T20 Worldcup 2024 : వచ్చే ఏడాది నిర్వహించే టీ20 వరల్డ్ కప్ వేదిక ఖరారైంది. ఈసారి అమెరికాలో ఈ సిరీస్ నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్ణయించింది. ఈ మెగా టోర్నీ కోసం మూడు నగరాలను కూడా ఐసీసీ ఫైనల్ చేసింది.
అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా..
వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్‌కు అమెరికాతోపాటు వెస్టిండీస్ కలిపి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే కరేబియన్ దీవుల్లో క్రికెట్ కోసం ఎన్నో వేదికలు ఉన్నా.. అమెరికాలో మాత్రం క్రికెట్ వసతులు అంతగా లేవు. దీంతో ఎక్కడ నిర్వహిస్తారన్న సందేహాలు నెలకొన్నాయి. మొత్తానికి ఐసీసీ బుధవారం(సెప్టెంబర్ 20) అమెరికాలోని మూడు నగరాలను దీనికోసం ఎంపిక చేసింది.
ఫ్లోరిడా, డల్లాస్, న్యూయార్క్‌లో మ్యాచ్‌లు..
అమెరికాలోని డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్‌లలోని మూడు మైదానాల్లో టీ20 వరల్డ్ కప్ మ్యార్లు నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. ఈమేరకు డల్లాస్ లోని గ్రాండ్ ప్రైరీ.. ఫ్లోరిడాలోని బ్రోవార్డ్ కౌంటీ, న్యూయార్క్‌లోని నాసౌ కౌంటీలను వరల్డ్ కప్ మ్యాచ్‌లకు వేదికలుగా ఐసీసీ ఎంపిక చేసింది. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ల నిర్వహణ కోసమే న్యూయార్క్‌లోని నాసౌ కౌంటీలో 34 వేల మంది కూర్చొని మ్యాచ్ చూసేందుకు వీలుగా ఐసెన్ హోవర్ పార్క్‌లో ఓ స్టేడియం నిర్మించనున్నారు.
వేదికల ఎంపికలో జాగ్రత్తలు..
అమెరికాలో పెద్దగా క్రికెట్ వసతులు లేకపోవడంతో వేదికల ఎంపిక విషయంలో ఐసీసీ చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. మరో రెండు స్టేడియాలు గ్రాండ్ ప్రైరీ, బ్రోవార్డ్ కౌంటీ స్టేడియాల్లోనూ వసతులను మెరుగుపరచనున్నారు. ఫ్లోరిడాలోని లాండెర్హిల్లో ఉన్న బ్రోవార్డ్ కౌంటీ స్టేడియం ఇప్పటికే ఇండియా, వెస్టిండీస్ తోపాటు పలు ఇతర మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చింది. అయితే మిగతా రెండు ప్రాంతాల్లోనే ఇప్పటి వరకూ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరగలేదు. అలాంటిది నేరుగా టీ20 వరల్డ్ కప్ కోసమే అమెరికాను ఆతిథ్య దేశంగా ఎంపిక చేశారు.
అమెరికాలో క్రికెట్ ప్రమోషన్ కోసం…
అమెరికాలో క్రికెట్‌ను ప్రమోట్ చేయడానికే ఐసీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీ20 మ్యాచ్‌ల నిర్వహణ ద్వారా అమెరికాలో క్రికెట్ క్రేజ్ పెంచాలని భావిస్తున్నట్లు ఐసీసీ సీఈవో జెఫ్ అలార్డిస్ తెలిపారు.
2024 జూన్ నుంచి..
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ వచ్చే ఏడాది జూన్ 3 నుంచి జూన్ 30వ తేదీ వరకు జరగనుంది. ఇందులో ట్రోఫీ కోసం 20 జట్లు తలపడనున్నట్లు ఐసీసీ సీఈవో అలార్డిస్ వెల్లడించారు. మొత్తంగా వెస్టిండీస్, అమెరికా కలిపి పది వేదికల్లో ఈ మెగా టోర్నీ జరుగుతుంది.