Dink Lifestyle: అతని పేరు సందీప్ (పేరు మార్చాం). గతంలో అనేక మందితో ప్రేమ వివరాలను అనేక మందితో ప్రేమ వ్యవహారాలు నడిపాడు. చివరకు ఒక అమ్మాయితో కనెక్ట్ అయిపోయాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లలు, సంసారం, కొత్త ఇల్లు.. ఇంకా చాలా కలలు కన్నాడు. కానీ ఆ అమ్మాయి చెప్పిన మాటకు ఒకసారిగా షాక్ తిన్నాడు. ఎందుకంటే ఆ అమ్మాయికి పిల్లలు కనడం ఇష్టం లేదట. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడూ కనే ఉద్దేశం ఆమెకు లేదట. దీంతో సందీప్ కలలు కల్లలు అయిపోయాయి. సందీప్ ఒక మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య కూడా అదే స్థాయిలో ఉద్యోగం చేస్తోంది. ఇప్పుడు ఏం చేయాలో అతనికి అర్థం కావడం లేదు. అమ్మాయి తరఫున బంధువులు ఆమెకే మద్దతుగా ఉన్నారు. సందీప్ తరపు వాళ్ళు చెబితే ఆ అమ్మాయి ఒప్పుకోవడం లేదు.. ఇది కేవలం సందీప్ ఒకడి సమస్య మాత్రమే కాదు. ఈ జనరేషన్ లో అందరూ ఎదుర్కొంటున్న ఇబ్బంది.. మానసిక వైద్యుల పరిభాషలో దీనిని DINK అని పిలుస్తారు. స్థూలంగా చెప్పాలంటే డబుల్ ఇన్కమ్.. నో కిడ్స్.
మనదేశంలో వివాహ వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. వివాహం తర్వాత కొత్త దంపతులు తమ వంశాన్ని సంతానం ద్వారా వృద్ధి చేసుకుంటారు. ఇది నేరం కాదు, ఘోరం అంతకన్నా కాదు. కానీ రాను రాను ఆర్థిక స్థిరత్వం, విద్యా విధానం, కెరియర్, మంచి ఉద్యోగం వంటి వాటికి ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో యువత ఆలోచనలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. యువకులు, యువతులు (Gen Z ) మాతృత్వానికి దూరంగా ఉంటున్నారు. వారు తమ స్వీయ అభివృద్ధి కోసం మాత్రమే పాటుపడుతున్నారు. కుటుంబాలు పెరగడం, వంశాభివృద్ధి వంటి విషయాలను వారు పనికిరాని అంశాలుగా భావిస్తున్నారు. అందువల్లే DINK సమస్య రోజురోజుకు పెరిగిపోతుంది.
ఈ సమస్య కేవలం భారత్లోనే కాదు, ఇతర దేశాల్లో కూడా ఉంది. ఉదాహరణకు అమెరికా ను తీసుకుంటే.. 2022 నాటికి ఆ దేశంలో పిల్లలు లేని కుటుంబాలు 43 శాతానికి చేరుకున్నాయి. ఇది దశాబ్దం క్రితం వరకు 36% గా ఉండేది. కేవలం 10 సంవత్సరాల లోనే అది ఏడు శాతానికి పెరిగింది. సమీపకాలంలో అది 50 శాతానికి పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్థిక స్థిరత్వం సాధిస్తున్న దేశాలలో DINK సంస్కృతి వేగంగా పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం.. ప్రతి స్త్రీలో ఫెర్టిలిటీ రేటు 2.1 కంటే తక్కువకు పడిపోతే.. జనాభాను వృద్ధి చెందించడం కష్టమైపోతుంది. దానివల్ల రకరకాల సమస్యలను సమాజం ఎదుర్కోవాల్సి వస్తుంది.
1970, 80 కాలంలో ఫ్యామిలీ ప్లానింగ్ నినాదం పెద్దపెట్టున వినిపించింది. అప్పట్లో పేదరికం వల్ల జనాభా పెరుగుదల విపరీతంగా ఉండేది. ఒక స్త్రీ కనీసం నలుగురి నుంచి ఐదుగురు వరకు జన్మనిచ్చేది. దీనివల్ల పేదరికం పెరిగిపోయి, ప్రజలకు కనీస అవసరాలు తీర్చలేని పరిస్థితి ఏర్పడుతుందని భావించి ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణ దిశగా అడుగులు వేశాయి. దీంతో సంతానోత్పత్తి రేటు తగ్గింది. పారిశ్రామికీకరణ, అభివృద్ధి అనేది తారస్థాయికి చేరింది. ఇదే సమయంలో జనాభా తగ్గడం.. సంతానోత్పత్తి మందగించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒక నివేదిక ప్రకారం 2050 నుంచి 2100 మధ్య సంవత్సరాలలో దాదాపు 90 దేశాల్లో జనాభా తగ్గుతుందని తెలుస్తోంది. ఐరోపా, లాటిన్ అమెరికా దేశాలలో ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని సమాచారం. ఒక ఆఫ్రికా మాత్రమే ఈ శతాబ్దం మొత్తం బలమైన జనాభా పెరుగుదలను నమోదు చేస్తుందట. 2020 నుంచి 2100 సంవత్సరాల మధ్య ఆ దేశాలలో జనాభా పెరుగుదల 4.3 బిలియన్లకు చేరుకుంటుందని ఒక అంచనా.
చైనా, జపాన్, దక్షిణ కొరియాలో సంతానోత్పత్తి రేటు క్షీణించడం ప్రస్తుత పరిస్థితులను తేటతెల్లం చేస్తోంది. ఇలానే ఉంటే ఆ దేశాల ఆర్థిక పరిస్థితి తారు మారవుతుంది కాబట్టి.. సంతానోత్పత్తిపై ఆ దేశాలు ప్రధానంగా దృష్టి సారించాయి. గతంలో ప్రకటించిన విధానాలను సమూలంగా మార్చే పనిలో పడ్డాయి. జనాభా తగ్గుతున్న నేపథ్యంలో దక్షిణకొరియా పిల్లల సంరక్షణ కార్యక్రమాల కోసం ఏకంగా 270 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. జనాభా పెంపుదలలో భాగంగా.. తల్లిదండ్రులు ఒక బిడ్డకు జన్మనిస్తే ప్రభుత్వం నుంచి 1,510 డాలర్ల బహుమతి ఇస్తోంది. 2022లో 0.72 గా ఉన్న దక్షిణకొరియా జనన రేటు.. ఈ ఏడాది 0.68కు పడిపోతుందని ఒక అంచనా.. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం అనేక విధానాలను తెరపైకి తీసుకువచ్చింది. పని సంస్కృతి, వృత్తిపరమైన స్థాయిలో వేగంగా ఎదగడం, అధిక పోటీ తత్వం, మహిళలు తక్కువ పని చేయడం, లింగ వివక్షతను రూపుమాపడం వంటి వాటిని తెరపైకి తీసుకువచ్చింది. అయితే ఈ విధానాలు ఎంతవరకు ఫలప్రధమవుతాయో తెలియాల్సి ఉంది.
ఇక మనదేశంలో కూడా DINK సంస్కృతి వేగంగా విస్తరిస్తోంది. ఫలితంగా సంతానోత్పత్తి పడిపోతోంది. 1950 నాటికి సంతానోత్పత్తి రేటు ఒక మహిళకు 1.29 గా ఉండేది.. స్థూల సంతాన ఉత్పత్తి 6.18 గా ఉండేది. 1980లో 4.6, 2021లో 1.91 కి పడిపోయింది. ఇలానే పరిస్థితి కొనసాగితే పనిచేసే వారు తగ్గిపోయి.. వృద్ధులు పెరిగిపోతారు. అప్పుడు యువభారత్ కాస్త, వృద్ధ భారత్ అవుతుంది. ముందుగానే చెప్పినట్టు ఈ కాలం యువతకు అనేక అవకాశాలు కాళ్ళ ముందే ఉంటున్నాయి. పైగా వారు పిల్లలను కోరుకోవడం లేదు. ఆ స్థానాన్ని పెంపుడు జంతువులతో భర్తీ చేస్తున్నారు. అపరిమితమైన స్వేచ్ఛను కోరుకుంటున్నారు. ఉమ్మడి కుటుంబాల్లో జీవించడానికి ఇష్టపడటం లేదు. వారంలో ఐదు రోజులు పని చేసి, మిగతా రెండు రోజులు అపరిమితమైన ఆనందాన్ని అనుభవించాలని కోరుకుంటున్నారు. ఇవి అంతిమంగా DINK సంస్కృతికి కారణమవుతున్నాయి.