MP Avinash Case : వివేకా హత్యకేసు విచారణ సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. ముఖ్యంగా అవినాష్ ఎపిసోడ్ వచ్చేసరికే ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. అయితే అరెస్టు నుంచి తప్పించుకునేందుకు అవినాష్ రెడ్డి చేయని ప్రయత్నమంటూ లేదు. కోర్టుల్లో పిటీషన్లు, కుటుంబసభ్యుల అనారోగ్య సమస్యలను సాకుగా చూపి తప్పించుకొని తిరుగుతున్నారు. అయితే ఆయన సక్సెస్ అయినట్టు కనిపిస్తున్నా.. ఆయన అరెస్టు ప్రయత్నంలో భాగంగా సీబీఐ వేస్తున్న అనుబంధ పిటీషన్లలో కొత్త పేర్లు బయటపెడుతుండడం హాట్ టాపిక్ గా మారింది. నిన్నటికి నిన్న సీఎం జగన్ పేరు బయటపెట్టగా.. ఇప్పుడు రహస్య సాక్షి ఒకరిపేరును బయటకు తేవడం వెనుక సీబీఐ పక్కా వ్యూహం ఉన్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డికి ఊరట లభించింది. ఈ నెల 31 వరకూ ఆయన అరెస్ట్ వద్దంటూ వెకేషన్ బెంచ్ తీర్పు చెప్పింది. అయితే సీబీఐ తన వాదనలు వినిపించే క్రమంలో ఓ రహస్య సాక్షి ఉన్నారంటూ వెల్లడించడం మాత్రం కొత్త అంశం. దీంతో ఎవరా రహస్య సాక్షి అంటూ అవినాష్ క్యాంప్ గుండెల్లో రైళ్ల పరుగెడుతున్నాయి. రహస్య సాక్షి ఎవరన్నదానిపై ఇప్పటికే వైఎస్ కుటుంబంలోనే ఓ అంచనా ఉందని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై పక్కా సాక్ష్యాలతో ఆ రహస్యసాక్షి సీబీఐకి సహకరిస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు కుటుంబంలోని వారే చెప్పాల్సినదంతా చెప్పాలనుకుంటే ఇక చేయాల్సిందేమీ ఉండదు కూడా.
కేసు విచారణలో సీబీఐ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఢిల్లీ ఆదేశాలతో మెత్తబడినట్టు వార్తలు వస్తున్నా.. అందులో ఎంత నిజం ఉందో అన్నది తెలియడం లేదు. ఒకటైతే మాత్రం పక్కాగా తెలుస్తోంది. కేసులో పట్టుబిగుంపునకే సీబీఐ మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ఒక పద్ధతి ప్రకారమే ఒక్కో పేరు బయటకు తీస్తోంది. అనుబంధ పిటీషన్లు, వాదనల్లోపేర్లు బయటకు తీసి చర్చకు కారణమవుతోంది. మరోవైపు అవినాష్ రెడ్డికి చేజేతులా ఊరటనిచ్చినట్టు వ్యవహరిస్తోంది. అయితే సీబీఐ వ్యవహార శైలి ఎవరికీ అంతుపట్టడం లేదు.
ప్రస్తుతానికైతే అరెస్టులు తప్పించుకోవచ్చు. కానీ మున్ముందు చాలారకాలుగా చిక్కుముళ్లు ఎదురయ్యే అవకాశముంది. వివేకా హత్య తరువాత వైఎస్ కుటుంబం నిలువునా చీలిపోయింది. కొందరు వివేకా కుమార్తె సునీతకు మద్దతుగా నిలుస్తున్నారు. చివరకు జగన్ సోదరి షర్మిళ సైతం సునీతకు న్యాయం జరగాలని కోరుతున్నారు. ఇప్పుడు అదే కుటుంబంలో రహస్య సాక్షి ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆది నుంచి ఈ కేసు విషయంలో సీబీఐ చాలా ఒత్తిళ్లు ఎదుర్కొంటోంది. కానీ తగ్గడం లేదు. మరింత పట్టుదలను పెంచుతోంది. రహస్య సాక్షి విషయాన్ని ఇంత కాలం గుప్తంగా ఉంచడమే దీనికి సాక్ష్యం. సరైన సమయంలో బయట పెట్టారు. అయితే అనుబంధ పిటీషన్ లో జగన్ పేరు ప్రస్తావించడం, ఇప్పుడు రహస్య సాక్షి ఉన్నారని చెప్పడం ద్వారా ఈ కేసు విషయంలో అమీతుమీకి సిద్ధంగా ఉన్నామని సీబీఐ సంకేతాలిచ్చినట్టయ్యింది.