KKR vs SRH : లీగ్ దశలో అద్భుతంగా ఆడింది. బలమైన ముంబై జట్టుపై 277 రన్స్ చేసింది. విజయవంతమైన జట్టుగా పేరుపొందిన బెంగళూరుపై 287 పరుగులు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఢిల్లీ జట్టుపై జరిగిన మ్యాచ్లో.. పవర్ ప్లే లో 125 పరుగులు చేసి సరికొత్త ఘనతను అందుకుంది. లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో ఏకంగా పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇన్ని ఘనతలు సొంతం చేసుకున్న హైదరాబాద్.. ఫైనల్ మ్యాచ్ లో తేలిపోయింది. కప్ సాధిస్తుందని భావించిన అభిమానుల అంచనాలను తలకిందులు చేసింది. మొత్తంగా ఐపీఎల్ చరిత్రలోనే ఫైనల్ లో అతి తక్కువ స్కోరు నమోదు చేసి, చెత్త రికార్డును తన పేరు మీద లిఖించుకుంది.
లీగ్ దశలో కోల్ కతా తో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఓడిపోయింది. క్వాలిఫైయర్ -1 లోనూ పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ లోనూ ఓడిపోయి తలదించుకుంది. క్వాలిఫైయర్ -1, ఫైనల్ మ్యాచ్ లో హైదరాబాద్ కోల్ కతా చేతిలో 8 వికెట్ల తేడాతో వరుస ఓటములు ఎదుర్కోవడం విశేషం. ఈ ఓటముల నేపథ్యంలో హైదరాబాద్ జట్టు ఆటగాళ్ల ప్రదర్శన పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సీనియర్ క్రికెటర్లు హైదరాబాద్ జట్టు కెప్టెన్, మేనేజ్మెంట్ వ్యవహార శైలిని తప్పుపడుతున్నారు. ఫైనల్ మ్యాచ్ లో వ్యూహాలు అమలు చేయడంలో విఫలమయ్యారని మండిపడుతున్నారు.
వాస్తవానికి మందకొడిగా ఉన్న మైదానంపై ముందుగా బ్యాటింగ్ చేసే జట్టుకు ఇబ్బంది ఉంటుంది. బౌలింగ్ చేసే వాళ్లకు అడ్వాంటేజ్ లభిస్తుంది. ఈ విషయాన్ని హైదరాబాద్ కెప్టెన్ విస్మరించాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకొని తప్పు చేశాడు.. అంతేకాదు ఈ సీజన్లో అంతగా ఆకట్టుకొని మార్క్రమ్ ను ఫైనల్ మ్యాచ్ కు తీసుకున్నాడు. అతడి స్థానంలో న్యూజిలాండ్ హిట్ బ్యాటర్ ఫిలిప్స్ కు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది. ఈ సీజన్ మొత్తం ఫిలిప్స్ రిజర్వ్ బెంచ్ కే పరిమితమయ్యాడు. అబ్దుల్ సమద్ ఫామ్ లో లేకపోయినప్పటికీ అతడిని ఇంఫాక్ట్ ప్లేయర్ గా పంపారు. అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్ ను తీసుకున్నా ప్రయోజనం ఉండేది. కోల్ కతా బౌలర్లు ముందుగా బౌలింగ్ చేసి, వికెట్ల మీద వికెట్లు తీస్తే.. హైదరాబాద్ బౌలర్లు పరుగులు ఇవ్వడంలో పోటీపడ్డారు. కేవలం రెండంటే రెండు వికెట్లు మాత్రమే తీశారు. మొత్తానికి నాసిరకమైన ఆట తీరు ప్రదర్శించి కోల్ కతా ముందు మూడోసారి తలవంచారు. ఆ జట్టుకు మూడవ ఐపీఎల్ కప్ అందించారు.