New Year 2025: 2025 లో క్రికెట్లో మెగా టోర్నీలు జరగనున్నాయి. వీటి తర్వాత ఐపీఎల్ ఎలాగో కొనసాగుతూనే ఉంటుంది.. అయితే 2024లో టీమిండియాలో కొందరు ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈ ఏడాది కూడా వీరు అదే స్థాయిలో ఆడే అవకాశం ఉంది. తమదైన రోజు అద్భుతాలను సృష్టించే అవకాశం లేకపోలేదు.. ఈ జాబితాలో ఉన్న ఆటగాళ్ల వివరాలను ఒకసారి పరిశీలిస్తే..
యశస్వి జైస్వాల్
ఈ జాబితాలో యశస్వి జైస్వాల్ ముందు వరుసలో ఉంటాడు. గత ఏడాది ఇతడు తిరుగులేని ఆట తీరును ప్రదర్శించాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా తరఫున హైయెస్ట్ స్కోరర్ గా నిలిచాడు. టెస్టులలోను గత ఎడాది ఎక్కువ పరుగులు చేసిన భారతీయ ఆటగాడిగా నిలిచాడు. టి20, వన్డేలలో జైస్వాల్ కు తనను తాను నిరూపించుకునే అవకాశం రాలేదు. అయితే ఈ ఏడాది జైస్వాల్ ఓపెనర్ గా తన స్థానాన్ని స్థిరపరచుకునే అవకాశం ఉంది.
సంజు శాంసన్
గత ఏడాది సంజు టి20 ఫార్మాట్లో పెను ప్రకంపనలను సృష్టించాడు. 12 మ్యాచ్లలో 436 పరుగులు చేసి వారేవా అనిపించాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉంది. ఈ ఏడాది కూడా అతడు అదే స్థాయిలో ఆడే అవకాశం కనిపిస్తోంది. పరిమిత ఓవర్లలో సంజు జైస్వాల్ తో కలిసి ఓపెనర్ గా దిగే అవకాశం ఉంది.
తిలక్ వర్మ
శివమ్ దూబే గాయం వల్ల గట్టు నుంచి దూరమయ్యాడు. ఈ క్రమంలో తిలక్ వర్మకు అవకాశం లభించింది. అతడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. గత ఏడాది సౌత్ ఆఫ్రికా తో జరిగిన టి20 సిరీస్లో అదరగొట్టాడు. ఏకంగా రెండు సెంచరీలు చేసి వారేవా అనిపించాడు. ఈ ఏడాది కూడా అతడు ఇదే తీరుగా ఆడే అవకాశం ఉంది.
నితీష్ కుమార్ రెడ్డి
ప్రస్తుత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నితీష్ కుమార్ రెడ్డి సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఈ సిరీస్లో భారత్ తరఫున హైయెస్ట్ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ముందు వరసలో ఉన్నాడు. ఈ ఏడాది కూడా అతడు ఇదే ఆట ప్రదర్శించే అవకాశం లేకపోలేదు.
జస్ ప్రీత్ బుమ్రా
జస్ ప్రీత్ బుమ్రా గత ఏడాది వికెట్ల మీద వికెట్లు తీశాడు. సూపర్ ఫామ్ లో అతడు కొనసాగుతున్నాడు. ఇప్పుడు జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై అదిరిపోయే రేంజ్ లో వికెట్లు పడగొట్టాడు.జస్ ప్రీత్ బుమ్రా ఫార్మాట్ ఎలాంటిదైనా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ ఏడాది కూడా అతడు ఇదే స్థాయిలో బౌలింగ్ ప్రదర్శన చేసే అవకాశం ఉంది. రోహిత్ శర్మ టెస్టులకు వీడ్కోలు పలుకుతాడని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. జస్ ప్రీత్ బుమ్రా టీమిండియా కు కెప్టెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.