Virat Kohli: కోహ్లీ.. ఈ ఆటగాడిని సమకాలీన క్రికెట్లో పరుగుల యంత్రంగా సంభోదిస్తారు. ఫిట్ నెస్ లో ఇతడికి సరితూగే వారు లేరు. బ్యాటింగ్ లో ఇతడిలా ధాటిగా ఆడేవారు లేరు. ఫీల్డింగ్ లో ఇతడిలా కదిలే వారు లేరు. అందుకే అతడు మంచినీళ్లు తాగినంత ఈజీగా పరుగులు తీస్తాడు. జెర్సీ వేసుకున్నంత సులభంగా సెంచరీలు కొడతాడు. ఇలా స్వేచ్ఛగా ఆడతాడు కాబట్టే సచిన్ రికార్డు బ్రేక్ చేయగలిగాడు. క్రికెట్లో సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నాడు. అలా ఐపీఎల్లోనూ సరికొత్త రికార్డును స్థాపించాడు.
ఐపీఎల్ లో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్లో బెంగళూరు విజయాన్ని దక్కించుకుంది. గురువారం రాత్రి పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 241 రన్స్ చేసింది. విరాట్ కోహ్లీ 92, రజత్ పాటిదర్ 55, గ్రీన్ 46 పరుగులు చేయడంతో బెంగళూరు భారీ స్కోరు చేసింది. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3 వికెట్లు పడగొట్టాడు. విద్వత్ కవేరప్ప రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అయితే ఈ మ్యాచ్లో పంజాబ్ ఆటగాళ్ల నిర్లక్ష్య ఫీల్డింగ్ వల్ల విరాట్ కోహ్లీకి రెండుసార్లు జీవధానాలు లభించాయి. అతడు ఖాతా ప్రారంభించక ముందు, పదిపరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ అయ్యే ప్రమాదాల నుంచి తప్పించుకున్నాడు. ఇక అప్పట్నుంచి కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సర్లు కొట్టి ఆకట్టుకున్నాడు. 92 పరుగులు చేసి అర్ష్ దీప్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. 8 పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయినప్పటికీ, కోహ్లీ సరికొత్త రికార్డులను నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో మూడు జట్లపై వెయ్యికి పైగా పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా విరాట్ నిలిచాడు.
విరాట్ కోహ్లీ పంజాబ్, ఢిల్లీ, చెన్నై జట్ల మీద వెయ్యికి పైగా పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. కోహ్లీ తర్వాతి స్థానాలలో రోహిత్ శర్మ ( కోల్ కతా, ఢిల్లీ), డేవిడ్ వార్నర్(కోల్ కతా, పంజాబ్) ఉన్నారు. వీరిద్దరూ రెండు జట్లపై వెయ్యికి పైగా పరుగులు సాధించాడు.. ఇది మాత్రమే కాకుండా కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు 600కు పైగా పరుగులు సాధించిన ఆటగాడిగా కె ఎల్ రాహుల్ సరసన చేరాడు.. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ 4 సీజన్లలో 600 + పరుగులు సాధించారు. గేల్, డేవిడ్ వార్నర్ తలా మూడుసార్లు, డూప్లెసిస్ రెండుసార్లు అలాంటి ఘనతను అందుకున్నారు.