Virat Kohli Startup Investment : నేటి కాలంలో సెలబ్రిటీలు ఒక రంగాన్ని మాత్రమే అంటి పెట్టుకొని ఉండడం లేదు. భిన్న రంగాలలో కాలు పెడుతున్నారు. అవసరమైతే వేలు కూడా పెడుతున్నారు. సాధ్యమైనంతవరకు భారీగా వెనకేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే సెలబ్రిటీ ల ఫేం స్థిరంగా ఉండదు. కొత్త నీరు వచ్చిందంటే పాత నీరు క్రమంగా వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ సిద్ధాంతం సెలబ్రిటీలకు కూడా వర్తిస్తుంది. అందువల్లే తమకు ఫేం ఉన్నప్పుడే సెలబ్రిటీలు నాలుగు రాళ్లు వెనకేసుకుంటున్నారు. ఇందులో విరాట్ కోహ్లీ కూడా ఒకడు. కాకపోతే మనదేశ సెలబ్రిటీలలో విరాట్ కోహ్లీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఇతడికి సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ ఉంది. పైగా ఎండార్స్ మెంట్స్ ద్వారా అంతకుమించి అనే స్థాయిలో సంపాదిస్తున్నాడు. అంతటి ఆదాయం ఉన్నప్పటికీ విరాట్ కోహ్లీ ఊరుకోవడం లేదు. విభిన్న రంగాలలో అడుగుపెడుతున్నాడు. ముఖ్యంగా స్తార్టప్ కంపెనీలలో పెట్టుబడులు పెడుతున్నాడు. ఇప్పటికే విరాట్ కోహ్లీ ఒక హోటల్ రన్ చేస్తున్నాడు. దేశంలో ఉన్న ప్రధాన నగరంలో విరాట్ కోహ్లీ హోటల్ కు శాఖలు ఉన్నాయి.
ఇటీవల టెస్ట్ క్రికెట్ కు, గత ఏడాది టీ20 క్రికెట్ కు విరాట్ కోహ్లీ వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న విరాట్ బెంగళూరుకు చెందిన స్పోర్ట్స్ వేర్ కంపెనీ “అజిలి టాస్ స్పోర్ట్స్” లో 40 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాడు. ఈ ఒప్పందంలో భాగంగా విరాట్ కోహ్లీ ఆ కంపెనీలో 1.94 శాతం వాటాను కలిగి ఉంటాడు. ఇప్పటికే డిజిట్ ఇన్సూరెన్స్, ఎంపీఎల్, రేజ్ కాఫీ, వ్రోగ్న్ వంటి స్టార్టప్ కంపెనీలలో విరాట్ పెట్టుబడులు పెట్టాడు. తాజాగా అజిలిటాస్ స్పోర్ట్స్ లో 40 కోట్లు పెట్టుబడి పెట్టడం ద్వారా స్టార్టప్ కంపెనీల సంఖ్యను మరింత పెంచుకున్నాడు.
అజి లిటాస్ స్పోర్ట్స్ కంపెనీని 2023లో ప్రారంభించారు. దీనిని ప్యూమా ఇండియా మాజీ డైరెక్టర్ అభిషేక్ గంగులి స్థాపించారు. ఇది పర్యావరణహితంగా క్రీడా దుస్తులను తయారుచేస్తుంది. పైగా గతంలో ప్యూమాతో 110 కోట్ల ఒప్పందాన్ని విరాట్ కోహ్లీ కుదుర్చుకున్నాడు. ఇటీవల అది ముగిసింది. దీంతో విరాట్ అజిలి టాస్ సంస్థలో పెట్టుబడి పెట్టాడు. 40 కోట్ల పెట్టుబడికి గాను 1,106 ముఖ విలువతో 3.6 లక్షల ప్రిఫరెన్స్ షేర్లను అజిలిటాస్ కంపెనీ విరాట్ కోహ్లీకి కేటాయించింది. విరాట్ కోహ్లీ మాత్రమే కాకుండా అభిషేక్ శర్మ, ఎస్ ఎం లైన్ వెంచర్స్ అనే కంపెనీ కూడా ఈ సంస్థలో మూడు కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారు.. అజిలిటాస్ కంపెనీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ కంపెనీ ఇటీవల అడిడాస్, ఫ్యూమా, న్యూ బ్యాలెన్స్, స్కెచర్స్ వంటి గ్లోబల్ బ్రాండ్లకు అగ్రశ్రేణి తయారీదారుగా ఉన్న మోచికో షూస్ ను ఇటీవల కొనుగోలు చేసింది. అంతేకాదు భారత్, ఆస్ట్రేలియాలో లోట్టో బ్రాండ్ కు లైసెన్సింగ్ హక్కులు కలిగి ఉంది. కోహ్లీ వ్యక్తిగత బ్రాండ్ అయిన వన్8 తో సహా సొంత టేబుల్స్ తయారు చేస్తోంది..
మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం ప్రస్తుతం అజిలి టాస్ కంపెనీ విలువ 2,058 కోట్లుగా తేలింది. విరాట్ కోహ్లీ బ్రాండ్ పవర్ వల్ల ఈ కంపెనీ వేగంగా విస్తరిస్తోంది. మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహిస్తోంది. మనదేశంలోనే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా స్పోర్ట్స్ వేర్ మార్కెట్ ను సరికొత్తగా చూపించే ప్రయత్నం చేస్తోంది. స్పోర్ట్స్ వేర్ లో అన్ని విభాగాల వస్తువులను.. ఉపకరణాలను ఈ సంస్థ పర్యావరణహితంగా తయారుచేస్తోంది. బెంగళూరు కేంద్రంగా ఈ సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది.