగ్ కు రెడీ అయిన భారత ఆటగాళ్లలో కెప్టెన్ కోహ్లీ స్ఫూర్తిని నింపాడు. వారి రోమాలు నిక్కబొడిచేలా మాట్లాడాడని తెలిసింది. ఈ 60 ఓవర్లలో ఇంగ్లండ్ కు నరకం చూపించాలన్న ప్రేరణ నింపాడట.. వారిని ఆలౌట్ చేసినా.. చేయకపోయినా ఈ 60 ఓవర్లు ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ నరకంలో ఉన్నట్లు భావించాలి అని టీమిండియా బౌలర్లకు విరాట్ కోహ్లీ చెప్పాడని తెలిసింది. ముఖ్యంగా ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ ముందు ఎవరైనా నవ్వడం చూశానో.. ఏం జరుగుతుందో చూడండి.. అర్థమైందా? ఈ 60 ఓవర్లు నరకంగా అనిపించాలి’ అని ఆటగాళ్లకు కోహ్లీ హెచ్చరికలు చేసి మరీ భారత్ బాగా ఆడేలా చేశాడని ఇంగ్లండ్ పత్రికలు మీడియా హోరెత్తించాయి. దీన్ని బట్టి ఇంగ్లండ్ ఆటగాళ్ల నోటిదురుసే భారత్ ఆటగాళ్లలో కసిని పెంచాయని తెలుస్తోంది.