https://oktelugu.com/

Ambati Rayudu- TV9: రేటింగ్స్ కోసం అంబటి రాయుడు ని బలి చేసిన టీవీ9

రాయుడు ఎక్కడికి వెళ్లినా, ఎవరితో కలిసి ఆడినా ఆరోపణలు, వివాదాలే. ఈ మాట అన్నది సాక్షాత్తూ రాయుడే. మొదట హైదరాబాద్ జట్టుకు ఆడినప్పుడు శివలాల్ యాదవ్ తో గొడవపడ్డాడు.

Written By:
  • Rocky
  • , Updated On : June 14, 2023 / 11:41 AM IST

    Ambati Rayudu- TV9

    Follow us on

    Ambati Rayudu- TV9: మొదటి స్థానం రెండు వారాల ముచ్చటయ్యింది. రెండు కోట్లు పెట్టి ఏర్పాటు చేసిన హోర్డింగులు, ప్రచారాలు గాలికి కొట్టుకుపోయిన పేలపిండి అయ్యాయి. ఇప్పుడు ఏం చేయాలి? సంచలనమైన వార్తను ప్రజెంట్ చేయాలి. తను ఎలాగూ తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలకు వ్యతిరేకంగా వార్తలు ప్రజెంట్ చేయదు. తన యజమానులు ఇద్దరూ బిజెపి ఫోల్డ్ లో ఉన్నారు. కాబట్టి కుదరదు. ఇలాంటి సమయంలో అర్జెంటుగా ఒక నెగిటివ్ వార్తను కుమ్మేయాలి. అలా ఆ టీవీ9 పెద్దల బుర్రల నుంచి వచ్చిన ఒక ఆలోచన అంబటి రాయుడు. అతడు తెలుగువాడు. జాతీయ జట్టులోకి ఎంపిక ఎందుకు అనేక రాష్ట్రాలు మారాడు. అక్కడి రాజకీయాలు తట్టుకోలేక చివరికి క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. మొన్న జరిగిన ఐపీఎల్ కప్ ను చెన్నై జట్టు గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు గెలిచిన వెంటనే ట్రోఫీని ఏపీ ముఖ్యమంత్రి వద్దకు తీసుకు వచ్చాడు. ఇది చాలు అనుకున్నది టీవీ9. వెంటనే అతడితో నలుగురు యాంకర్లతో బొంబాట్ షో నిర్వహించింది. దీనిని భారీ ఎత్తున ప్రచారం చేసుకుంది. దీన్ని ప్రైమ్ టైంలో ప్రజెంట్ చేయాలి అనుకుంది. కానీ ఎందుకనో టైం షెడ్యూలు మార్చి మొత్తానికి ప్రజెంట్ చేసింది.

    పబ్లిసిటీ ఇచ్చే టాస్క్

    వాస్తవానికి ఒక క్రికెటర్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి బయటి జనానికి తెలియాలంటే దానికి చాలా కసరత్తు అవసరం. ముందుగా మామూలు ప్రశ్నలు అడుగుతూ.. తర్వాత అతడి జీవితంలో ఇలాంటి మలుపులు చోటు చేసుకున్నాయో బయట పెట్టగలగాలి. ఈ సమయంలో సమాధానాలు ఎదుటి వ్యక్తి నోటి నుంచి రాబట్టగలగాలి. ఇతర వ్యక్తులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ఇలా చేస్తే టీవీ9 హిట్ అయ్యేదే. ఎందుకనో దానికి అది చేతకాలేదు. స్టూడియోలో బ్యాట్, వికెట్ల సెట్టింగ్ తో హంగామా చేశారు కానీ.. అసలు విషయాన్ని బయట పెట్టలేకపోయారు. చూడబోతే ఈ షో మొత్తంలో అంబటి రాయుడు అసలు నైజం ఎలా ఉంటుందో బయట జనానికి తెలిసిపోయింది. మొత్తంగా క్రికెట్ వివాదాలు, రాజకీయ వ్యాఖ్యలు చేయించారు. అంబటి రాయుడు రాజకీయాల్లోకి ఇంకా ప్రవేశించలేదు కాబట్టి ఆ విషయాలను పక్కన పెడితే.. క్రికెట్ కెరియర్ లో అంబటి రాయుడు ఎందుకు ఎదగలేదు అన్న విషయాన్ని ఆయన నోటితోనే చెప్పించింది టీవీ9.

    ఎక్కడికి వెళ్లినా..

    రాయుడు ఎక్కడికి వెళ్లినా, ఎవరితో కలిసి ఆడినా ఆరోపణలు, వివాదాలే. ఈ మాట అన్నది సాక్షాత్తూ రాయుడే. మొదట హైదరాబాద్ జట్టుకు ఆడినప్పుడు శివలాల్ యాదవ్ తో గొడవపడ్డాడు. అక్కడ పడలేదని ఆంధ్ర జట్టుకు వెళ్ళాడు. అక్కడ కెప్టెన్ ఎమ్ ఎస్ కె ప్రసాద్ తో వివాదం మొదలైంది. తర్వాత హైదరాబాద్ వచ్చాడు. అక్కడ కూడా ఇదే పరిస్థితి. మళ్లీ బరోడా వెళ్లాడు.. అక్కడ ఏం జరిగిందో మాత్రం చెప్పలేదు. అతడి సన్నిహితులు చెప్పిన దాని ప్రకారం అక్కడ కూడా గొడవలే కావడంతో బయటికి వచ్చాడు. కానీ ఇంతటి సుదీర్ఘ ఎపిసోడ్లో అందరితోనూ గొడవలు పడితే ఎవరిది తప్పు? ఇంతటి విషయం చెప్పడానికి టీవీ9 అవసరం లేదు. సామాన్య మానవుడికి కూడా అర్థమవుతుంది. అంతేకాదు ప్రపంచ కప్పు తనను ఎంపిక చేయకపోవడానికి అప్పటి సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎం ఎస్ పి ప్రసాద్ కారణమని అంబటి ఆరోపించాడు. అంతేకాదు సెలక్షన్ పద్ధతి ఎలా ఉంటుందో తెలిసికూడా ఎమ్మెస్ కే ప్రసాద్ మీద నిందలు వేయడం సరికాదని అదే ప్రోగ్రాంలో చాముండేశ్వరి నాథ్ చెప్పడం విశేషం. ఇక నలుగురు యాంకర్లతో కలిసి సాగిన ఈ బొంబాట్ ప్రోగ్రాం లో తన వైఫల్యాలకు ఇతరులను బాధ్యుల్ని చేయడానికి ఈ ప్రోగ్రాం ఎంచుకున్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి టీవీ9 తన రేటింగ్స్ పెంచేందుకు, అంబటి రాయుడిని జాకీలు పెట్టి లేపేందుకు తీవ్రంగా కృషి చేసింది. పైగా దీనికి క్రీడా పురుగులు అనే టైటిల్ పెట్టి నానాహంగామా చేసింది. విషయాడంబరం కంటే.. వాగాడంబరాన్ని నమ్మకంతో రాయుడికి కోరుకున్న ప్రచారం లభించలేదు. ఇదే సమయంలో కోల్పోయిన నెంబర్ వన్ ర్యాంకు టీవీ9 కు దక్కలేదు. సరి కదా ఎన్టివితో పోస్తే మరో అయిదు అడుగులు కిందికి వెళ్లిపోయింది.. ఈ ఎపిసోడ్లో బకరా అయింది అంబటి రాయుడే.. అందులో ఎటువంటి సందేహం లేదు.