https://oktelugu.com/

Ind Vs Nz 2nd Test: పూణే టెస్టులో మూడు వికెట్లు.. ఆస్ట్రేలియా బౌలర్ ను అధిగమించి ప్రపంచ రికార్డు సృష్టించిన అశ్విన్..

పూణే వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ ఇండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు సాధించాడు.. తద్వారా ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. అశ్విన్ వేసిన తన తొలి ఓవర్ లోనే వికెట్ సొంతం చేసుకున్నాడు. లాథమ్ వికెట్ ను పడగొట్టాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : October 24, 2024 4:47 pm
    Ind Vs Nz 2nd Test(3)

    Ind Vs Nz 2nd Test(3)

    Follow us on

    Ind Vs Nz 2nd Test: లాథమ్ వికెట్ పడగొట్టడం రవిచంద్రన్ అశ్విన్ కు ఇది 9వసారి. లాథమ్ – అశ్విన్ పరస్పరం 11 ఇన్నింగ్స్ లలో తలపడ్డారు. అయితే అతడు తొమ్మిది సార్లు అశ్విని చేతిలో ఆటయ్యాడు. విల్ యంగ్ కూడా అశ్విన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. లెగ్ సైడ్ దిశగా వెళుతున్న బంతిని భారీ షాట్ కొట్టడానికి యంగ్ ప్రయత్నించాడు. ఆ బంతి గ్లవ్స్ ను తగలడం.. దానిని వికెట్ కీపర్ పంత్ పట్టుకోవడం వెంట వెంటనే జరిగిపోయాయి. ఈ క్రమంలో ఫీల్డ్ ఎంపైర్ కు అశ్విన్ అప్పీల్ చేయగా.. అతడు పట్టించుకోలేదు. దీంతో సర్ఫ రాజ్ సూచనతో కెప్టెన్ రోహిత్ శర్మ థర్డ్ అంపైర్ రివ్యూ కోరాడు. రివ్యూ లో బంతి లాథమ్ గ్లవ్స్ ను తాకినట్టు స్పష్టంగా కనిపించింది. దీంతో లాథమ్ అవుట్ అని థర్డ్ అంపైర్ ప్రకటించాడు. ఫలితంగా టీమిండియా కు కీలకమైన వికెట్ లభించింది. అలాగే కాన్వే ను కూడా అశ్విన్ అవుట్ చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. అప్పటివరకు 76 పరుగులు చేసిన కాన్వే సెంచరీ వైపు అడుగులు వేస్తుండగా.. అద్భుతమైన బంతివేసి రవిచంద్రన్ అశ్విన్ అతడిని బోల్తా కొట్టించాడు.

    అరుదైన ఘనత

    రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు సాధించడం ద్వారా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో అత్యధికంగా వికెట్లు పడగొట్టిన బౌలర్ గా ఆవిర్భవించాడు. 2019లో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టోర్నీ ని మొదలుపెట్టింది. ఇప్పటివరకు డబ్ల్యూటీసీ సైకిల్ లో 39 టెస్టులను రవిచంద్రన్ అశ్విన్ ఆడాడు. మొత్తంగా 188 వికెట్లు పడగొట్టాడు. 11సార్లు ఐదు వికెట్ల ఘనతను సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ పేరు మీద ఉండేది. లయన్ 43 టెస్టులలో 187 వికెట్లను పడగొట్టాడు. లయన్ కంటే అశ్విన్ తక్కువ టెస్టులు ఆడాడు. అయినప్పటికీ హైయెస్ట్ వికెట్ టేకర్ గా రికార్డు సృష్టించాడు. అశ్విన్, లయన్ తర్వాత ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ 175, మిచెల్ స్టార్క్ 147, బ్రాడ్ 134, రబాడ 132 వికెట్లతో తర్వాతి స్థానాలలో ఉన్నారు. అయితే వీరిలో కమిన్స్ 42, స్టార్క్ 38, బ్రాడ్ 33, రబడా 28 టెస్టులు ఆడారు. కాగా, ఇటీవలి బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్లో రవిచంద్రన్ అశ్విన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పురస్కారాన్ని దక్కించుకున్నాడు. చెన్నై టెస్టులో ఆరు వికెట్లు పడగొట్టడమే కాకుండా.. సెంచరీ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్ బౌలర్ల జాబితాలోనూ మెరుగైన స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో రవిచంద్రన్ అశ్విన్ తీసిన మూడు వికెట్లు అత్యంత కీలకమైనవి కావడం విశేషం.