Vaibhav Suryavanshi: వైభవ్ సూర్య వంశీ.. ఈ బిహారీ యువ సంచలనం గురించి ఎంత ఎక్కువ చెప్పినా సరే తక్కువే. తన తోటి ఈడు ఉన్న పిల్లలు స్కూలుకు వెళుతుంటే.. ఇతడు మాత్రం మైదానంలో విధ్వంసం సృష్టిస్తున్నాడు. బ్యాట్ పట్టుకొని సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. ఐపీఎల్ నుంచి మొదలుపెడితే అండర్ 19 క్రికెట్ టోర్నీ వరకు.. విధ్వంసానికి పరాకాష్ట మాదిరిగా బ్యాటింగ్ చేస్తున్నాడు.
బెనోనివేదికగా సౌత్ ఆఫ్రికా అండర్ 19 తో జరుగుతున్న రెండవ యూత్ వన్డేలో భారత్ అండర్ 19 కెప్టెన్ గా వైభవ్ సూర్య వంశీ విధ్వంసృష్టించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి దక్షిణాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు. విల్లో మోర్ పార్క్ లో అతడు కొట్టిన సిక్సర్లు సరికొత్త చరిత్రగా నిలిచిపోయాయి. కేవలం 19 బంతుల్లోనే అతడు హాఫ్ సెంచరీ చేయడం సంచలనం కలిగించింది. అతడి ఇన్నింగ్స్ లో 10 సిక్సర్లు ఉన్నాయి అంటే బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
వైభవ్ సూర్య వంశీ ఇలా సిక్సర్లు కొట్టడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. వాస్తవానికి అతడు స్కూలుకు వెళ్లే బాలుడు. అతడి శరీరం ఇంతటి సామర్థ్యాన్ని కలిగి ఉండడం ఒక రకంగా ఆశ్చర్యమే. అతడు మటన్ ఎక్కువగా తినేవాడు. అందువల్ల అతడి శరీరం పటిష్టంగా మారింది. ఐపీఎల్ లో రాజస్థాన్ జట్టు తరఫున బ్యాటింగ్ చేసిన అతడు దుమ్మురేపాడు. అయితే అతని బ్యాటింగ్ లో ఉన్న క్వాలిటీ.. శరీర సామర్థ్యంలో కనిపించలేదు. రాజస్థాన్ కోచ్ రాహుల్ ద్రావిడ్ సూచనల మేరకు సూర్యవంశీ మెనూ మొత్తం మారిపోయింది.
అతడికి ఎంతో ఇష్టమైన మటన్ దూరమైంది. అంతేకాదు సలాడ్, శరీరానికి సత్వర శక్తిని అందించే ఆహార పదార్థాలు అతని మెనులో చేరిపోయాయి. దీంతో బొద్దుగా ఉండే సూర్యవంశీ స్లిమ్ అయ్యాడు. సులువుగా పరుగులు తీయడం మొదలుపెట్టాడు. బరువు తగ్గడంతో నాజుకుగా కనిపించాడు. తద్వారా నేటి కాలంలో సరికొత్త క్రికెట్ ధృవతారగా ఆవిర్భవించాడు. ఈ వయసులోనే అతడు ఈ స్థాయిలో బ్యాటింగ్ చేస్తుంటే.. జాతీయ జట్టులోకి వచ్చిన తర్వాత అతడు ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడో అంతు పట్టకుండా ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.