Vaibhav Surya Vamsi: సాధారణంగానే అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా.. సోషల్ మీడియా వ్యవహార శైలి ఉంటుంది. ఇక ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతున్న సందర్భంలో సోషల్ మీడియాలో జరిగే ప్రచారం మామూలుగా ఉండదు. అందువల్లే దీనికి సాధ్యమైనంత వరకు క్రికెటర్లు.. ఇతర సెలబ్రిటీలు దూరంగా ఉంటారు. అయినప్పటికీ ఏదో ఒక సందర్భంలో సోషల్ మీడియాకు బలి అవుతూనే ఉంటారు. ఇప్పుడు ఈ జాబితాలో పంజాబ్ జట్టు సహాయజమాని ప్రీతిజింటా చేరిపోయారు. ప్రస్తుత ఐపిఎల్ లో పంజాబ్ జట్టు అద్భుతమైన విజయాలతో దూసుకుపోతోంది. అన్ని కలిసి వస్తే ప్లే ఆఫ్ వెళ్లడానికి రెడీగా ఉంది. పంజాబ్ జట్టుకు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహిస్తున్నాడు. అతడు సారధ్యంలో పంజాబ్ జట్టు గొప్ప గొప్ప జట్లను సైతం మట్టి కరిపించింది. ప్రీతి జింటా పంజాబ్ జట్టుకు సహాయజమానిగా ఉండడంతో.. పంజాబ్ ఆటగాళ్లు ఆడే మ్యాచ్లకు కచ్చితంగా హాజరవుతూ ఉంటారు. వారిని మైదానంలో ఉంటూ ప్రోత్సహిస్తుంటారు. మెరుగ్గా ఆడిన ఆటగాళ్లకు హాగ్ ఇస్తూ.. మరింత ఉత్సాహపరుస్తుంటారు. ప్రీతి జింటా ఇప్పుడు మాత్రమే కాదు.. తను పంజాబ్ జట్టుకు సహ యజమానిగా ఉన్నప్పటి నుంచి ఇలానే వ్యవహరిస్తున్నారు. ప్రీతి జింటా వ్యవహార శైలిపై ఇంతవరకు ఒక్క ఆరోపణ కూడా రాలేదు. అదే కాదు ఆమె కూడా తన హద్దులు దాటి ప్రవర్తించలేదు. మొత్తంగా జెంటిల్మెన్ గేమ్ కు తనవంతుగా గ్లామర్ అద్దే ప్రయత్నం చేసింది. అయితే ఇప్పుడు ఆమె చేయని పని ఒక్కసారిగా సోషల్ మీడియాలో పడి వివాదంగా మారింది.
Also Read: భారత్–పాక్ సరిహద్దులో మళ్లీ ‘బీటింగ్ రీట్రీట్’.. ఎందుకు ప్రారంభమంటే?
డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా ఇప్పుడు రకరకాల ఫోటోలు తెరపైకి వస్తున్నాయి. అందులో ఏది నిజం? ఏది అబద్ధం? అనే విషయాలను పక్కన పెడితే ప్రచారం మాత్రం జోరుగా సాగిపోతోంది. అంతిమంగా ఇటువంటి ఫోటోలు వల్ల సెలబ్రిటీలు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి ఫోటో ఇప్పుడు ఒకటి వెలుగులోకి రావడంతో పంజాబ్ జట్టు సహజమాని ప్రీతిజింటా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రాజస్థాన్ జట్టులో వైభవ్ సూర్యవంశీ అనే ఆటగాడిని ప్రీతి జింటా హగ్ చేసుకున్నట్టు ఇటీవల సోషల్ మీడియాలో ఫోటోలు కనిపించాయి. దీంతో పలు వెబ్ సైట్లు ఇష్టానుసారంగా కథనాలను రాసేశాయి. ఇది వ్యక్తిగతంగా ప్రీతిజింటా కు ఇబ్బంది కలిగించే పరిణామం కావడంతో ఆమె స్పందించక తప్పలేదు. దీంతో తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఆమె తన వివరణ తెలియజేశారు.
“ఇలాంటివి ఎందుకు ప్రచారంలోకి వస్తాయో అర్థం కాదు. ఇవి నిజమో కాదో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. కనీసం వివరణ అడగాలని ఇంగితం కూడా ఉండదు. తమ వ్యూయర్షిప్ కోసం.. కొంతమంది ఎక్కడికైనా దిగుతారు. అలాంటిదే ఇది కూడా. నేను 14 ఏళ్ల బాలుడికి హగ్ ఇవ్వడం ఏంటి? నేను ప్లేయర్లకు బహిరంగంగానే హగ్ ఇస్తాను. అంతేతప్ప దాంట్లో తెర వెనుక వ్యవహారం ఉండదు. ఇలాంటి వ్యక్తులకు ఎలాంటి సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు.. ఇప్పటికైనా నా వివరణ ఇస్తున్నాను. దీనిని పరిగణలోకి తీసుకొని ఇలాంటి చెత్త ప్రచారాన్ని నిలిపివేయాలని కోరుతున్నానని” ప్రీతి జింటా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. మొత్తానికి వైభవ్ సూర్య వంశీకి తాను హాగ్ ఇవ్వలేదని ప్రీతి జింటా క్లారిటీ ఇచ్చారు. డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా అలాంటి ఫోటోలు సృష్టించారని ప్రీతిజింటా స్పష్టం చేశారు. మొత్తానికి వైభవ్ సూర్య వంశీ ఎపిసోడ్ కు ఆమె ఫుల్ స్టాప్ పెట్టేశారు.