IPL 2024 SRH Vs MI: ఐపీఎల్ 17వ సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లు ఒక లెక్క.. హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఒక లెక్క. రెండు జట్లది ఏం బ్యాటింగ్? వారెవా? ఫోర్ లతో విరుచుకుపడ్డారు. సిక్సర్లతో సునామీ సృష్టించారు. ఎన్నో రికార్డులను ఉఫ్ మని ఊదేశారు. ఈ మ్యాచ్ లో హైదరాబాద్, ముంబై జట్లు కలిపి 523 పరుగులు చేశాయి. ఐపీఎల్ మాత్రమే కాదు టి20 చరిత్రలోనే ఒక మ్యాచ్ లో ఇన్ని పరుగులు నమోదు కావడం ఇదే ప్రథమం. ఈ మ్యాచ్ ద్వారా రెండు జట్ల బ్యాటర్లు 38 సిక్సర్లు కొట్టారు. పురుషుల టి20 క్రికెట్లో ఇది ఇప్పట్లో ఎవరూ బీట్ చేయలేని రికార్డ్. ఈ సిక్సర్లలో ముంబై ఆటగాళ్లు 20, హైదరాబాద్ ఆటగాళ్లు 18 సిక్సర్లు బాదారు.
ఒకసారి గత రికార్డులు పరిశీలిస్తే
2023లో సెంచూరియన్ లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన టి20 మ్యాచ్ లో పరుగుల వరద పోటెత్తింది. ఈ మ్యాచ్లో రెండు జట్లు 517 పరుగులు చేశాయి. ఇప్పటివరకు టి20 లో ఇదే హైయెస్ట్ రికార్డ్ గా ఉంది. ఈ రికార్డును హైదరాబాద్, ముంబై జట్లు బ్రేక్ చేశాయి. హైదరాబాద్ లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో 38 సిక్సర్లు నమోదు కాగా.. అంతకుముందు ఈ రికార్డు బాల్క్ లెజెండ్స్, కాబుల్ జ్వానాన్ జట్ల మధ్య 2018లో జరిగిన టి20 మ్యాచ్ పేరు మీద ఉండేది. ఈ మ్యాచ్లో 37 సిక్సర్లు ఇరుజట్ల ఆటగాళ్లు కొట్టారు. ఇక 2019 సిపిఎల్ మ్యాచ్లో సెయింట్ కిట్స్, జమైకా తల్లావాస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లోనూ ఇరుజట్ల ఆటగాళ్లు 37 సిక్సర్లు కొట్టారు.
ముంబై పై 277 పరుగులు చేసి ఐపీఎల్ లో హైదరాబాద్ సరికొత్త చరిత్ర సృష్టించింది. అయితే 2013లో పూణే జట్టుపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐదు వికెట్ల కోల్పోయి 263 పరుగులు సాధించింది. ఇప్పటివరకు బెంగళూరు మీదనే ఆ రికార్డు ఉండేది. దానిని తాజాగా హైదరాబాద్ తుడిచిపెట్టింది.
గత ఏడాది ఆసియా క్రీడల్లో మంగోలియా పై నేపాల్ మూడు వికెట్లకు 314 పరుగులు చేసింది.
2019లో డెహ్రాడూన్ లో జరిగిన మ్యాచ్లో ఐర్లాండ్ పై ఆఫ్గనిస్తాన్ 3 వికెట్లకు 278 పరుగులు చేసింది.
2019లో కాంటినెంటల్ కప్ లో చెక్ రిపబ్లిక్ నాలుగు వికెట్లకు 278 పరుగులు చేసింది.
హైదరాబాద్ జట్టు చేతిలో ఓడిపోయినప్పటికీ చేజింగ్ లో ముంబై జట్టు 5 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. ఐపీఎల్ లో చేజింగ్ కు సంబంధించి ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు.
హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో 16 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అంతకుముందు ఈ రికార్డు హైదరాబాద్ జట్టు ఆటగాడు హెడ్ పేరు మీద ఉండేది. అతడు హాఫ్ సెంచరీ చేయడానికి కేవలం 18 బంతులు మాత్రమే ఉపయోగించాడు. అంతకుముందు డేవిడ్ వార్నర్ 2017లో చెన్నై, 2017లో కోల్ కతా తో జరిగిన మ్యాచ్లో 20 బంతుల్లో హాఫ్ సెంచరీలు చేశాడు. హెన్రిక్స్ కూడా బెంగళూరు తో 2015 లో జరిగిన మ్యాచ్లో 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఐపీఎల్ లో ఒకే జట్టు తరుపున తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ఆటగాళ్లుగా అభిషేక్, హెడ్ సరికొత్త చరిత్ర సృష్టించారు.
ఈ మ్యాచ్లో తొలి 10 ఓవర్లలో హైదరాబాద్ జట్టు 148 పరుగులు సాధించింది. ఐపీఎల్ లో తొలి 10 ఓవర్లలో ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు. 2014లో పంజాబ్, 2021లో ముంబై ఇండియన్స్ హైదరాబాద్ జట్టుపై తొలి 10 ఓవర్లలో సాధించిన 131 పరుగులే ఇప్పటివరకు అత్యధికం.
14.4 ఓవర్లలోనే హైదరాబాద్ జట్టు 200 పరుగుల మైలురాయి సాధించింది. ఐపీఎల్ లో ఏ జట్టుకైనా రెండవ వేగవంతమైన డబుల్ సెంచరీ ఇది. 2016లో పంజాబ్ తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు 14.1 ఓవర్లలోనే 200 పరుగుల మైలురాయి సాధించింది. ఐపీఎల్ లో ఇప్పటివరకు బెంగళూరు మీదనే ఆ రికార్డు ఉంది.
ఈ మ్యాచ్లో ముంబై బౌలర్ క్వేనా మపాకా 66 పరుగులు ఇచ్చాడు. 2013లో రాయల్ చాలెంజర్స్ పై జరిగిన మ్యాచ్లో మైఖేల్ నేజర్ 62 పరుగులు ఇచ్చాడు. ఇప్పటివరకు నేజర్ మీద ఆ రికార్డు ఉండేది. ఇప్పుడు మఫాకా ఆ చెత్త రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు.
పవర్ ప్లే లో హైదరాబాద్ జట్టు 81 పరుగులు సాధించింది. 2017లో కోల్ కతా జట్టు 79 పరుగులు చేసింది. 2017లో చెన్నై సూపర్ కింగ్స్ 90 పరుగులు సాధించింది. ఈ ప్రకారం చెన్నై తర్వాత స్థానం హైదరాబాద్ దే.