WTC Final : ఓవల్ లో రణమా..? సమర్పణమా..? నేడే ఆఖరి రోజు
ప్రస్తుతం క్రీజులో ఉన్న ఇద్దరు, బయట ఉన్న ముగ్గురు కలిపి ఐదుగురిలో ఏ ఇద్దరు అర్ద సెంచరీ సెంచరీతో రాణించినా జట్టు సులభంగా విజయం సాధించే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Written By:
BS , Updated On : June 11, 2023 / 10:46 AM IST
Follow us on
WTC Final : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ఆఖరి రోజుకు చేరుకుంది. అత్యంత ఆసక్తిని కలిగిస్తున్న ఈ మ్యాచ్ లో భారత జట్టు గెలవాలంటే 280 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా జట్టు గెలవాలంటే. ఏడు వికెట్లను నేలకూల్చాల్సి ఉంది. ఆఖరి రోజు భారత జట్టు వీరోచిత పోరాటం చేసి విజయం సాధిస్తుందా..? ఆత్మరక్షణతో ఆడి డ్రా గా ముగిస్తుందా..? ఆస్ట్రేలియా బౌలింగ్ దాటికి చేతులెత్తేసి మ్యాచ్ సమర్పించుకుంటుందా..? అన్నది ఆసక్తిని కలిగిస్తోంది.
అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. మొదటి ఇన్నింగ్స్ లో దారుణంగా విఫలమైన భారత బ్యాటర్లు.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం పోరాట పటిమను కనబరుస్తున్నారు. చివరి రోజు అయిన ఆదివారం 280 పరుగులను చేస్తే భారత జట్టు విజయం సాధించేందుకు అవకాశం ఉంటుంది. చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. క్రీజులో విరాట్ కోహ్లీ, రహానే ఆశావహ దృక్పథంతో ఆడుతుండడం భారత్ జట్టుకు కలిసి వస్తుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
జోరుగా ఆడిన రోహిత్ శర్మ, గిల్..
నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టు 296 పరుగుల ఆధిక్యంతో ఉంది. నాలుగో రోజు ఆట ప్రారంభించిన తర్వాత 270/8 పరుగులు వద్ద ఆస్ట్రేలియా జట్టు డిక్లేర్ చేసింది. దీంతో భారత జట్టు 444 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. రోహిత్ శర్మ, గిల్ విజయమే లక్ష్యంగా బ్యాటింగ్ సాగించినట్లు వారి ఆట తీరు చూస్తే కనిపించింది. ఏడు ఓవర్లలోనే 41 పరుగులు చేసి భారత జట్టు విజయం వైపు దూసుకెళ్తున్నట్లు కనిపించింది. అయితే అనూహ్యంగా ఎంపైర్ నిర్ణయం వల్ల గిల్ 8వ తొలి బంతికి 41 పరుగులు వద్ద బొలాండ్ కు వికెట్ సమర్పించుకున్నాడు. అయితే, ఈ ఔట్ వివాదాస్పదంగా మారింది. గిల్ ఔట్ అయిన తర్వాత కూడా రోహిత్ శర్మ జోరు కొనసాగింది. 60 బంతుల్లో 43 పరుగులు చేసి 92 పరుగుల వద్ద రెండో వికెట్ రూపంలో రోహిత్ శర్మ వెనుదిరిగాడు. ఆ వెంటనే 93 పరుగులు వద్ద పుజారా కూడా అవుట్ కావడంతో భారత జట్టు ఇబ్బందుల్లో పడినట్లు కనిపించింది.
93 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన దశలో భారత జట్టు ఇబ్బందుల్లో పడినట్లు కనిపించింది. అయితే, ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ, రహనే ఆచితూచి ఆడడంతో జట్టు మరో వికెట్ కోల్పోకుండా నాలుగో రోజు ఆటను ముగించింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 60 బంతుల్లో 44 పరుగులతో, రహానే 59 బంతుల్లో 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లు ఎంత ఇబ్బందులు పెట్టినప్పటికీ ఈ ఇద్దరు ఆటగాళ్లు క్రీజులో నిలదొక్కుకోవడంతో విజయం దిశగా భారత జట్టు సాగుతున్నట్లు కనిపిస్తోంది. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్ కు 71 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు.
ఐదో రోజు మొదటి సెషన్ కీలకం..
భారత జట్టు విజయం సాధించాలన్న, డ్రా గా మ్యాచ్ ముగించాలన్న ఐదో రోజు మొదటి సెషన్ అత్యంత కీలకము కానుంది. వీరిద్దరూ మొదటి సెషన్ పూర్తయ్యేంత వరకు ఆస్ట్రేలియా పేస్ దళాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటే విజయం, లేదా డ్రాతో మ్యాచ్ ముగించే అవకాశం ఉంది. మొదటి సెషన్ లో వీరిద్దరిలో ఒక్కరు అవుట్ అయిన భారత జట్టు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. మొదటి సెషన్ లో ఫాస్ట్ బౌలర్లతోపాటు రెండో సెషన్ నుంచి స్పిన్నర్లకు పూర్తిగా అనుకూలించే అవకాశం ఉన్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొదటి సెషన్ లో బంతి స్వింగ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఇద్దరు బ్యాటర్లు అప్రమత్తంగా ఆడాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం భారత జట్టు చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. 280 పరుగులు చేస్తే విజయం సాధించే అవకాశం ఉంది. క్రీజులో ఉన్న వీరిద్దరితోపాటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం కలిగిన మరో ముగ్గురు ఆటగాళ్లు ఉన్నారు. శ్రీకర్ భరత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్ చేయగలరు. ప్రస్తుతం క్రీజులో ఉన్న ఇద్దరు, బయట ఉన్న ముగ్గురు కలిపి ఐదుగురిలో ఏ ఇద్దరు అర్ద సెంచరీ సెంచరీతో రాణించినా జట్టు సులభంగా విజయం సాధించే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.