Hardik Pandya Vs Rohit Sharma: టి20 లో సరికొత్త ఆట తీరుకు పునాదులు వేసింది ఐపీఎల్. అప్పుడెప్పుడో 2008లో ప్రారంభమైన ఈ పొట్టి క్రికెట్ ఇప్పటికీ విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. కార్పొరేట్లు ఈ రంగంలోకి ప్రవేశించడంతో డబ్బు ఆటగా పేరుపొందింది. వివిధ దేశాల నుంచి వచ్చే క్రీడాకారులపై కనక వర్షం కురుస్తుండడంతో.. ఐపీఎల్ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. శాటిలైట్ హక్కులు, ప్రకటనలు.. ఇతర మార్గాల ద్వారా ఐపీఎల్ నిర్వాహకులకు కోట్లల్లో ఆదాయం సమకూరుతోంది. అలాంటి ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టు ఏదీ అంటే.. వెంటనే వచ్చే సమాధానం ముంబై ఇండియన్స్. లీగ్ దశలో ఈ జట్టు సాధించిన విజయాలు అన్ని ఇన్ని కావు. నమోదు చేసిన రికార్డులు కూడా మామూలువి కావు. ప్రస్తుత భారత జట్టులో ఆడిన ఎంతోమంది క్రీడాకారులు ముంబై ఇండియన్స్ జట్టులో ప్రతిభ చూపిన వారే.
హార్దిక్ పాండ్యా సోదరులు, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్, అంబటి రాయుడు వంటి వారిని టీమిండియా కు అందించిన ఘనత ముంబై ఇండియన్స్ జట్టు సొంతం. అందుకే చాలామంది క్రీడాకారులు ముంబై ఇండియన్స్ జట్టుకు ఎంపికయితే చాలు దశ మారిపోతుందని అంటారు. అయితే ప్రస్తుతం అలాంటి జట్టు రెండుగా చీలిపోయిందనే వార్తలు వస్తున్నాయి. అంతర్గత విభేదాలు ఆ జట్టును అతలాకుతలం చేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఐపీఎల్ 2024 సీజన్ ముందు జట్టు మేనేజ్మెంట్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఈ విభేదాలకు కారణమని తెలుస్తోంది. ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ జట్టుకు చెందిన డ్యాషింగ్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను గుజరాత్ టైటాన్స్ నుంచి కొనుగోలు చేసింది. క్యాష్ ట్రేడింగ్ డీల్ ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేసింది. ఇందుకోసం గుజరాత్ టైటాన్స్ జట్టుకు ముంబై జట్టు భారీగా డబ్బు ఇచ్చిందని స్పోర్ట్స్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
హార్దిక్ పాండ్యా ను కొనుగోలు చేసిన తర్వాత వెంటనే ముంబై ఇండియన్స్ జట్టు తన సారథిగా ప్రకటించింది. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు విపరీతమైన క్రేజ్ ఉందని.. దానిని నిలుపుకోవాలంటే హార్దిక్ పాండ్యా కెప్టెన్ కావాలని.. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. వాస్తవానికి ముంబై ఇండియన్స్ జట్టును రోహిత్ శర్మ ఐదు సార్లు విజేతగా నిలబెట్టాడు. అయినప్పటికీ ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేయడం పట్ల రోహిత్ శర్మ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది తప్పుడు నిర్ణయం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
తాము ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం నుంచి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో చాలామంది అభిమానులు ఆ జట్టు అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలను అన్ ఫాలో చేస్తున్నారు. మరోవైపు కెప్టెన్సీ మార్పు నిర్ణయంపై రోహిత్ శర్మ కూడా ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే రోహిత్ తన కోపాన్ని బయటపెట్టకపోయినప్పటికీ.. అతడి సతీమణి రితిక సోషల్ మీడియా వేదికగా ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం తీరును ఎండగట్టింది. చాలా పెద్ద తప్పులు చేస్తున్నారంటూ విమర్శించింది. కెప్టెన్సీ మార్పు నిర్ణయాన్ని బుమ్రా సైతం అంగీకరించలేకపోతున్నాడు. రోహిత్ తర్వాత తను ఆ బాధ్యతలు తీసుకోవాలని బుమ్రా భావించాడు. కానీ యాజమాన్యం అవేవీ పట్టించుకోకుండా హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేసింది. ఇక దీనిపై బుమ్రా సోషల్ మీడియా వేదికగా అసంతృప్తిని పరోక్షంగా వ్యక్తం చేశాడు. ఇక సూర్య కుమార్ యాదవ్ అయితే ఏకంగా గుండె పగిలిందని వ్యాఖ్యానించాడు.
ఇక ఈ పరిణామాల నేపథ్యంలో హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ రెండు వర్గాలుగా విడిపోయారని స్పోర్ట్స్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రోహిత్ శర్మకు అండగా సూర్య, బుమ్రా వంటి వారు ఉన్నారు. హార్దిక్ పాండ్యా కు ఇషాన్ కిషన్ మద్దతు తెలుపుతున్నాడు. ఇషాన్ హార్దిక్ పాండ్యా కు మద్దతు తెలుపుతుండటాన్ని జీర్ణించుకోలేక రోహిత్ శర్మ తుది జట్టులోకి జితేష్ శర్మ ను తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. జితేష్ రాక వల్ల ఇషాన్ కిషన్ కు తుది జట్టులో స్థానం లేకుండా చేశాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ ముంబై ఇండియన్స్ యాజమాన్యం నుంచి ఎటువంటి ప్రకటన విడుదల కాకపోవడం విశేషం.