IPL 2024 – MI : లోగుట్టు పెరుమాళ్ళకు తెలుస్తుంది. అదే ఇంటి గుట్టు.. ఇంకెవరికి తెలుస్తుంది ఇంట్లో వాళ్లకు.. వాళ్ల బలాలు, బలహీనతలు, అలవాట్లు, తప్పులు, దిద్దుబాట్లు.. ఇవన్నీ ఇంట్లో వాళ్లు మాత్రమే చెప్పగలరు. అందు గురించే ఇంటిగుట్టు లంకకు చేటు అనే సామెత తెరపైకి వచ్చింది. కానీ, ఈ కాలంలో ఇంటిగుట్టు బయటపడితేనే.. ఇల్లు బాగుపడుతుందట.. ముంబై జట్టుకు ఒకప్పుడు ఆడి, ఆ తర్వాత కోచ్ ల అవతారమెత్తి.. ముంబై జట్టుతో ప్రయాణం చేస్తున్న వారు ఈ మాటలంటున్నారు. ముంబై జట్టులో కీలక ఆటగాళ్లపై.. ముంబై ఇండియన్స్ ఒక కామెడీ వీడియో షూట్ చేసింది. దానిని తన అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్ట్ చేసింది.
ముంబై ఇండియన్స్ యాజమాన్యం పోస్ట్ చేసిన వీడియోలో షాన్ పొలాక్, మార్క్ బౌచర్, కిరన్ పొలార్డ్ సందడి చేశారు. గ్లాసెస్, తాళం చెవిలు మర్చిపోయే ఆటగాడు ఎవరనే ప్రశ్నకు.. కిరన్ పొలార్డ్ చాలాసేపు సందేహించి.. ఆస్ట్రేలియన్ ఆటగాడు టిమ్ డేవిడ్ పేరు చెప్పాడు. అతడెప్పుడూ పరధ్యానంలో ఉంటాడని, వీటి మీద ధ్యాస ఉండదని, అందుకే అతడు అన్నీ మర్చిపోతాడని సరదాగా వ్యాఖ్యానించాడు..
తప్పులు చేస్తూ, మళ్లీ వాటిని సరిదిద్దుకునే ఆటగాడు ఎవరనే ప్రశ్నకు.. చాలాసేపు ఆలోచించుకుని సూర్యకుమార్ యాదవ్ అని పొలార్డ్ సమాధానం చెప్పాడు. అతడు తప్పులు చేస్తాడు, తర్వాత వాటిని సరిదిద్దుకుంటాడు, సరిదిద్దుకున్న అనంతరం వాటిని ఆచరణలో పెడతాడని పొలార్డ్ పేర్కొన్నాడు.
బిగ్గర గా నవ్వుతూ, ఇతరులను కామెంట్ చేసే ఆటగాడు ఎవరనే ప్రశ్నకు.. ఇషాన్ కిషన్ అని మార్క్ బౌచర్ సమాధానం చెప్పాడు. అతడు ఇతరులను అనుకరిస్తాడు, బిగ్గరగా నవ్వుతాడు, మైదానంలో నవ్వులు పూయిస్తాడని బౌచర్ పేర్కొన్నాడు.
ఎప్పటికీ ఫోన్ పాకెట్లో ఉంచుకుని, ఆస్తమానం దాన్నే చూసే ఆటగాడు ఎవరనే ప్రశ్నకు.. ఇషాన్ కిషన్ అని పొలాక్ పేర్కొన్నాడు. అతడు క్షణం కూడా ఫోన్ చూడకుండా ఉండలేడు, అస్తమానం దాన్ని ఏదో విధంగా గెలుకుతూనే ఉంటాడని పొలాక్ నవ్వుతూ పేర్కొన్నాడు.
చిత్రమైన సంకేతాలతో, ఎదుటి ఆటగాళ్లను ఆలింగనం చేసుకునేందుకు ఇష్టపడని ప్లేయర్ ఎవరు అనే ప్రశ్నకు.. రోహిత్ శర్మ అని బౌచర్ సమాధానంగా చెప్పాడు. అతడు ఎదుటి ఆటగాళ్లను ఆలింగనం చేసుకునేందుకు ఇష్టపడడని.. చిత్రమైన సంకేతాలు, చిత్రమైన హావభావాలను పలికిస్తాడని బౌచర్ వివరించాడు.
ముంబై ఇండియన్స్ యాజమాన్యం సరదాగా రూపొందించిన ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నది. ముంబై ఇండియన్స్ జట్టు ఐపిఎల్ చరిత్రలో ఐదు సార్లు విజేతగా నిలిచింది. గత రెండు సీజన్లలో ఆశించినంత స్థాయిలో ఆడలేదు. ఈ ఏడాది టీ మేనేజ్మెంట్ కెప్టెన్ ను మార్చింది. కొత్త సారథిగా హార్దిక్ పాండ్యాను నియమించింది. అయినప్పటికీ ఆ జట్టు ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్ల ప్రదర్శన పై విమర్శలు వస్తున్నాయి. వాటికి తగ్గట్టుగానే ముంబై ఇండియన్స్ సీనియర్ ఆటగాళ్లు, కోచ్ లతో రూపొందించిన కామియో వీడియో నవ్వులు పూయిస్తున్నప్పటికీ.. వాస్తవ పరిస్థితిని తెలియజేస్తోందని నెటిజన్లు అంటున్నారు. కొందరైతే “ముకేశ్ అంబానీ గారు ఇదండీ మీ ఆటగాళ్ల అసలు రూపం.. ఇప్పటికైనా వారి ఆట తీరును మార్చుకోమని చెప్పండి” అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
Coaches spill the tea on our players and you don’t want to miss this! ☕️#MumbaiMeriJaan #MumbaiIndians pic.twitter.com/JVtkuqqF3s
— Mumbai Indians (@mipaltan) April 21, 2024