Andrea Hewitt: టీమిండియాలో సచిన్ టెండూల్కర్ స్థాయిలో గౌరవాన్ని.. పేరును పొందాల్సిన వ్యక్తి వినోద్ కాంబ్లీ.. మొదట్లో అతడు బాగానే ఆడేవాడు. సచిన్ కంటే మెరుగ్గా పరుగులు చేసేవాడు. కానీ క్రమశిక్షణ లోపం వల్ల అతడు తన కెరియర్ మొత్తాన్ని నాశనం చేసుకున్నాడు. మద్యానికి బానిసై.. వివాదాలలో తల దూర్చి పరువు పోగొట్టుకున్నాడు. అందువల్లే అతడు తన కెరియర్ కు అర్ధాంతరంగా ముగింపు పలికాడు. ఇటీవల రమాకాంత్ (సచిన్, వినోద్ కాంబ్లీ గురువు) విగ్రహావిష్కరణ ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమానికి సచిన్, వినోద్ హాజరయ్యారు. అయితే వినోద్ సచిన్ ను ఏమాత్రం గుర్తుపట్టలేకపోయాడు. చివరికి సచిన్ చొరవ తీసుకొని.. వినోద్ దగ్గరికి వెళ్లి.. తన చిన్ననాటి విషయాలు చెప్పేసరికి వినోద్ గుర్తు తెచ్చుకున్నాడు. అప్పటికి వినోద్ నడిచే పరిస్థితిలో లేడు. మూత్రపిండాల సమస్య.. ఇతర వ్యాధులతో అతడు ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం ముంబైలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.. అయినప్పటికీ అతని ఆరోగ్యం ఏమంత బాగుపడ్డట్టు కనిపించడం లేదు. జుట్టు మొత్తం రాలిపోయింది..ముఖం నల్లగా మారింది. అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి లేదు.. చివరికి జ్ఞాపకశక్తి కూడా కోల్పోయాడు. ఒకరకంగా చెప్పాలంటే వినోద్ కాంబ్లీ తన జీవితంలో అత్యంత దుర్భర దశను అనుభవిస్తున్నాడు.
సంచలన నిజం
వినోద్ కాంబ్లీకి సంబంధించి అతడి రెండవ భార్య ఆండ్రియా హెవిట్ తెలిపిన ఒక సంచలన నిజం ఇప్పుడు మీడియాలో చక్కర్లు కొడుతోంది.. ఆండ్రియా వినోద్ కాంబ్లీకి రెండో భార్య. వినోద్ వ్యవహార శైలి నచ్చక 2023 లో విడాకులు ఇవ్వడానికి ఆమె సిద్ధపడింది. విడాకులకు దరఖాస్తు కూడా చేసింది. కానీ అప్పటికి వినోద్ కాంబ్లీ నిస్సహాయ స్థితిలోకి చేరుకున్నాడు. అతని పరిస్థితి చూసి తట్టుకోలేక ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.. ఇటీవల రమాకాంత్ విగ్రహావిష్కరణకు హాజరైన ఆమె..వాంఖడే స్టేడియంలో నిర్వహించిన 50 సంవత్సరాల వేడుకల్లో కూడా పాల్గొంది. ఈ సమయంలో పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ” వినోద్ మద్యానికి బానిస అయ్యాడు. 2006లో అతడికి నాకు వివాహం జరిగింది. కానీ అప్పటికే అతడు విపరీతమైన మద్యపాన ప్రియుడిగా మారిపోయాడు. ఎంత చెప్పినా వినిపించుకోలేదు. దీంతో ఒకానొక దశలో అతడికి విడాకులు ఇవ్వాలని భావించాను. అయితే అతడి పరిస్థితి చూసి ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్నాను. అతని ఆరోగ్యం గురించి నాకు నిత్యం ఆందోళనగా ఉండేది. అతడిని వదిలేసి వెళ్లిపోతే ఒంటరి అవుతాడని భావించి.. విడాకులను తీసుకోలేదు. అతడిది చిన్నపిల్లాడి మనస్తత్వం. అందువల్లే నేను అలా వదిలి వెళ్ళలేకపోయాను. అతడిని నిత్యం చెక్ చేయాల్సి వచ్చేది. పాలు తాగాడా? టిఫిన్ తిన్నాడా? మాత్రలు వేసుకున్నాడా? పడుకున్నాడా? లేక ఎటైనా వెళ్లిపోయాడా? ఇలా ప్రతి విషయంలోనూ కనిపెట్టుకొని ఉండాల్సి వచ్చేది. అతడు మూత్రశాయ వ్యాధితో బాధపడుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం ఆకృతి ఆసుపత్రిలో చేర్పించాం. ప్రస్తుతం అతడు అక్కడే చికిత్స పొందుతున్నాడని” ఆండ్రియా పేర్కొంది. ప్రిలాన్స్ జర్నలిస్ట్ సూర్యాంశి పాండే నిర్వహించిన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఆండ్రియా పాల్గొంది. ఇలా వినోద్ కాంబ్లీకి సంబంధించిన సంచలన విషయాలను వెల్లడించింది.