PBKS vs SRH : బలమైన చెన్నైని పడగొట్టింది. అదే ఊపు పంజాబ్ పైనా కొనసాగించాలని హైదరాబాద్ జట్టు భావించింది. అందులో భాగంగానే మైదానంలో తీవ్రంగా సాధన చేసింది. కానీ ఏం జరిగింది? మంగళవారం నాటి మ్యాచ్ లో పంజాబ్ బౌలర్ల ధాటికి బెంబేలెత్తిపోయింది.. ఈ సమయంలో ఆపద్బాంధవుడిలా నిలిచాడు ఓ తెలుగోడు. ఓవైపు వికెట్లు పడుతున్నా.. పంజాబ్ బౌలర్ అర్షదీప్ సింగ్ వికెట్ల మీద వికెట్లు తీస్తున్నా భయపడలేదు. ధీటుగా ఎదుర్కొన్నాడు. ధాటిగా బ్యాటింగ్ చేశాడు. స్థూలంగా చెప్పాలంటే పడిపోతున్న జట్టును నిలబెట్టాడు. భుజ స్కంధాలపై బరువు మోసి.. పరువు కాపాడాడు. లేకుంటే హైదరాబాద్ జట్టు 120 లోపే ప్యాకప్ అయ్యేది.
టాస్ గెలిచిన పంజాబ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. సొంత మైదానం కావడంతో ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ కు స్పష్టమైన అవగాహన ఉంది. దీంతో అతడు బౌలింగ్ వైపు మొగ్గాడు. ఫలితంగా హైదరాబాద్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఓపెనర్లుగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వచ్చారు. ట్రావిస్ హెడ్ ధాటిగా ఆడే క్రమంలో అర్ష్ దీప్ సింగ్ బౌలింగ్ లో శిఖర్ ధావన్ కు క్యాచ్ అవుట్ అయ్యాడు. హెడ్ 15 బంతుల్లో నాలుగు ఫోర్ల సహాయంతో 21 పరుగులు చేశాడు. అతడు ఔటయ్యే సమయానికి హైదరాబాద్ జట్టు స్కోరు 3.2 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే.. అనంతరం వచ్చిన మార్క్రం పూర్తిగా నిరాశపరిచాడు. రెండు బంతులు ఎదుర్కొని అర్షదీప్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇతడు గోల్డెన్ డక్ గా వెను తిరగడంతో హైదరాబాద్ జట్టుకు కోలు కొలేని షాక్ కు గురైంది. ఈ దశలో చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్ లో మెరుపులు మెరిపించిన అభిషేక్ శర్మ.. ఈ మ్యాచ్ లోనూ అదే స్థాయిలో ఆడతాడని అందరూ అనుకున్నారు. కానీ 11 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 16 పరుగులు మాత్రమే చేసి సామ్ కరణ్ బౌలింగ్ లో శశాంక్ సింగ్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
ఇలా కీలక బ్యాటర్లు ఒకరి వెంట ఒకరు అవుట్ కావడంతో హైదరాబాద్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో వచ్చిన తెలుగువాడు నితీష్ రెడ్డి ఒక్కసారిగా ఆట స్వరూపాన్ని పూర్తిగా మార్చేశాడు. ఒకవైపు బ్యాటర్లు ఏమాత్రం అండగా నిలబడకపోయినప్పటికీ.. ఒంటరి పోరాటం చేశాడు. పంజాబ్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. రబడా, సామ్ కరణ్, అర్ష దీప్ సింగ్, హర్షల్ పటేల్, బ్రార్.. ఇలా ఎవరినీ వదిలిపెట్టలేదు. 37 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్ల సహాయంతో ఏకంగా 64 పరుగులు చేశాడు. చివర్లో అర్ష్ దీప్ బౌలింగ్ లో రబాడా కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. హెడ్, అభిషేక్ శర్మ,మార్క్రమ్, రాహుల్ త్రిపాటి వెంట అవుట్ అయినప్పటికీ.. క్లాసెన్, అబ్దుల్ సమద్ తో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు నితీష్ రెడ్డి. ఫలితంగా హైదరాబాద్ జట్టు 182 పరుగులు చేయగలిగింది..
ఎన్నో అంచనాలు పెట్టుకున్న క్లాసెన్ ఈ మ్యాచ్ లో వాటిని అందుకోలేకపోయాడు.. అతడు కేవలం 9 పరుగులు మాత్రమే చేసి హర్షల్ పటేల్ బౌలింగ్ లో క్యాచ్ అవుటయ్యాడు. చివర్లో అబ్దుల్ సమద్ 12 బంతుల్లో 25 పరుగులు చేసి హైదరాబాద్ జట్టు స్కోరును పరుగులు పెట్టించాడు. దీంతో హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. కాగా, పడిపోతున్న హైదరాబాద్ జట్టును తన బ్యాటింగ్ శైలితో కాపాడిన నితీష్ రెడ్డి పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. అతడు ఆడకపోయి ఉంటే హైదరాబాద్ జట్టు ఈ స్థాయిలో స్కోర్ చేసేది కాదు.
హైదరాబాద్ జట్టులో తెలుగు ఆటగాళ్లు లేకపోవడం పట్ల ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో హైదరాబాద్ జట్టు చెన్నైతో జరిగిన మ్యాచ్ లో మయాంక్ అగర్వాల్ స్థానంలో తెలుగు ఆటగాడు నితీష్ రెడ్డిని తీసుకుంది. అతడిని ఈ మ్యాచ్ లోనూ కొనసాగించింది. జట్టు కష్టకాలంలో అతడు ఆపద్బాంధవుడుగా నిలిచి.. హైదరాబాద్ పరువును కాపాడాడు. నితీష్ కుమార్ రెడ్డి కీలకమైన ఇన్నింగ్స్ ఆడడంతో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దానం నాగేందర్ హెచ్చరికల వల్లే హైదరాబాద్ జట్టు యాజమాన్యం తెలుగువాడైన నితీష్ కుమార్ రెడ్డికి అవకాశం కల్పించిందని.. అతడు జట్టు కష్టాల్లో ఉంటే ఆదుకున్నాడని వ్యాఖ్యానిస్తున్నారు.