Royal Challengers Bengaluru: ఐపీఎల్ లో అన్ని జట్లది ఒక బాధ అయితే.. బెంగళూరుది మరొక బాధ. ఆ జట్టుకు అన్నీ ఉన్నాయి. బలమైన మేనేజ్మెంట్.. అదరగొట్టే ఆటగాళ్లు.. ఆదరించే అభిమానులు.. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా ఉంది బెంగళూరు పరిస్థితి.. ప్రతి సంవత్సరం టైటిల్ గెలుస్తుందని బలంగా నమ్మడం.. ఆ తర్వాత కీలక మ్యాచ్లలో ఓడిపోవడం బెంగళూరుకు పరిపాటిగా మారింది. ఈ ఏడాది జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో బెంగళూరు జట్టు విజయం సాధించింది. ఆ జట్టు మాదిరే పురుషుల జట్టు కూడా కప్ సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ, జరిగింది వేరు. కీలకమైన ప్లే ఆఫ్ దశలో బెంగళూరు ఇంటిదారి పట్టింది.
ఇటీవల ipl సీజన్లో బెంగళూరు జట్టు అద్భుతంగా ఆడింది. మొదటి స్పెల్ లో దారుణంగా ఓటములు(8 మ్యాచ్లకు ఒకే ఒక్క విజయం) ఎదుర్కొన్నా.. ఆ తర్వాత రయ్యిన దూసుకు వచ్చింది. వరుసగా ఆరు విజయాలు సాధించి ఔరా అనిపించింది. ప్లే ఆఫ్ వెళ్ళాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో.. చెన్నై పై భారీ తేడాతో విజయం సాధించింది. అద్భుతమైన రన్ రేట్ తో ప్లే ఆఫ్ లోకి వెళ్లిపోయింది. ఈ విజయం తర్వాత బెంగళూరు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. టైటిల్ గెలిచిన స్థాయిలో వారు వేడుకలు చేసుకున్నారు.. ఈ దశలో రాజస్థాన్ జట్టుతో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో బెంగళూరు ఆ స్థాయిలో ఆడ లేకపోయింది. దినేష్ కార్తీక్, మాక్స్ వెల్ సరిగ్గా ఆడక పోవడంతో బెంగళూరు కొంపమునిగింది. ఫలితంగా ఆ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ ఓటమితో బెంగళూరు నాలుగవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈ సీజన్లో బెంగళూరు కప్ గెలవక పోయినప్పటికీ.. ఆటతీరుతో అభిమానులను ఆకట్టుకుంది.
ఇక వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ కు మెగా వేలం జరుగుతుంది. ఈ దశలో బెంగళూరు జట్టులో ఎవరు కొనసాగుతారు? ఎవరు బయటికి వెళ్లిపోతారు? అనే ప్రశ్నలు అభిమానుల్లో ఉదయిస్తున్నాయి.. అయితే ఇటీవలి బెంగళూరు వరుస పరాజయాలకు మాక్స్ వెల్ కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతడు వరుస మ్యాచ్లలో డక్ అవుట్ అయ్యాడు..అందువల్ల ఈసారి అతనిపై వేటు పడే అవకాశం ఉంది..మాక్స్ వెల్ తో పాటు బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డూ ప్లెసిస్ కు కూడా ఉద్వాసన పలికే అవకాశం కనిపిస్తోంది.
ఇక ఇప్పటివరకు ఐపీఎల్ 2025 సీజన్ కు సంబంధించి బీసీసీఐ రిటైన్ పాలసీ రూపొందించలేదు. ఒకవేళ గత మెగా వేళాన్ని లెక్కలోకి తీసుకుంటే.. ఒక జట్టు తక్కువలో తక్కువ నలుగురిని మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్రకారం ఇందులో ముగ్గురు టీమిండియా కు చెందిన క్రికెటర్లు, ఒక విదేశీ క్రికెటర్ లేదా ఇద్దరు భారత క్రికెటర్లు, ఇద్దరు విదేశీ క్రికెటర్లు ఉండేందుకు అవకాశం ఉంది. ఇక కొత్త టీమ్స్ రాకతో ఐపీఎల్ 2022 మెగా వేలంలో రైట్ టు మ్యాచ్ (RTM) కు అవకాశం లేకుండా పోయింది. దీని ప్రకారం వేలంలో ఏదైనా ఒక టీం ఒక ఆటగాడిని కొనుగోలు చేస్తే.. ఆర్టీఎం కింద సదరు ఆటగాడికి ఆ నగదు చెల్లించి తీసుకోవచ్చు. రిటైన్, ఆర్టీఎం నిబంధన ప్రకారం ఐదుగురు ఆటగాళ్లను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రకారం వచ్చే మెగా వేలంలో ఎవరికి అవకాశం ఇస్తారో వేచి చూడాల్సి ఉంది.. ప్రస్తుతం అవుతున్న సమాచారం ప్రకారం బెంగళూరులో విరాట్ కోహ్లీ, జాక్స్, రజత్ పాటిదార్, మహమ్మద్ సిరాజ్ లను మాత్రమే రిటైన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆర్టీఎంకు అవకాశం గనుక లభిస్తే కెప్టెన్ ఫాఫ్ డూ ప్లెసిస్ ను తీసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. ఒకవేళ మాక్స్ వెల్ తన పూర్వపు ఫామ్ ను దొరకపుచ్చుకుంటే.. అతడిని కూడా తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.. మరోవైపు చిన్న స్వామి స్టేడియానికి సరిపోయే ఆటగాళ్లను మాత్రమే తీసుకుంటామని బెంగళూరు కోచ్ ఇప్పటికే ప్రకటించాడు.. ఈ ప్రకారం ఆ జట్టు యాజమాన్యం నిర్ణయం ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.