IPL 2023 : ఈ వెటరన్స్.. ఐపీఎల్ ను దున్నేస్తున్నారంతే

గతానికి భిన్నంగా ఈ ఏడాది ఐపీఎల్ లో పలువురు వెటరన్ ప్లేయర్స్ అదరగొడుతున్నారు. లేటు వయసులో ఘాటైన ప్రదర్శనతో యువకులకు పోటీగా నిలుస్తున్నారు. తమ అద్భుతమైన ప్రదర్శనతో జట్లకు గొప్ప విజయాలను అందించి పెడుతున్నారు. ఈ జాబితాలో ఎక్కువ మంది ప్లేయర్లే ఉండడం గమనార్హం.

Written By: BS, Updated On : May 28, 2023 11:20 am
Follow us on

IPL 2023 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 లో యువ క్రికెటర్లతో పోటీగా పలువురు వెటరన్ ప్లేయర్లు సత్తా చాటారు. అద్భుతమైన ఆట తీరుతో తమలోని సత్తా తగ్గలేదని నిరూపించారు. కొన్ని టీముల్లోని వెటరన్ ప్లేయర్లు కుర్రాళ్లకు ధీటుగా ఆడి అదరగొట్టారు. గతంలో ఎన్నడూ చూడని ఆట తీరుతో ఈ సీజన్ లో రాణించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. కొందరు తమ సహజ శైలికి భిన్నంగా రెచ్చిపోతే.. మరి కొందరు తమ యుక్త వయసులో కూడా ప్రదర్శించని దూకుడును ప్రదర్శిస్తూ తమ జట్ల విజయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. లేటు వయసులో ఏమాత్రం తగ్గకుండా ఘాటు ప్రదర్శన చేస్తున్న ఆటగాళ్లపై మీరూ ఓ లుక్కేయండి.

గతానికి భిన్నంగా ఈ ఏడాది ఐపీఎల్ లో పలువురు వెటరన్ ప్లేయర్స్ అదరగొడుతున్నారు. లేటు వయసులో ఘాటైన ప్రదర్శనతో యువకులకు పోటీగా నిలుస్తున్నారు. తమ అద్భుతమైన ప్రదర్శనతో జట్లకు గొప్ప విజయాలను అందించి పెడుతున్నారు. ఈ జాబితాలో ఎక్కువ మంది ప్లేయర్లే ఉండడం గమనార్హం. ఈ వెటరన్ ప్లేయర్స్ ఆట తీరుతో ఆయా జట్లు ముందడుగు వేశాయంటే అతిశయోక్తి కాదు.
అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్న మోహిత్ శర్మ..
ఈ సీజన్ లో గొప్ప ప్రదర్శన చేస్తున్న వెటరన్ ఆటగాళ్ల జాబితాలో ముందు వరుసలో ఉన్నాడు గుజరాత్ పేసర్ మోహిత్ శర్మ. సరైన అవకాశాలు రాక, చాలా కాలంగా టీమ్ ఇండియాతోపాటు ఐపీఎల్ కు కూడా దూరంగా ఉన్న 34 ఏళ్ల మోహిత్ ను ఈ ఏడాది వేలంలో గుజరాత్ టైటాన్స్ జట్టు నామమాత్రపు రూ.50 లక్షల ధరకు సొంతం చేసుకుంది. ఈ రైట్ ఆర్మ్ పేసర్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సీజన్ లో ఊహించిన దానికి మించి రాణిస్తున్నాడు. 13 మ్యాచ్ ల్లో 24 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ముంబైతో జరిగిన క్వాలిఫైయర్-2 లో అయితే ఆకాశమే హద్దుగా చెలరేగి కెరీర్ అత్యుత్తమ గణాంకాలు (5/10) నమోదు చేశాడు. ఈ సీజన్ కు అతనే అతిపెద్ద సర్ప్రైజ్ అని చెప్పవచ్చు.
అన్ స్టాపబుల్ ఇన్నింగ్స్ ఆడుతున్న రహానే..
ఈ ఏడాది ఐపీఎల్ లో అదరగొడుతున్న మరో వెటరల్ ప్లేయర్ అజింక్య రహానే. 35 ఏళ్ల ఈ వెటరన్ ను చెన్నై జట్టు ఈ ఏడాది వేలంలో కనీస ధర యాభై లక్షలకు సొంతం చేసుకుంది. రహానే తనకు సరైన అవకాశాలు రావడం లేదన్న కసితో ఆడాడో ఏమోగానీ.. అతని శైలికి భిన్నంగా రెచ్చిపోయి మెరుపు ఇన్నింగ్స్ లు ఆడి చెన్నై విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. రహానే ఈ సీజన్ లో 13 మ్యాచ్ లు ఆడి 169.89 స్ట్రైక్ రేటుతో రెండు అర్థ సెంచరీలు సాయంతో 299 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శన కారణంగా అతను టీమిండియాలో కూడా చోటు దక్కించుకున్నాడు.
స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్న పియుస్ చావ్లా.. 
ముంబై జట్టుకు ఆడుతున్న పియూస్ చావ్లా కూడా ఈ ఏడాది అదరగొడుతున్నాడు. 35 ఏళ్ల ఈ వెటరన్ స్పిన్నర్ ను ఈ ఏడాది వేలంలో ముంబై ఇండియన్స్ రూ.50 లక్షలకు సొంతం చేసుకుంది. అంతా అయిపోయిందనుకున్న దశలో ఐపిఎల్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన చావ్లా అంచనాలకు మించి రాణిస్తున్నాడు. తన 15 ఏళ్ల ఐపీఎల్ కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా 16 మ్యాచ్ ల్లో 22 వికెట్లు పడగొట్టి ముంబై క్వాలిఫయర్ చేరడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే అతను ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు (179) సాధించిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు.
చెప్పుకోదగ్గ ప్రదర్శన చేసిన ఇషాంత్ శర్మ.. 
ఈ ఏడాది చెప్పుకోదగిన ప్రదర్శన చేసిన వెటరన్ ప్లేయర్ల జాబితాలో ఇషాంత్ శర్మ కూడా ఉన్నాడు. 35 ఏళ్ల ఈ వెటరన్ పేసర్ ను ఈ ఏడాది వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ.50 లక్షలకు సొంతం చేసుకుంది. గత కొంతకాలంగా క్రికెట్ కు పూర్తిగా దూరంగా ఉంటున్న ఇషాంత్ అనూహ్యంగా సత్తా చాటాడు. 8 మ్యాచుల్లో 10 వికెట్లు పడగొట్టి ఒక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సైతం సొంతం చేసుకున్నాడు. ఇషాంత్ కూడా ఈ ఏడాది సర్ప్రైజ్ ఇచ్చిన ప్లేయర్ అనే చెప్పాలి. వీరితోపాటు ఐపీఎల్ సీజన్ లో గొప్పగా రాణించిన ప్లేయర్లు జాబితాలో మరో ముగ్గురు వెటరన్ ప్లేయర్లు ఉన్నారు. గుజరాత్ జట్టులో విజయశంకర్ అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడు. ఈ జట్టు రూ.1.4 కోట్లకు కొనుగోలు చేసింది. 32 ఏళ్ల విజయశంకర్ 13 మ్యాచ్ ల్లో 160.11 స్ట్రైక్ రేటుతో మూడు అర్థ సెంచరీలు సాయంతో 301 పరుగులు చేశాడు. అలాగే, రాజస్థాన్ రాయల్స్ జట్టులో సందీప్ శర్మ కూడా అదరగొడుతున్నాడు. 12 మ్యాచ్ ల్లో 10 వికెట్లు తీశాడు. లక్నో జట్టులో అమిత్ మిశ్రా అనూహ్యంగా రాణిస్తున్నాడు. ఈ జట్టు రూ.50 లక్షలకు 41 ఏళ్ల ప్లేయర్ ను కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు ఏడు మ్యాచ్ ల్లో ఏడు వికెట్లు పడగొట్టాడు ఈ బౌలర్. వీరు సైతం ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక్కడ మరో ఆశ్చర్యకమైన విషయం ఏమిటంటే.. పై పేర్కొన్న ఆటగాళ్లలో దాదాపుగా అందరూ రూ.50 లక్షలు ధరకు కొనుగోలు చేసింది.