https://oktelugu.com/

Vinesh Phogat : దేశం యావత్తు వినేశ్ ఫొగాట్ వైపు.. రజతం విషయంలో కోర్టు నిర్ణయం ఏంటంటే?

సోషల్ మీడియాలో ఆమెకు అనుకూలంగా పోస్టులు పెడుతోంది. అంతేకాదు ఆమె మెడల్ సాధించాలని భావిస్తోంది.. ఫైనల్స్ లో ఆడి ఉంటే వినేశ్ ఫొగాట్ గోల్డ్ మెడల్ దక్కించుకొని ఉండేదని నెటిజన్లు ఈ సందర్భంగా కామెంట్లు చేస్తున్నారు. తీర్పు 13వ తారీఖుకు వాయిదా పడడంతో.. కాస్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 10, 2024 10:05 pm
    Verdict on Vinesh Phogat`s Olympic Silver To be Out

    Verdict on Vinesh Phogat`s Olympic Silver To be Out

    Follow us on

    Vinesh Phogat: పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అనర్హత వేటుకు గురైంది. ఫలితంగా ఫైనల్స్ లో పోటీపడే అవకాశాన్ని కోల్పోయింది. తన పోటీపడే కేటగిరీలో 100 గ్రాములు ఎక్కువగా బరువు ఉన్నదనే కారణంతో పారిస్ ఒలింపిక్ నిర్వాహకులు ఆమెకు ఫైనల్స్ లో ఆడే అవకాశాన్ని ఇవ్వలేదు. ఇదే సమయంలో భారత ఒలింపిక్ కమిటీ నిరసన వ్యక్తం చేసినప్పటికీ పారిస్ ఒలంపిక్ కమిటీ పట్టించుకోలేదు. పైగా తమ నిర్ణయమే ఫైనల్ అన్నట్టుగా వ్యాఖ్యానించింది. ఆ బరువు తగ్గించుకునేందుకు వినేశ్ ఫొగాట్ చేయని ప్రయత్నం అంటూ లేదు. జుట్టు కత్తిరించుకుంది. శరీరంలో నుంచి రక్తాన్ని తీసేయించుకుంది. రాత్రి మొత్తం జాగింగ్, సైక్లింగ్ చేసింది. డైట్ కూడా మానేసింది. అయినప్పటికీ ఆమె 100 గ్రాములు బరువు తగ్గలేకపోయింది . దీంతో ఫైనల్స్ ఆడే అవకాశాన్ని కోల్పోయింది.

    ఫైనల్స్ లో ఆడే అవకాశాన్ని కోల్పోయిన నేపథ్యంలో వినేశ్ రజత పతకం కోసం కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్స్ (CAS) ను ఆశ్రయించింది. అయితే దీనిపై శుక్రవారం వాడీ వేడిగా వాదనలు జరిగాయి.. భారత రెజ్లర్ వినేశ్ తరఫున భారత ఒలింపిక్ సంఘం ప్రముఖ న్యాయకోవిదులు హరీష్ సాల్వే, విదుష్పత్ సింఘానియాను నియమించింది.. వారు భారత రెజ్లర్ వినేశ్ తరఫున తమ వాదనలు వినిపించారు. దీనిపై కాస్ అడ్ హాక్ తన నిర్ణయాన్ని శనివారం రాత్రి 9:30 నిమిషాలకు ప్రకటిస్తామని చెప్పింది. ఆ తర్వాత తీర్పును 13వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.. దీంతో ఉత్కంఠ మళ్ళీ మొదలైంది.. ” ఒలింపిక్ క్రీడలకు సంబంధించి కాస్ మధ్య వర్తిత్వ నిబంధనలు రూపొందించింది. ఆ నిబంధనలలో ఆర్టికల్ 18 సరికొత్త విషయాలు వెల్లడిస్తోంది. ఈ ఆర్టికల్ ప్రకారం డివిజన్ అధ్యక్షుడు తన విచక్షణాధికారంతో నిర్ణయం తీసుకోవచ్చు. అయితే ఈ ప్యానల్ కాలపరిమితి ఆగస్టు 10 సాయంత్రం 6 గంటల వరకు (పారిస్ కాలమానం) పొడిగించారు” కాస్ వెల్లడించిన ఒక ప్రకటనలో వివరించింది. అయితే ఈ విచారణ తర్వాత సానుకూల ఫలితం వస్తుందని భారత్ ఒలింపిక్ సంఘం ఆశావాహ దృక్పథంతో ఉంది. కాగా, తీర్పును 13వ తేదీకి వాయిదా వేయడం అందర్నీ మరోసారి ఉత్కంఠలో పడేసింది. వాస్తవానికి వాదనలు జరిగిన తీరు చూస్తే వినేశ్ కు మెడల్ వస్తుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా కాస్ తీర్పును వాయిదా వేయడం విశేషం.

    వినేశ్ కు ఫైనల్స్ అవకాశం ఇవ్వకపోవడంతో అంతర్జాతీయ ఒలంపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాక్ స్పందించారు.”ఆమె పరిస్థితిని నేను అర్థం చేసుకున్నాను. చిన్న చిన్న మినహాయింపులు ఇవ్వచ్చు. అయితే వీటికి ఎక్కడ అడ్డుకట్ట వేయాలనేది అర్థం కావడం లేదు. ఇదే పెద్ద ప్రశ్నగా మారింది. ఇలాంటప్పుడు తీసుకునే నిర్ణయం సమర్థవంతంగా ఉండాలి. అలాంటి నిర్ణయమే పారిస్ ఒలంపిక్ కమిటీ తీసుకుందని నేను భావిస్తున్నాను.. సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతుంటాయి. అయితే వాటన్నింటినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని” బాక్ వివరించారు. బాక్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దేశం మొత్తం వినేశ్ ఫొగాట్ కు రజత పతకం రావాలని కోరుకున్నది. సోషల్ మీడియాలో ఆమెకు అనుకూలంగా పోస్టులు పెడుతోంది. అంతేకాదు ఆమె మెడల్ సాధించాలని భావిస్తోంది.. ఫైనల్స్ లో ఆడి ఉంటే వినేశ్ ఫొగాట్ గోల్డ్ మెడల్ దక్కించుకొని ఉండేదని నెటిజన్లు ఈ సందర్భంగా కామెంట్లు చేస్తున్నారు. తీర్పు 13వ తారీఖుకు వాయిదా పడడంతో.. కాస్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు.