MS Dhoni vs Virat : టి20 ఫార్మాట్ కు విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పాడు. సౌత్ ఆఫ్రికా తో జరిగిన టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో 76 పరుగులు చేసి.. టీమ్ ఇండియాను గెలిపించాడు. పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు పలికినప్పటికీ.. వెళ్తూ వెళ్తూ సరికొత్త రికార్డును సృష్టించి వెళ్ళాడు. అయితే ఈ ఘనతను అందుకున్న రెండవ భారతీయ ఆటగాడిగా అతడు నిలిచాడు. టీమిండియాలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ధోని వల్ల కూడా కానిది అతడు చేసి చూపించాడు.
టి20 వరల్డ్ కప్ లో భాగంగా వెస్టిండీస్ వేదికగా శనివారం బార్బడోస్ మైదానంపై జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా దక్షిణాఫ్రికా పై ఉత్కంఠ విజయం సాధించింది. ఏడు పరుగుల తేడాతో గెలుపును అందుకొని.. 17 సంవత్సరాల తర్వాత టి20 వరల్డ్ కప్ ను దక్కించుకుంది.. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత ఐసీసీ టైటిల్ అందుకోవడం భారత జట్టుకు ఇదే తొలిసారి. కీలకమైన ఫైనల్ మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి.. టీమిండియా విజయంలో విరాట్ కోహ్లీ కీలకపాత్ర పోషించాడు. ఇక ఈ పొట్టి ప్రపంచ కప్ టీమ్ ఇండియా అనుకోవడం ద్వారా అతడు ఒక అరుదైన రికార్డును సృష్టించాడు.
ఏకంగా నాలుగు ఐసీసీ టైటిల్స్ అందుకున్న రెండవ భారత క్రికెటర్ గా కోహ్లీ రికార్డ్ సృష్టించాడు. అండర్ 19 వరల్డ్ కప్(2008), వన్డే వరల్డ్ కప్ (2011), ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(2013), టి20 వరల్డ్ కప్(2024) కోహ్లీ అందుకున్నాడు. టీమిండియాకు సుదీర్ఘకాలం కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని కి కూడా ఈ ఘనత సాధ్యం కాలేదు. అతడు తన నాయకత్వంలో టీమిండియాకు మూడు ఐసీసీ టైటిల్స్ అందించాడు. 2007లో టి20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్, 2013లో చాంపియన్స్ ట్రోఫీ లను టీమిండియా కు అందించాడు. ఇక విరాట్ కంటే ముందు యువరాజ్ సింగ్ నాలుగు ఐసీసీ టైటిల్స్ అందుకున్న టీమిండియా ఆటగాడిగా ఉన్నాడు.. యువరాజ్ సింగ్ అండర్ 19 వరల్డ్ కప్ (2000), 2002 ఛాంపియన్స్ ట్రోఫీ (శ్రీలంక – భారత్ సంయుక్త విజేతలు), 2007 t20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ యువరాజ్ అందుకున్నాడు.
అయితే నాలుగు ఐసీసీ టైటిల్స్ అందుకున్న విరాట్ కోహ్లీ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ట్రోఫీ మాత్రం సాధించలేకపోయాడు. టీమిండియా 2021, 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ పోటీల్లో ఆడింది. ఆ జట్లలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. కానీ రెండుసార్లు టీమ్ ఇండియాకు నిరాశ ఎదురయింది. అయితే విరాట్ కోహ్లీ టెస్ట్ ఛాంపియన్షిప్ గదను అందుకోవాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆశిస్తున్నారు. వచ్చే ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరుగుతుంది.