IND vs PAK : ఈ రోజు అంటే ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా భారత్, పాకిస్తాన్ మధ్య హై ఓల్టేజీ మ్యాచ్ జరుగనుంది. భారత్ ఈ మ్యాచ్ గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025) సెమీఫైనల్లో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని కోరుకుంటుంది. అలాగే దాయాది జట్టు అయిన పాకిస్తాన్ కి ఈ మ్యాచ్ డు ఆర్ డై మ్యాచ్ లాంటిది. ఈ మ్యాచ్ లో పాక్ గెలవ లేకపోతే టోర్నమెంట్ నుంచి నిష్ర్కమించి ఇంటి బాట పట్టాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో క్రికెట్ దేవుడు విరాట్ కోహ్లీ.. సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది.
విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఫామ్‌లో లేడు కానీ ఈ రోజు కనుక తను మంచి ఇన్నింగ్స్ ఆడితే అనేక రికార్డులు ఆయన సొంతం అయ్యే అవకాశం ఉంది. పాకిస్థాన్‌తో జరిగే నేటి మ్యాచ్ లో సచిన్ రికార్డును బద్దలు కొట్టేందుకు కోహ్లీ రెడీ అవుతున్నారు. సచిన్ రికార్డును బద్దలు కొట్టడానికి విరాట్ కోహ్లీ భారీ ఇన్నింగ్స్ కూడా ఆడాల్సిన అవసరం లేదు. ఈ మ్యాచ్ లో కేవలం 15 పరుగులు చేస్తే సచిన్ రికార్డు బద్దలు అవుతుంది.
విరాట్ కోహ్లీ తన 14 వేల వన్డే పరుగుల మైలు రాయికి కేవలం 15 పరుగుల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం, వన్డే క్రికెట్‌లో కేవలం ఇద్దరు బ్యాట్స్‌మెన్ మాత్రమే 14 వేల పరుగులు చేశారు. సచిన్ టెండూల్కర్, అలాగే శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర. ఈ మార్క్ కు చేరుకున్న మూడవ ఆటగాడిగా కోహ్లీ నేడు నిలవనున్నారు.
సచిన్ టెండూల్కర్ కూడా పాకిస్తాన్‌పై తన 14 వేల వన్డే పరుగులను పూర్తి చేశాడు. తను ఫిబ్రవరి 6, 2006న పెషావర్‌లో 14,000 పరుగులు పూర్తి చేశాడు. ఇది తనకు 359వ ఇన్నింగ్స్.విరాట్ కోహ్లీ ప్రస్తుతం 298 మ్యాచ్‌ల్లో 13985 పరుగులు చేశాడు. ఇందులో 73 అర్ధ సెంచరీలు, 50 సెంచరీలు ఉన్నాయి. 14 వేల పరుగులు పూర్తి చేయడానికి కోహ్లీకి ఇంకా 15 పరుగులు మాత్రమే కావాలి.
విరాట్ కోహ్లీ తన కెరీర్లో ఇప్పటి వరకు పాకిస్థాన్‌తో 16 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతను 52 సగటుతో 678 పరుగులు చేశాడు. పాకిస్తాన్‌పై తన బెస్ట్ స్కోర్ 183 పరుగులు. ఈ ఫార్మాట్‌లో కోహ్లీ పాకిస్థాన్‌పై మూడు సెంచరీలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
భారత్, పాకిస్తాన్ (India vs Pakistan) మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్, నెట్‌వర్క్ 18 ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ JioHotstar లో కూడా ప్రత్యక్ష ప్రసారం కానుంది.