Virat Kohli Birthday: ఆధునిక క్రికెట్లో ఎంతోమంది గొప్ప క్రికెటర్లు ఉండొచ్చు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడొచ్చు. కానీ విరాట్ లాగా ఆడేవాళ్లు ఉండరు. ఆటను ప్రేమించి, ఆటను శ్వాసించే ప్లేయర్ మాత్రం విరాట్ కోహ్లీ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఫార్మాట్ తో సంబంధం లేకుండా పరుగుల వరద పారించే విరాట్ కోహ్లీ.. ఇటీవల టి20 ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. టెస్టులలో తేలిపోతున్నాడు. వన్డేలోనూ అంతగా ప్రభావం చూపించలేకపోతున్నాడు. తినే పద్యంలో అతనిపై విమర్శలు కొనసాగుతున్నాయి.. ఈ క్రమంలో గతంలో అతడు ఆడిన వీరోచిత ఇన్నింగ్స్ చాలా ఉన్నాయి. అందులో ప్రముఖంగా ఈ ఐదు ఉంటాయి.
2012 ఆసియా కప్ లో..
2012లో ఆసియా కప్ లో భాగంగా మీర్పూర్ వేదికగా పాకిస్తాన్ జట్టుతో భారత్ తలపడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 50 ఓవర్లలో 329 పరుగులు చేసింది. 330 రన్స్ టార్గెట్ తో భారత్ రంగంలోకి దిగింది. తొలి ఓవర్ లోనే గౌతమ్ గంభీర్ ఔట్ కావడంతో టీమ్ ఇండియాకు షాక్ తగిలింది. ఆ తర్వాత వచ్చిన విరాట్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 148 బంతుల్లో 183 రన్స్ చేశాడు. 22 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో అతడు ఈ పరుగులు చేశాడు. అంతేకాదు వన్డేలలో కోహ్లీ బెస్ట్ స్కోర్ ఇదే.
కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్లో..
2012లో ఫిబ్రవరి నెలలో కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్ జరగగా.. శ్రీలంక జట్టుతో భారత్ తలపడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆటగాళ్లు 50 ఓవర్లలో 320 పరుగులు చేశారు. అయితే ఈ సిరీస్లో భారత్ ఫైనల్ లో అడుగు పెట్టాలంటే 40 ఓవర్లలోనే ఆ టార్గెట్ చేదించాలి. అయితే 86 పరుగులకే ఓపెనర్లు సెహ్వాగ్, సచిన్ అవుట్ అయ్యారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన విరాట్ 82 బంతుల్లోనే 133 రన్స్ చేశాడు. ఎంత టీమిండియా అత్యంత సులువుగా విజయాన్ని సిద్ధం చేసుకుంది.
ఆస్ట్రేలియాపై అద్భుతం..
ఇక 2016లో మొహాలీ వేదికగా ఆస్ట్రేలియా – భారత్ t20 మ్యాచ్ లో తలపడ్డాయి. ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 160 పరుగులు చేసింది. ఆ తర్వాత టీమిండియా బ్యాటింగ్ ప్రారంభించింది. 8 ఓవర్లకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది. అప్పటికి జట్టు స్కోరు 49 పరుగులు మాత్రమే. ఈ దశలో కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 51 బంతుల్లో 82 పరుగులు చేశారు. అతడి ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.
ఎడ్జ్ బాస్టన్ లో ఇంగ్లాండ్ జట్టుపై..
ఇక 2018 ఆగస్టు నెలలో ఎడ్జ్ బాస్టన్ లో ఇంగ్లాండ్ జట్టుతో భారత్ టెస్ట్ మ్యాచ్ ఆడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో 287 రన్స్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ తొలి వికెట్ కు 50 పరుగులు చేసింది. ఆ తర్వాత వెంటవెంటనే మూడు వికెట్లను కోల్పోయింది. ఆ దశలో విరాట్ అజింక్య రహనే తో కలిసి టీమిండియా ఇన్నింగ్స్ భారాన్ని భుజాలకు ఎత్తుకున్నాడు. 225 బంతులు ఎదుర్కొని 149 పరుగులు చేశాడు.
పాకిస్తాన్ జట్టుపై..
2022 అక్టోబర్లో మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్ – భారత్ తలపడ్డాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 8 వికెట్లు కోల్పోయి 159 రన్స్ చేసింది. అయితే ఆ టార్గెట్ చేజ్ చేయడంలో భారత్ ఇబ్బంది పడింది. 31 రన్స్ కే కీలకమైన నాలుగు వికెట్లు నష్టపోయింది. ఈ దశలో బ్యాటింగ్ చేసిన విరాట్ 53 బంతుల్లో 82 రన్స్ చేశాడు. దీంతో భారత్ అద్భుతమైన విజయం సాధించింది.