WTC Final 2023 : డబ్ల్యూటీసీ విజేతకు గద.. దాని వెనుకున్న కథ ఇదే..!

క్రికెట్లో ప్రధానమైన బంతిని కేంద్ర బిందువుగా చేసుకొని గదను తయారు చేసినట్లు తెలిపాడు. ఇలా బంతి అమరిక టెస్ట్ క్రికెట్ ప్రపంచస్థాయిని తెలియజేస్తుందని, గద హ్యాండిల్ క్రికెట్ స్టంపును సూచిస్తుందని వివరించాడు.

Written By: NARESH, Updated On : June 7, 2023 9:06 pm
Follow us on

WTC Final 2023 : క్రికెట్ లో ద్వైపాక్షిక సిరీస్, ఐసీసీ నిర్వహించే టోర్నీల్లో విజేతలకు ట్రోఫీలను బహుకరించడం ఆనవాయితీగా వస్తుంది. ఆయా టోర్నీలను బట్టి ట్రోఫీ స్థాయి ఉంటుంది. అయితే, ఐసీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న టెస్ట్ ఛాంపియన్ షిప్ విజేతకు మాత్రం గదను బహుకరిస్తోంది. గద ఎందుకు ఇస్తున్నారు..? ట్రోఫీ ఎందుకు ఇవ్వడం లేదు..? అన్న ప్రశ్నలు ఎంతో మందిని వేధిస్తున్నాయి. ఆయా ప్రశ్నలకు సమాధానాలు ఇవిగో.

టెస్టులకు ఆదరణ పెంచే ఉద్దేశంతో ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ నిర్వహిస్తోంది. 2021లో తొలిసారిగా ఈ పోటీలను నిర్వహించింది. ఈ ఏడాది రెండోసారి ఐసీసీ టోర్నీ నిర్వహిస్తోంది. ఫైనల్లో భారత్ – ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఇంగ్లాండ్ లోని ఓవల్ వేదికగా బుధవారం మధ్యాహ్నం ఈ మ్యాచ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు మొదటి రోజు బ్యాటింగ్ చేస్తోంది. అయితే ఈ టోర్నీ ని విజేతకు గదను అందించడం క్రికెట్ అభిమానులకు ఆసక్తిని కలిగిస్తోంది.

తొలిసారి విజేతగా నిలిచిన న్యూజిలాండ్ జట్టు..

ఐసీసీ మొదట ఏడాది నిర్వహించిన డబ్ల్యుటిసి ఫైనల్ లో న్యూజిలాండ్ జట్టు భారత్ ను ఓడించి విజేతగా నిలిచింది. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ కు ఐసీసీ ఒక గదను బహూకరించి భారీ ప్రైజ్ మనీ అందించింది. సాధారణంగా మెగా టోర్నీలో గెలిచిన జట్టుకు కప్ ఇవ్వడం ఆనవాయితీ. కానీ, వినూత్నంగా గదను బహుకరించడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పుడు రెండో డబ్లూటిసి ఫైనల్ కూడా ప్రారంభమైంది. ఈసారి కూడా భారత జట్టు ఫైనల్ కు దూసుకెళ్లింది. ఈ ఏడాది కూడా విజేతకు గదను బహుకరించనున్నట్లు చెబుతున్నారు.

అగ్రస్థానంలో నిలిచిన జట్టుకు గద..

గతంలో టెస్టుల్లో అగ్రస్థానం దక్కించుకున్న జట్టుకు గదను బహుకరించే వారు. ఇప్పుడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ విజేతకు అదే గదను అందిస్తున్నారు. దీంతోపాటు గెలిచిన జట్టుకు 1.6 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ కూడా ఇవ్వనున్నారు. రన్నరప్ గా నిలిచిన జట్టుకు ఎనిమిది లక్షల డాలర్లు దక్కనున్నాయి. మరి ఇలాంటి గదను ఐసీసీ 2000 సంవత్సరంలోనే తయారు చేయించింది. ట్రావెర్ బ్రౌన్ అనే డిజైనర్ దీనిని రూపొందించాడు. దీని తయారీ వెనుక ప్రేరేపించిన అంశాలను కూడా ఆయనే వెల్లడించాడు.

స్టంప్ ను ఆలంబనగా చేసుకుని గద తయారీ..

గద తయారు చేసిన ట్రావెర్ బ్రౌన్ తయారీ వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించాడు. ఇలాంటి గదను రూపొందించడానికి తనకు స్ఫూర్తిగా నిలిచిన సంఘటన ఒకటి ఉందని డిజైనర్ వెల్లడించాడు. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో విజేతగా నిలిచిన జట్టు సభ్యులు స్టంపును తీసుకొని సంబరాలు చేసుకోవడం చూశానని, దీంతో స్టంపును ఆలంబనగా చేసుకుని గదను తయారు చేయడానికి స్ఫూర్తి పొందినట్లు బ్రౌన్ వివరించాడు. క్రికెట్లో ప్రధానమైన బంతిని కేంద్ర బిందువుగా చేసుకొని గదను తయారు చేసినట్లు తెలిపాడు. ఇలా బంతి అమరిక టెస్ట్ క్రికెట్ ప్రపంచస్థాయిని తెలియజేస్తుందని, గద హ్యాండిల్ క్రికెట్ స్టంపును సూచిస్తుందని వివరించాడు. హ్యాండిల్ చుట్టూ రిబ్బన్ చుట్టూ ఉంటుందని, ఈ రిబ్బన్ ను విజయానికి చిహ్నంగా భావిస్తారని స్పష్టం చేశాడు.