BCCI: వరల్డ్ కప్ కు సమయం దగ్గర పడుతోంది. దీంతో టీమిండియాను సిద్ధం చేసే పనిలో బీసీసీఐ నిమగ్నమైంది. వరల్డ్ కప్ లక్ష్యంగా ఈసారి భారత జట్టు బరిలోకి దిగబోతోంది. దీంతో మేటి జట్టును టోర్నీకి పంపించేందుకు బీసీసీఐ సిద్ధం అవుతోంది. అందులో భాగంగానే గాయాల బారినపడి కొన్నాళ్లుగా క్రికెట్ కు దూరంగా ఉన్న కీలక ఆటగాళ్లను సిద్ధం చేసే పనిలో బీసీసీఐ నిమగ్నమైంది. ఇప్పటికే వీరంతా నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ మేరకు బీసీసిఐ వీరికి సంబంధించిన ఒక కీలక అప్డేట్ ను వెల్లడించింది.
భారత్ వేదికగా అక్టోబర్ నుంచి నవంబర్ వరకు వరల్డ్ కప్ జరగనుంది. సుమారు 12 ఏళ్ల తర్వాత భారత్ వేదికగా వరల్డ్ కప్ మ్యాచ్ లు జరగనున్నాయి. చివరిసారిగా భారత్ కూడా 2011 లోనే వరల్డ్ కప్ దక్కించుకుంది. ఆ తర్వాత నుంచి మరో ఐసీసీ ట్రోఫీని భారత్ గెలుచుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ సాధించడమే లక్ష్యంగా భారత జట్టు బరిలోకి దిగుతోంది. సొంత మైదానాల్లో ఆడుతుండడం భారత జట్టుకు కలిసి వస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే మెరుగైన టీమ్ ను వరల్డ్ కప్ కు పంపించేందుకు బీసీసీఐ రంగం సిద్ధం చేస్తోంది.
నేషనల్ క్రికెట్ అకాడమీలో ఆ ఆటగాళ్ల ప్రాక్టీస్..
ప్రమాదాల వల్ల గాయపడి గత కొన్నాళ్ల నుంచి పలువురు కీలక ఆటగాళ్లు క్రికెట్ కు దూరంగా ఉన్నారు. వీరిలో బుమ్రా, ప్రసిద్ధ కృష్ణ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ ఉన్నారు. వీరంతా గత కొన్ని నెలల నుంచి క్రికెట్ దూరంగా చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే, వీరిని నేరుగా టోర్నమెంట్ కు ఎంపిక చేసి పంపించడం వల్ల మెరుగైన ఫలితాలను సాధించడం సాధ్యం కాదు. దీంతో వీరందరూ బీసీసీఐ సూచనలకు అనుగుణంగా నేషనల్ క్రికెట్ అకాడమీలో తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. వీరికి సంబంధించిన కీలక అప్డేట్ ను బీసీసీఐ తాజాగా అందించింది. బుమ్రా, ప్రసిద్ కృష్ణ నెట్స్ లో పూర్తి సామర్థ్యంతో బౌలింగ్ చేస్తున్నారని, ప్రాక్టీస్ గేమ్స్ కూడా ఆడుతున్నట్లు బిసిసిఐ వెల్లడించింది. అలాగే, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టినట్లు కూడా బీసీసీఐ ఇచ్చిన అప్డేట్ లో పేర్కొంది. త్వరలోనే వీరికి ఫిట్నెస్ డ్రిల్ నిర్వహించనున్నట్లు కూడా బీసీసీఐ స్పష్టం చేసింది. అటు రిషిబ్ పంత్ కూడా బ్యాటింగ్, కీపింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు బిసిసిఐ ఇచ్చిన అప్డేట్ లో వెల్లడించింది. గతంలో కంటే పరిస్థితి మెరుగుపడినట్లు బిసిసిఐ తెలిపింది. బీసీసీఐ ఇచ్చిన తాజా అప్డేట్ తో క్రికెట్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కీలక ఆటగాళ్లు కోలుకుంటుండడంతో వరల్డ్ కప్ లో హాట్ ఫేవరెట్ గా భారత జట్టు బరిలోకి దిగుతుందని పలువురు పేర్కొంటున్నారు.