WTC finals 2025 : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లోకి దక్షిణాఫ్రికా తర్వాత వెళ్లే జట్టు ఏది అనే చర్చ మొదలయింది. అయితే ఫైనల్స్ వెళ్లడానికి ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్ జట్టుకు అవకాశాలు ఉన్నాయి. సెంచూరియన్ పార్క్ స్టేడియంలో పాకిస్తాన్ జట్టుతో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా అతి కష్టం మీద రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది.. పాకిస్తాన్ విధించిన 147 పరుగులను.. 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దక్షిణాఫ్రికావిజయంలో రబడా, మార్కోస్ జాన్సన్ కీలకపాత్ర పోషించారు. ఈ గెలుపుతో దక్షిణాఫ్రికా జట్టు వచ్చే ఏడాది ఇంగ్లాండ్ లోని లార్డ్స్ లో జూన్ 11న జరిగే ఫైనల్ మ్యాచ్ లో ఆడనుంది. ప్రస్తుత పాయింట్లు ప్రకారం చూసుకుంటే ఆస్ట్రేలియా రెండు, భారత్ మూడు, న్యూజిలాండ్ నాలుగు స్థానాల్లో ఉన్నాయి. అదృష్టం కలిసి వస్తే శ్రీలంక కూడా ఫైనల్ వెళ్లడానికి అవకాశం ఉంది.. డబ్ల్యూటీసీ సైకిల్ ప్రకారం ఒక జట్టు ఒక మ్యాచ్ గెలిస్తే 12 పాయింట్లు దక్కుతాయి. ఒకవేళ మ్యాచ్ కనుక టై అయితే ఆరు పాయింట్లు లభిస్తాయి. డ్రా అయితే నాలుగు పాయింట్లు యాడ్ అవుతాయి. ఈ పాయింట్ల శాతం ఆధారంగానే ఐసిసి ర్యాంకులు ప్రకటిస్తుంది.. ఇక ఈ జాబితాలో పాయింట్ల పరంగా దక్షిణాఫ్రికా మొదటి స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సైకిల్ లో 11 మ్యాచ్లలో 7 గెలుపులు సొంతం చేసుకుంది. ఇందులో ఒక మ్యాచ్ డ్రా అయింది. మొత్తంగా 88 పాయింట్లు, 66.670 విన్నింగ్ పర్సంటేజ్ తో మొదటి స్థానంలో ఉంది.
భారత్ పరిస్థితి ఏంటంటే..
భారత్ ఇప్పటివరకు 17 మ్యాచ్ లలో తల పడింది. తొమ్మిది మ్యాచ్ లలో మాత్రమే గెలిచింది. 106 పాయింట్లు భారత్ ఖాతాలో ఉన్నాయి. 55.880 విన్నింగ్ పర్సంటేజ్ ఉంది. ఆస్ట్రేలియా జట్టు కూడా దాదాపుగా ఇవే గణాంకాలను కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియా ఇప్పటివరకు 15 మ్యాచ్లలో నాలుగు మాత్రమే కోల్పోయింది. రెండు మ్యాచ్ లను డ్రా చేసుకుంది. ఆస్ట్రేలియా ఖాతాలో 106 పాయింట్లు ఉన్నాయి. 58.890 విన్నింగ్ పర్సంటేజ్ కొనసాగిస్తోంది. అయితే ఈ పాయింట్లు, విన్నింగ్ పర్సంటేజ్ పెంచుకోవాలంటే టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మెల్ బోర్న్, సిడ్ని టెస్టులను కచ్చితంగా గెలవాలి. ఇదే పరిస్థితి ఆస్ట్రేలియాది కూడా. ఒకవేళ మెల్ బోర్న్ టెస్ట్ డ్రా అయితే.. సిడ్నీ టెస్టులో టీమిండియా కచ్చితంగా గెలవాలి. ఇదే సమయంలో శ్రీలంకతో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్ లో సిరీస్ ను ఆస్ట్రేలియా కోల్పోవాల్సి ఉంటుంది. అలా జరిగితే భారత్ కంటే ఆస్ట్రేలియా వెనుకబడి ఉంటుంది. ఇందులో ఏ ఒక్క మ్యాచ్ ఆస్ట్రేలియా గెలిచినా.. భారత్ కంటే ముందు వరసలో ఉంటుంది. పాయింట్లు, పర్సంటేజీలో భారత్ కంటే మెరుగైన దశలో ఉంటుంది. అప్పుడు ఫైనల్ వెళ్లే అవకాశాన్ని అందిపుచ్చుకుంటుంది.