KKR vs SRH : మూడోసారి కోల్ కతా జట్టు ఐపిఎల్ ట్రోఫీని సగర్వంగా ఎత్తుకుంది. 10 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా హైదరాబాద్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అన్ని రంగాలలో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఫలితంగా ఈ సీజన్లో హైదరాబాద్ జట్టుపై వరుసగా మూడు విజయాలు సాధించి, సరికొత్త రికార్డు సృష్టించింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇది కోల్ కతా జట్టుకు వరంగా మారింది. కోల్ కతా బౌలర్లు హైదరాబాద్ బ్యాటర్లను వణికించారు. ఆ జట్టులో ఏ ఒక్క ఆటగాడు కూడా కనీసం 30 పరుగులు కూడా చేయలేదంటే కోల్ కతా బౌలర్ల బౌలింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.. అభిషేక్ శర్మ, హెడ్, క్లాసెన్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, వంటి ఆటగాళ్లు కోల్ కతా బౌలర్లు సంధించిన బంతులను తట్టుకోలేక వెంట వెంటనే అవుట్ అయ్యారు.. అంతేకాదు హైదరాబాద్ జట్టును 113 పరుగులకే ప్యాకప్ చేశారు.
కోల్ కతా బౌలింగ్ వేసిన సమయంలో మందకొడిగా ఉన్న చెన్నై మైదానం.. ఆ తర్వాత బ్యాటింగ్ కు అనుకూలించింది. ఫలితంగా ఇంకా సగం ఓవర్లు మిగిలి ఉండగానే రెండు వికెట్లు కోల్పోయి, కోల్ కతా జట్టు హైదరాబాద్ విధించిన లక్ష్యాన్ని చేదించింది. ఈ విజయంతో మూడవసారి ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకుంది..
మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన అనంతరం కోల్ కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఉద్వేగానికి గురయ్యాడు.. కోల్ కతా జట్టుకు గుండె చప్పుడు షారుఖ్ ఖాన్ అని అభివర్ణించాడు. షారుక్ ఖాన్ తో ట్రోఫీని అందుకొని ఫోటోకు ఫోజు ఇచ్చాడు. దానిని తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.. ఇది ఇప్పటికే మిలియన్ వ్యూస్ నమోదు చేసుకుంది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది..” కోల్ కతా జట్టు తరఫున ఐపీఎల్ ట్రోఫీ సాధించడం ఆనందంగా ఉంది. మా జట్టుకు గుండె చప్పుడు షారుఖ్ ఖాన్. ఆయన లేకుండా ఈ కీర్తి సాధ్యమయ్యేది కాదని” అయ్యర్ వ్యాఖ్యానించాడు. మరోవైపు షారుఖ్ ఖాన్ తన జట్టు ఎక్కడ ఐపీఎల్ మ్యాచ్ ఆడితే.. అక్కడికి వెళ్లారు. ఊపిరి సలపని షూటింగ్ షెడ్యూల్ ఉన్నప్పటికీ.. వాటన్నిటినీ పక్కనపెట్టి జట్టు ఆటగాళ్లను ప్రోత్సహించారు.. షారుక్ ప్రోత్సాహం వల్లే తాము అద్భుతమైన విజయాలు సాధించామని అయ్యర్ పేర్కొనడం విశేషం.
Special mention to the heartbeat of this team @iamsrk! Thank you for all your words of inspiration and encouragement pic.twitter.com/Lkk4H06Tb2
— Shreyas Iyer (@ShreyasIyer15) May 26, 2024