Venkatesh Iyer: ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (KKR vs RCB) చేతిలో ఓటమిపాలైంది. తొలి మ్యాచ్ కాబట్టి కోల్ కతా అభిమానులు ఈ ఓటమిని పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. ఆ తదుపరి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు విజయం సాధించింది. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ టచ్ లోకి వచ్చినట్టేనని అందరూ అనుకున్నారు. కానీ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. సోమవారం ముంబైలో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టుపై ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ముంబై బౌలర్ల దూకుడుకు 116 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఈ సీజన్లో ఇప్పటివరకు అత్యల్ప స్కోర్ చేసిన జట్టుగా చెత్త రికార్డు నమోదు చేసింది.
Also Read: రిజర్వ్ బెంచ్ నుంచి..నిప్పు కణిక లాగా..
23 కోట్లు పెట్టి కొంటే..
కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు లో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు.. వారిలో వెంకటేష్ అయ్యర్ కూడా ఒకడు. గత సీజన్లో వెంకటేష్ అయ్యర్ కోల్ కతా జట్టు సాధించిన విజయాలలో కీలక పాత్ర పోషించాడు. కానీ ఈ సీజన్లో తేలిపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్లలో కలిపి అతడు 23 పరుగులు కూడా చేయలేకపోయాడు. గత వేలంలో కోల్ కతా నైట్ రైడర్స్ యాజమాన్యం వెంకటేష్ అయ్యర్ ను 23.75 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఈ సీజన్లో మూడు మ్యాచ్లకు గానూ.. రెండుసార్లు మాత్రమే వెంకటేష్ అయ్యర్ కు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. అయితే అతడు రెండు మ్యాచ్లలో కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. 23.75 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే ఇలానేనా ఆడేది అంటూ కోల్ కతా అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. వెంకటేష్ అయ్యర్ కంటే విప్రాజ్ నిగం(ఢిల్లీ క్యాపిటల్స్), అనికేత్ వర్మ ( సన్ రైజర్స్ హైదరాబాద్) నయంగా ఉన్నారని సోషల్ మీడియాలో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు అభిమానులు పేర్కొంటున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తో జరిగే తదుపరి మ్యాచ్ లోనైనా వెంకటేష్ అయ్యర్ మెరుగైన ఇన్నింగ్స్ ఆడాలని కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యం భావిస్తోంది. గత సీజన్లో వెంకటేష్ అయ్యర్ మెరుపులు మెరిపించాడు.. జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్ ఆడాడు. బలమైన జట్లపై తిరుగులేని ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యం అతనికి భారీ ధర చెల్లించింది. అంతేకాదు అతడిని వైస్ కెప్టెన్ గా కూడా నియమించింది. కానీ అతడేమో ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోతున్నాడు.