Afghanistan vs Australia : ఆస్ట్రేలియాకు కఠిన పరీక్షే.. సెమీస్ కు వెళ్లాలంటే ఇలా జరగాలి.. లేదంటే ఇంటికే!

Afghanistan vs Australia ఆస్ట్రేలియాపై అఫ్గాన్ విజయంతో గ్రూప్-1 నుంచి సెమీస్ కు భారత్ తో కలిసి వెళ్లే జట్టు ఏదో తేలాలంటే మిగిలిన రెండు మ్యాచులు పూర్తయ్యే వరకు ఆగాలి.

Written By: NARESH, Updated On : June 23, 2024 8:43 pm

Afghanistan vs Australia

Follow us on

Afghanistan vs Australia : T20 వరల్డ్ కప్-2024 టోర్నీలో సంచలనాలు నమోదవుతున్నాయి. సూపర్ 8 విభాగం గ్రూప్-1లో ఆస్ట్రేలియా జట్టును ఆఫ్గాన్ జట్టు ఓడించింది. ఆదివారం (జూన్ 23) ఉదయం అఫ్గాన్ వర్సెస్ ఆసీస్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన అఫ్గాన్ నిర్ణీత ఓవర్లలో 148 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ 19.2 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో 21 పరుగుల తేడాతో ఆసీస్ పై అఫ్గాన్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆస్ట్రేలియాపై అఫ్గాన్ విజయంతో గ్రూప్-1 నుంచి సెమీస్ కు ఏ రెండు జట్లు వెళ్తాయన్న ఉత్కంఠ ఇప్పుడు నెలకొంది.

సూపర్ 8 గ్రూప్-1లో భారత్, ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి. ఈ గ్రూప్ లో ఒక్కో జట్టు 3 మ్యాచ్ లు ఆడాలి. ఇప్పటికే ఒక్కో జట్టు రెండు ఆడాయి. భారత్ ఆడిన రెండు మ్యాచులలో రెండింటిలో కూడా గెలిచి 4 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ జట్లు రెండు మ్యాచులలో ఒక్కో మ్యాచ్ లో విజయం సాధించి 2 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. బంగ్లాదేశ్ ఆడిన రెండు మ్యాచులలోనూ ఓడిపోయి సెమీస్ అవకాశాలను కోల్పోయింది.

Australia

* భారత్ నాలుగు పాయింట్లతో సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోగా.. 24వ తేదీ (సోమవారం) రాత్రి 8 గంటలకు (భారత్ కాలమానం ప్రకారం) ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. 25వ తేదీ (మంగళవారం) ఉదయం 6 గంటలకు అఫ్గానిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది.

* భారత్ జట్టుపై ఆస్ట్రేలియా విజయం సాధించి బంగ్లాదేశ్ పై అఫ్గాన్ జట్టు ఓడిపోతే ఆసీస్ సెమీస్ లోకి వెళ్తుంది. అది కాకుండా.. భారత్ పై ఆసీస్ ఓడిపోయి.. బంగ్లాపై అఫ్గానిస్థాన్ గెలిస్తే.. అఫ్గాన్ సెమీస్ లోకి దూసుకెళ్తుంది.

* ఆస్ట్రేలియా-అఫ్గాన్ తమ ప్రత్యర్థి జట్లపై (భారత్, బంగ్లాదేశ్) ఓడితే రెండు జట్లకు పాయింట్లు సమానం అవుతాయి. దీంతో రన్ రేట్ కీలకంగా మారుతుంది. ఆస్ట్రేలియా (+0.223), అప్గాన్ (-0.650) నెట్ రన్ రేటుతో ఉన్నాయి. రన్ రేటు విషయంలో ఆస్ట్రేలియాదే పైచేయి.

* వరణుడు ప్రకోపిస్తే రెండు జట్ల మ్యాచ్ లు రద్దయినా రన్ రేటు మెరుగ్గా ఉన్న ఆస్ట్రేలియా జట్టుకే సెమీస్ కు వెళ్లే అవకాశాలు ఉంటాయి.

* ఒక వేళ వర్షంతో ఆస్ట్రేలియా – భారత్ మ్యాచ్ రద్దయి.. బంగ్లాపై అఫ్గాన్ గెలిస్తే భారత్ తో పాటు అఫ్గాన్ సెమీస్ లోకి వెళ్తుంది. అదే అఫ్గాన్ ఓడిపోతే.. ఆస్ట్రేలియాకు సెమీస్ కు వెళ్లే అవకాశాలు ఉంటాయి.

* ఆసీస్ పై భారత్ ఓడిపోయి.. బంగ్లాపై అఫ్గాన్ విజయం సాధిస్తే.. భారత్, ఆస్ట్రేలియా, అఫ్గాన్ జట్లు పాయింట్ల పట్టికలో సమఉజ్జీలుగా ఉంటాయి. ఆ సమయంలో రన్ రేట్ కీలకం అవుతుంది.

* ఏవైనా అద్భుతాలు జరిగితే తప్ప.. భారత్ సెమీఫైనల్ కు వెళ్లడం దాదాపు ఖాయమైంది.

* ఆస్ట్రేలియాపై అఫ్గాన్ విజయంతో గ్రూప్-1 నుంచి సెమీస్ కు భారత్ తో కలిసి వెళ్లే జట్టు ఏదో తేలాలంటే మిగిలిన రెండు మ్యాచులు పూర్తయ్యే వరకు ఆగాలి.