TDP Super Six: తెలుగుదేశం పార్టీ దూకుడు పెంచింది. ఒకవైపు పొత్తులు, మరోవైపు సీట్ల సర్దుబాటు పై దృష్టి పెడుతూనే మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తోంది. ఇందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ముఖ్యంగా సూపర్ 6 హామీలను ఇంటింటికి చేర్చేందుకు సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. సూపర్ సిక్స్ హామీలు.. గ్యారెంటీ కార్డులతో కూడిన కిట్ ను ప్రతి ఇంటికి చేర్చాలని పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈ కిట్ల పంపిణీకి టిడిపి శ్రేణులు శ్రీకారం చుట్టాయి.
మరోవైపు యువనేత నారా లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా శంఖారావ సభలు పేరిట ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉత్తరాంధ్రలో అన్ని నియోజకవర్గాల్లో ఈ సభలు కొనసాగునున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ వైఫల్యాలపై లోకేష్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే పనులపై ప్రజలకు స్పష్టతనిస్తున్నారు.అటు జనసేనతో పొత్తు, పవన్ పై పొగడ్తల వర్షం కురిపిస్తూ జనసేన శ్రేణుల మద్దతును కూడగట్టేందుకు లోకేష్ ప్రయత్నిస్తున్నారు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అటు శంఖారావ సభలు సైతం జనాలతో కళకళలాడుతుండడంతో టిడిపిలో విజయంపై నమ్మకం పెరుగుతోంది.
ప్రస్తుతం తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు కుదిరింది. బిజెపి విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. బిజెపి కానీ కూటమిలోకి వస్తే ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే టిడిపి, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటనకు రెండు పార్టీల శ్రేణులు కసరత్తు చేస్తున్నాయి. ఇంతలో టిడిపి సూపర్ సిక్స్ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ బలంగా భావిస్తోంది. సోమవారం సూపర్ సిక్స్ హామీలపై సోషల్ మీడియా హోరెత్తింది. టిడిపి సోషల్ మీడియా విభాగం విపరీతంగా ప్రచారం చేసింది. దీంతో ఇవి జాతీయస్థాయిలో ట్రెండింగ్ గా నిలిచాయి. దేశవ్యాప్తంగా బలమైన చర్చ సైతం నడుస్తోంది. ముఖ్యంగా మహిళలను ఉచిత బస్సు ప్రయాణం, మూడు గ్యాస్ సిలిండర్ల ఉచిత హామీలు ఆకట్టుకుంటున్నాయి. సామాన్యుల కష్టాలు తీర్చేలా పథకాలు ఉండడంతో ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోందని టిడిపి వర్గాలు చెబుతున్నాయి. అయితే పెద్దగా పథకాలు ప్రభావం చూపడం లేదని విపక్షాలు చెప్పుకొస్తున్నాయి.