Kolkata Messi Event: అర్జెంటీనా ఫుట్ బాల్ ఆటగాడు మెస్సీ(Argentina football player Messi) ఇటీవల కోల్ కతా నగరంలోని సాల్ట్ లేక్ స్టేడియం లో గోట్ టూర్ ఆఫ్ ఇండియా (goat tour of India) లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాల్ట్ లేక్ స్టేడియంలో నిర్వాహకులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో మెస్సి టూర్ లో గందరగోళం ఏర్పడింది. నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరించడంతో ప్రేక్షకులకు ఇబ్బంది ఏర్పడింది.
ఈ ఘటన జరిగిన తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు. అంతేకాదు ఈ ఘటనపై వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. వాస్తవానికి గోట్ టూర్ ఆఫ్ ఇండియా లో మెస్సి గంటపాటు సాల్ట్ లేక్ స్టేడియంలో ఉండాలి. అయితే భద్రత సరిగా లేకపోవడంతో మెస్సి కేవలం 22 నిమిషాలు మాత్రమే మైదానంలో ఉండాల్సి వచ్చింది. అతడు మైదానంలో ఉన్నంతసేపు సెలబ్రిటీలు గుమి గూడారు. దీంతో సీట్లలో కూర్చున్న ప్రేక్షకులు మెస్సిని చూడలేకపోయారు. వేలకు వేలు టికెట్లకు వెచ్చించిన ప్రేక్షకులకు మెస్సిని చూసే భాగ్యం లభించకపోవడంతో మైదానంలో ప్రేక్షకులు విధ్వంసకాండకు పాల్పడ్డారు. మైదానంలోకి నీళ్ల సీసాలు, కుర్చీలు విసిరేశారు.
ఈ ఘటన జరిగిన తర్వాత చాలామంది స్పందించారు. ఇందులో లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా ఉన్నాడు. ఈ ఘటన వెనుక ఏం జరిగిందో అతడు చెప్పాడు. “గోట్ టూర్ ఆఫ్ ఇండియాలో ఏం జరిగిందో తెలియదు. మైదానంలో చోటు చేసుకున్న ఘటనల వల్ల మెస్సి స్టేడియం నుంచి ముందుగానే వెళ్లిపోయాడు. ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు కారకులు మెస్సి, అతడి అనుచరులే” అని సునీల్ గవాస్కర్ ఆరోపించారు. ” అతడికి భద్రత సమస్యలు ఎదురవుతాయేమోనని వాదన వినిపించింది. కానీ అదంతా తప్పు. ఆ స్థాయిలో ప్రేక్షకులు వచ్చినప్పుడు అతడు కొంతసేపు ఫుట్ బాల్ ఆడి ఉంటే బాగుండేది. మెస్సీ చుట్టూ సెలబ్రెటీలు మాత్రమే ఉన్నారు. వాస్తవానికి వారి నుంచి అతడికి ఎటువంటి ముప్పు లేదు. అతడు స్టేడియంలో తిరుగుతూ ప్రేక్షకులను పలకరించి ఉంటే బాగుండేది. కోల్ కతా లో మాత్రమే గందరగోళం చోటుచేసుకుంది. ముంబై, హైదరాబాద్ నగరాలలో గోట్ టూర్ ఆఫ్ ఇండియా సజావుగా సాగింది. కోల్ కతా టూర్ లో నిర్వాహకులపై విమర్శలు చేస్తున్నారు. కానీ వచ్చిన అతిథులు ఇచ్చిన మాట మీద నిలబడలేదని” సునీల్ గవాస్కర్ ఆరోపించాడు.