Virat Kohli Records: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టు రెండో టెస్ట్ ఆడుతోంది. ఈ టెస్ట్ ఆడడం ద్వారా సరికొత్త రికార్డును సృష్టించిన కోహ్లీ.. సెంచరీ చేయడం ద్వారా మరో అరుదైన ఘనతను నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే క్రికెట్లో మరో క్రికెటర్ సాధించలేని రికార్డును తన పేరిట నమోదు చేసుకుని మిగిలిన క్రికెటర్లకు అందనంత దూరంలో నిలిచాడు కోహ్లీ.
కింగ్ కోహ్లీ రికార్డుల పరంపర కొనసాగుతోంది. వెస్టిండీస్ తో జరిగిన రెండో టెస్టులో ఆడడం ద్వారా అన్ని ఫార్మాట్లలో కలిపి 500 మ్యాచ్ ఆడిన కోహ్లీ ఈ ఘనత సాధించిన అతి కొద్ది మంది క్రికెటర్లలో ఒకటిగా నిలిచాడు. అలాగే 500 మ్యాచ్ లో సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ రికార్డు నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో 206 బంతులు ఆడిన కోహ్లీ 10 ఫోర్ల సహాయంతో 121 పరుగులు చేశాడు.
కోహ్లీ పేరిట మరిన్ని రికార్డులు నమోదు..
500 మ్యాచ్ లో సెంచరీ చేసిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ నిలవడమే కాకుండా 29వ సెంచరీ మార్కును కూడా అందుకున్నాడు. ఓవరాల్ గా 76వ అంతర్జాతీయ సెంచరీని పూర్తి చేశాడు. అలాగే నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి టెస్ట్ క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన నాలుగో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఇప్పటి వరకు ఈ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి 25 సెంచరీలు నమోదు చేశాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా(24) ను అధిగమించాడు కోహ్లీ. అలాగే వెస్టిండీస్ పై అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు సాధించిన మూడో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఇప్పటి వరకు వెస్టిండీస్ పై 12 సెంచరీలు సాధించాడు. ఈ క్రమంలో డివిలియర్స్ (11) రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు.