WTC Final 2023- Rohit Sharma: రోహిత్ శర్మకు కఠిన పరీక్ష.. డబ్ల్యూటిసి ఫైనల్ లో నిరూపించుకునే గొప్ప అవకాశం

ప్రత్యర్థి జట్టు ఎంత బలంగా ఉన్నా, ప్రతికూలమైన పరిస్థితులు ఎదురు వస్తున్న ఆత్మ విశ్వాసంతో ఆడితే పై చేయి సాధించడం కష్టమేమీ కాదని టీమ్ ఇండియా గత కొన్ని నెలల్లో జరిగిన అనేక మ్యాచ్ ల్లో రుజువు చేసింది.

Written By: BS, Updated On : June 6, 2023 3:46 pm

WTC Final 2023- Rohit Sharma

Follow us on

WTC Final 2023- Rohit Sharma: ప్రస్తుత ఇండియన్ క్రికెట్ టీమ్ లో అత్యంత ప్రతిభ కలిగిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకడు. సారధ్య నైపుణ్యాలు గొప్పగా ఉన్న ఆటగాళ్లలో రోహిత్ శర్మ ముందు వరుసలో ఉంటాడు. అయితే, రోహిత్ శర్మ ప్రతిభకు అనుగుణంగా భారత జట్టు పగ్గాలు మాత్రం దక్కలేదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కెప్టెన్ గాను జట్టును విజయపథంలో నడిపించి తన సత్తాను నిరూపించుకున్నప్పటికీ.. ఇండియా జట్టులో మాత్రం ఆ అవకాశం దక్కేసరికి చాలా సమయం పట్టింది. ప్రస్తుతం ఇండియా జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ ఐసీసీ టోర్నీలో భారత జట్టుకు విజేతగా నిలిపే గొప్ప అవకాశం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ద్వారా లభించింది. ఈ అవకాశాన్ని ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటాడో అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

భారత జట్టులో అత్యంత ప్రతిభావంతుడైన ఆటగాళ్లలో రోహిత్ శర్మ ఒకడు. అటువంటి రోహిత్ శర్మను ఇండియా జట్టు కెప్టెన్ గా చూడాలన్నది ఎప్పటి నుంచో అభిమానుల కల. అటువంటి కల సాకారం అయింది. కెప్టెన్ గా రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆశించిన స్థాయిలో సాధించిన విజయాలు ఏవి అంటే జవాబు లేదు. గతంలో మాదిరిగా బ్యాటింగ్ లో కూడా మెరుపులు మెరిపించలేకపోతున్నాడు. ఇప్పుడు టెస్ట్ ఛాంపియన్షిప్ రూపంలో బ్యాటర్ గా తనేంటో చాటి చెప్పడానికి.. కెప్టెన్ గా జట్టుకు ఓ అపురూప విజయం అందించడానికి రోహిత్ శర్మకు మంచి అవకాశం దక్కినట్టు అయింది.

ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న ఆస్ట్రేలియా జట్టు..

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాని ఎదుర్కోవడం భారత జట్టుకు అంత తేలిక కాదని అంటున్నారు మాజీలు, విశ్లేషకులు. భీకరమైన పేస్ దళం, పైగా వారికి అనుకూలించే పరిస్థితులు.. ఇవే ఆస్ట్రేలియా జట్టును ఫేవరెట్ గా నిలుపుతున్నాయి. కాబట్టి రోహిత్ సేనకు ఈ మ్యాచ్ కఠిన పరీక్షగానే భావిస్తున్నారు. కానీ, కఠిన ప్రత్యర్థిని, ప్రతికూల పరిస్థితుల్లో ఎదుర్కొని పై చేయి సాధిస్తే.. ఆ విజయానికి వచ్చే విలువే వేరు. ఆ కోణంలో చూస్తే రోహిత్ కు ఇది మంచి అవకాశమే. తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని, నాయకత్వ లక్షణాలను ప్రశ్నిస్తున్న వారికి ఒకేసారి సమాధానం చెప్పడానికి డబ్ల్యూటిసి ఫైనల్ సరైన వేదికగా కనిపిస్తోంది రోహిత్ శర్మకు.

ఆ రెండు ఫార్మాట్లలో అదరగొడుతున్న రోహిత్ శర్మ సేన..

రోహిత్ శర్మ పూర్తి స్థాయిలో టీమ్ ఇండియా పగ్గాలు అందుకుని ఏడాది దాటింది. కానీ, మూడు ఫార్మాట్లలో జట్టును నడిపించింది తక్కువే. టి20 లో మాత్రమే పెద్ద టోర్నీలో జట్టుకు నాయకత్వం వహించాడు. అతడి సారధ్యంలో ఆసియా కప్, టి20 ప్రపంచ కప్ లో టీమ్ ఇండియా విఫలమైంది. టెస్టుల్లో, వన్డేల్లో కెప్టెన్ గా అతని ప్రదర్శన బాగుంది. రోహిత్ పూర్తి స్థాయిలో పగ్గాలందుకున్నాక ఆరు
వన్డే సిరీస్ లో భారత్ నాలుగు నెగ్గింది. రెండు ఓడింది. ఐదు టెస్టుల్లో మూడు గెలిచిన రోహిత్ సేన.. ఒకటి ఓడిపోయింది. మరో మ్యాచ్ డ్రా అయింది. టెస్టుల్లో అతడికి డబ్ల్యూటీసి ఫైనల్ రూపంలో పెద్ద సవాల్ ఇప్పుడే ఎదురవుతోంది. అయితే, ఈ మ్యాచ్ ముంగిట రోహిత్ ఫామ్ ఆశాజనకంగా లేదు. ఐపీఎల్ లో పేలవ ప్రదర్శన చేశాడు. అంతకు ముందు అంతర్జాతీయ క్రికెట్ లో కూడా ఫామ్ సాధారణమే. కానీ, ఇంగ్లాండులో హిట్ మ్యాన్ కు మంచి రికార్డు ఉంది. ఐదు టెస్టుల్లో 402 పరుగులు చేశాడు. ఫైనల్ జరగబోతున్న ఓవర్ లో ఇంగ్లాండ్ పై అతను సెంచరీ చేశాడు. ఇంగ్లాండ్ పిచ్ లపై రోహిత్ కు మంచి అవగాహన ఉంది. కాబట్టి పెద్దగా అనుభవం లేని గిల్ తో కలిసి జట్టుకు మంచి ఆరంభాలు ఇవ్వాల్సిన బాధ్యత అతనిపై ఉంది. ఇక కెప్టెన్ గా మంచి వ్యూహ చతురత ఉన్నవాడిగా తనుకున్న పేరును అతను ఈ మ్యాచ్ లో నిలబెట్టుకోవాల్సి ఉంది.

ఆత్మవిశ్వాసంతో ఆడితే విజయం సాధ్యమే..

ప్రత్యర్థి జట్టు ఎంత బలంగా ఉన్నా, ప్రతికూలమైన పరిస్థితులు ఎదురు వస్తున్న ఆత్మ విశ్వాసంతో ఆడితే పై చేయి సాధించడం కష్టమేమీ కాదని టీమ్ ఇండియా గత కొన్ని నెలల్లో జరిగిన అనేక మ్యాచ్ ల్లో రుజువు చేసింది. ఈ దిశగా జట్టులో ధైర్యం నింపడమే రోహిత్ ముందున్న ప్రధాన కర్తవ్యం. అలాగే, మేలిమి కూర్పుతో సరైన జట్టును బరిలోకి దించడం కూడా అవసరం. పేసర్లను సమర్థంగా ఉపయోగించుకోవడం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు రూపొందించడంలో రోహిత్ తన ముద్రను చూపించాల్సి ఉంది. పరిమిత ఓవర్ల క్రికెట్ లో ప్రపంచ మేటి బ్యాటర్లలో ఒకడిగా పేరున రోహిత్ కు.. టెస్టుల్లో చెప్పుకోదగ్గ మైలురాళ్లు లేవు. కెరీర్ చరమాంకంలో ఉన్న రోహిత్.. టెస్టుల్లో ఇంకెంతో కాలం కొనసాగకపోవచ్చు. కాబట్టి ఈ మ్యాచ్ లో ఉత్తమ బ్యాటింగ్ ప్రదర్శన, నాయకత్వ లక్షణాలతో జట్టును గెలిపిస్తే టెస్ట్ కెరీర్ కు ఘనమైన ముగింపు దక్కినట్టే.

ఆ ఇద్దరూ రాణిస్తే తిరిగే ఉండదు..

డబ్ల్యూటిసి ఫైనల్ లో పేరుకు రోహిత్ ఒక్కడే కెప్టెన్ కానీ.. మంచి రికార్డు ఉన్న మరో ఇద్దరు కెప్టెన్లు అండ కూడా జట్టుకు ఉంది. భారత క్రికెట్ చరిత్రలో కెప్టెన్ గా టెస్టుల్లో అత్యధిక విజయాలు అందుకోవడమే కాక విదేశాల్లో మెరుగైన రికార్డు ఉన్న విరాట్ కోహ్లీకి తోడు.. ఆస్ట్రేలియాలో తాత్కాలిక సారధిగా చారిత్రక విజయాన్ని అందించిన రహనే ఇప్పుడు జట్టులో సభ్యులు. కెప్టెన్సీ వదులుకున్న కొత్తలో కోహ్లీలో ఉత్సాహం తగ్గి, తన ఆట మీద ప్రభావం పడింది. కానీ, గత కొన్ని నెలల్లో విరాట్ ఆటతోపాటు తన తీరు మారింది. రోహిత్ నాయకత్వంలో ఆడే విషయంలో అతను బాగానే సర్దుకున్నట్లు కనిపిస్తున్నాడు. ఇక బేషజాలు పక్కనపెట్టి డబ్ల్యూటీసి ఫైనల్లో జట్టును గెలిపించడానికి బ్యాటర్ గా చేయాల్సినదంతా చేస్తూనే రోహిత్ కు వ్యూహాల్లో విరాట్ కోహ్లీ సహకరించాల్సిన అవసరం ఉంది. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో ఆస్ట్రేలియాపై భారత జట్టుకు చిరస్మరణీయ సిరీస్ విజయాన్నందించిన రహానే సైతం ఇప్పుడు నాయకత్వ బృందంలో తన వంతు పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్ పరంగా మిడిల్ ఆర్డర్లో అతను కీలకంగా మారనున్నాడు. రోహిత్ కూడా వీళ్ళిద్దరితో సమన్వయం చేసుకొని జట్టును సమిష్టిగా నడిపిస్తే కంగారులను కొట్టడం కష్టమేమీ కాదు.