https://oktelugu.com/

IPL 2023: అదరగొడుతున్న యంగ్ ప్లేయర్స్.. టీమిండియాలో చోటు దక్కేనా!

ఐపీఎల్.. క్రికెట్ స్వరూపాన్నే మార్చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న ఈ మెగా టోర్నీ.. ఎందరో యువకుల్లోని ప్రతిభను బయటకు తీసుకువచ్చింది. ఇందులో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఎంతో మందికి జాతీయ జట్టులోను చోటు దక్కింది.

Written By:
  • BS
  • , Updated On : May 2, 2023 / 03:28 PM IST
    Follow us on

    IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఎంతో మంది యువ క్రికెటర్లు ఈ సీజన్ లో అదరగొడుతున్నారు. పలువురు అన్ క్యాప్డ్ ప్లేయర్లు తమ ప్రదర్శనతో సత్తా చాటుతున్నారు. భవిష్యత్తులో టీమిండియా కు ఎంపిక అయ్యే అవకాశాలను ఈ లీగ్ ద్వారా మెరుగుపరుచుకుంటున్నారు. ఈ జాబితాలో పలువురు యంగ్ క్రికెటర్లు ఉండడం ఇండియన్ క్రికెట్ మేలు కలిగించే అంశంగా పలువురు పేర్కొంటున్నారు.

    ఐపీఎల్.. క్రికెట్ స్వరూపాన్నే మార్చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న ఈ మెగా టోర్నీ.. ఎందరో యువకుల్లోని ప్రతిభను బయటకు తీసుకువచ్చింది. ఇందులో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఎంతో మందికి జాతీయ జట్టులోను చోటు దక్కింది. గతంలో చెన్నై ఆటగాళ్లు శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్ వంటి ఎంతోమంది ప్లేయర్లు అలా వచ్చినవారే. ఈ సీజన్లోనూ అలా మంచి ప్రదర్శన ఇస్తూ అందరి దృష్టిలో పడ్డ ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. తమ అద్భుతమైన ప్రదర్శన, బ్యాటింగ్ నైపుణ్యంతో టీమిండియా జట్టులోకి వచ్చే అవకాశాలను మెరుగుపరుచుకుంటున్నారు. సెలక్టర్ల పిలుపు కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఆ క్రికెటర్ల పై ఓ లుక్కేద్దాం.

    అదరగొడుతున్న యశస్వి జైస్వాల్..

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ ఏడాది ఆధరగొడుతున్న క్రీడాకారుల్లో ముందున్నాడు యశస్వి జైస్వాల్. ఈ సీజన్ లో రాజస్థాన్ ఓపెనర్ యశస్వి ఆటతీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆదివారం ముంబైతో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు ఓటమి పాలైనప్పటికీ.. అతడి వీరోచిత పోరాటం ఎంతగానో ఆకట్టుకుంది. 62 బంతుల్లో 124 పరుగులు చేసి ఆధరహో అనిపించిన అతని ఆట తీరు మ్యాచ్ కు హైలెట్ గా నిలిచింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇప్పటి వరకు ఒక అన్ క్యాప్డ్ ప్లేయర్ నమోదు చేసిన అత్యధిక స్కోరు ఇదే కావడం విశేషం. ఇక ఈ సీజన్ లో నిలకడగా రాణిస్తూ.. ఆరెంజ్ క్యాప్ రేసులోనూ తొలి స్థానంలోకి వచ్చేసాడు ఈ యంగ్ క్రికెటర్. ఈ జాబితాలో ముందున్న డూప్లెసిస్ ను వెనక్కి నెట్టేశాడు యశస్వి జైస్వాల్. ఇందులో మూడు అర్థ శతకాలు, ఒక శతకం ఉంది. ఈ యువ క్రికెటర్ ప్రతిభను మెచ్చుకున్న పలువురు మాజీలు.. ఈ సీజన్ అనంతరం టీమిండియా జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొనియాడుతున్నారు.

    చిచ్చరపిడుగులా రెచ్చిపోతున్న రింకు సింగ్..

    ఐపీఎల్ తాజా సీజన్లో మరో యంగ్ క్రికెటర్ చిచ్చరపిడుగులా రెచ్చిపోతున్నాడు. ఆఖరి ఓవర్ లో ఒత్తిడిని అధిగమించి.. వరుసుగా ఐదు బాల్స్ లో ఐదు సిక్సులు కొట్టి కోల్కతా జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు రింకు సింగ్. ఆ ఇన్నింగ్స్ ను ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేము. అతడు ఇన్నింగ్స్ చూసిన తర్వాత ఐపిఎల్ లో ఏదైనా సాధ్యమే అనిపించింది. చివరి బంతి వరకు ఓటమిని అంగీకరించకూడదు అనే పరిస్థితి ఈ మ్యాచ్ తర్వాత వచ్చింది. ఈ ఒక్క ఇన్నింగ్స్ తోనే అందరి దృష్టిలో పడ్డాడు ఈ యువ క్రికెటర్. తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. 151 స్ట్రైక్ రేట్ తో ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్ ల్లో 270 పరుగులు చేశాడు. ఇందులో 19 సిక్సులు, పదిహేను ఫోర్లు ఉన్నాయి. టీమిండియా లోయర్ ఆర్డర్లో ఫైర్ పవర్ కావాలనుకుంటే రింకు ఆ ప్లేస్ కు సరిగ్గా సరిపోతాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

    విధ్వంసకర ఆటగాడిగా మారిన తిలక్ వర్మ..

    ఐపీఎల్ లో మరో మోస్ట్ టాలెంటెడ్ ప్లేయర్ తిలక్ వర్మ. ఈ ఐపీఎల్ లో అదరగొడుతున్న అన్ క్యాప్డ్ ప్లేయర్లలో ఎక్కువగా చర్చ జరుగుతున్న ఆటగాళ్లలో మన తెలుగు కుర్రాడు వర్మ కూడా ఒకడు. ముంబై జట్టులో అతని ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంటుంది. గత ఏడాది ముంబై తరపున అరంగేట్రం చేశాడు ఈ కుర్రాడు. 2022 వ సీజన్ లో ప్రదర్శనతో ముంబై జట్టు తీవ్రంగా నిరాశపరిచినప్పటికీ.. ఆ జట్టులో తిలక్ మంచి ప్రదర్శనతో అందరి దృష్టిలో పడ్డాడు. ఆడిన తొలి సీజన్లో మొత్తం 397 పరుగులు చేసి తన సత్తా చాటాడు ఈ యువ క్రికెటర్. ఈ ఏడాది ఆడిన తొలి మ్యాచ్ లోనే 84 పరుగులతో బెంగుళూరు పై విరుచుకుపడ్డాడు. ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్ లు ఆడి మొత్తం 248 పరుగులు చేశాడు. అతడి హార్డ్ హిట్టింగ్ పవర్ టీమ్ ఇండియాకు పనికొస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

    మరో చిచ్చర పిడుగు తుషార్ దేశ్ పాండే..

    టీమిండియా జట్టు తలుపు కొట్టే బౌలర్ల జాబితాలో ముందు వరసలో ఉన్నాడు తుషార్ దేశ్ పాండే. ఇంకా చెప్పాలంటే అత్యంత ప్రతిభ కనబరుస్తున్న ఏకైక యంగ్ బౌలర్ ఇతడే. ఇప్పటి వరకు 9 మ్యాచులు ఆడి 17 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ రేసులోనూ నిలిచాడు. అప్పుడప్పుడు ఎక్స్పెన్సివ్ గా మారుతున్న.. ధోనీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు. డెత్ ఓవర్లలోను బౌలింగ్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు ఈ యువ క్రికెటర్. ధోనీ సారథ్యంలో మరింత రాటుదేలుతున్నాడు.

    అదరహో అనిపిస్తున్న సాయి సుదర్శన్..

    గుజరాత్ ఆటగాడు సాయి సుదర్శన్ ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ లు ఆడి.. 176 పరుగులు చేశాడు. అతడి ఆట తీరుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. భవిష్యత్తులో సాయి టీమ్ ఇండియాలో భాగమయ్యే అవకాశాలు ఉన్నాయని ఆ జట్టు సారధి హార్థిక్ పాండ్యా కూడా పలుమార్లు మెచ్చుకున్నాడు. సాయి సుదర్శన్ లో ఎంతటి ప్రతిభ ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరే కాకుండా కోల్కతా మిస్టరీ స్పిన్నర్ సుయాశ్ శర్మ, సన్ రైజర్స్ ఆటగాడు అభిషేక్ శర్మ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. ఇండియన్ క్రికెట్లోకి ఎంటర్ కావాలంటే అందుకున్న ఏకైక మార్గం ఐపీఎల్ లో అదరగొట్టడమే అని యువ క్రికెటర్లకు అర్థమైంది. అవకాశం వచ్చిన ప్రతి ఆటగాడు తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు.