Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుత సీజన్ లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న విరాట్ కోహ్లీ తాజాగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. బెంగళూరు చిన్న స్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో కోహ్లీ రికార్డును సృష్టించాడు.
ఐపీఎల్ లో బుధవారం బెంగళూరు వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా జట్టు ఐదు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. జాసన్ రాయ్ 29 బంతుల్లో 56 పరుగులు చేయగా, నాగ జగదీషన్ 29 బంతుల్లో 27 పరుగులు, వెంకటేష్ అయ్యర్ 26 బంతుల్లో 31 పరుగులు, నితీష్ రానా 21 బంతుల్లో 48 పరుగులు, వైజ్ 3 బంతుల్లో 12 పరుగులు, రింకు సింగ్ 10 బంతుల్లో 18 పరుగులు చేయడంతో కోల్కతా జట్టు 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు 8 వికెట్ల నష్టానికి 179 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 21 పరుగులు తేడాతో ఓటమి చవిచూసింది బెంగళూరు జట్టు. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన విరాట్ కోహ్లీ 37 బంతుల్లోనే 54 పరుగులు చేశాడు. డూప్లెసిస్ 7 బంతుల్లో 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. మహిపాల్ లామ్రార్ 18 బంతుల్లో 34 పరుగులు, దినేష్ కార్తీక్ 18 బంతుల్లో 22 పరుగులు మాత్రమే చేశారు. మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో బెంగళూరు జట్టు ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేసిన విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు.
ఒకే వేదికలో మూడు వేల పరుగులు చేసిన ఏకైక ఆటగాడు..
బెంగళూరు జట్టుకు కొన్నేళ్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలో బెంగుళూరు జట్టు సొంత మైదానం అయిన స్వామి స్టేడియంలో అనేక మ్యాచ్ లు ఆడాడు విరాట్ కోహ్లీ. తాజాగా బుధవారం కోల్కతా జట్టుతో ఆడిన మ్యాచ్ లోను అద్భుతంగా రాణించి 54 పరుగులు చేశాడు. దీంతో ఒకే వేదికపై టి20 లో మూడు వేలకు పైగా రన్స్ చేసిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకు మరే క్రికెటర్ కు సాధ్యం కానీ ఈ రికార్డును కోహ్లీ నెలకొల్పాడు. ఈ సీజన్ లో 5వ అర్థ సెంచరీ నమోదు చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. అలాగే ఈ ఏడాది ఐపీఎల్లో 300 పరుగులు దాటిన తొలి ఇండియన్ ప్లేయర్ గానూ కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. కోల్కతాతో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ.. మిగిలిన ప్లేయర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో బెంగళూరు జట్టు సొంత మైదానంలోనే ఓడిపోవాల్సి వచ్చింది.
ఈ సీజన్ లో అదరగొడుతున్న విరాట్ కోహ్లీ..
ప్రస్తుత సీజన్ లో విరాట్ కోహ్లీ అధరగొడుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్ ల్లో ఐదు అర్థ సెంచరీలతో 300కు పైగా పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లోను ఆడుతున్నాడు. అయితే బెంగళూరు జట్టు ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్ ల్లో నాలుగు మాత్రమే విజయాలు సాధించి.. మరో నాలుగు మ్యాచ్ ల్లో ఓటమిపాలైంది. ప్రస్తుతం పాయింట్లు పట్టికలో బెంగళూరు జట్టు ఐదో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన చేస్తే టోర్నీలో తదుపరి దశకు వెళ్లేందుకు అవకాశం ఉంది. ప్రస్తుతం టీమ్ లో కీలక ఆటగాళ్లయినా విరాట్ కోహ్లీతోపాటు డు ప్లెసిస్, మాక్స్ వెల్ అద్భుతంగా రాణిస్తున్నారు. ఇదే కొనసాగితే బెంగళూరు జట్టు తదుపరి దశకు వెళ్లడం సులభమేనని అభిమానులు భావిస్తున్నారు.