Rohit Sharma: టీమిండియాలో రోహిత్ శర్మ సూపర్ ఆటగాడు. తన నాయకత్వంలో టీమిండియా కు అతడు అనేక ట్రోఫీలు అందించాడు. టి20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ అందించడం ద్వారా టీమ్ ఇండియాలో అత్యంత విజయవంతమైన నాయకుడిగా ఆవిర్భవించాడు.
టీమ్ ఇండియా మేనేజ్మెంట్ వేరే విధంగా ఆలోచించడంతో రోహిత్ ను కెప్టెన్ స్థానం నుంచి తప్పించింది. అతడిని సాధారణ ఆటగాడి గానే ఉంచింది.. ఈ నేపథ్యంలోనే రోహిత్ గురించి ఇప్పుడు ఒక చర్చ మొదలైంది. ఎందుకంటే రోహిత్ తన బరువును కోల్పోయాడు. సన్నజాజి తీగలగా కనిపిస్తున్నాడు. కెరియర్ ప్రారంభం నుంచి మొన్నటి వరకు కూడా బొద్దుగా కనిపించిన రోహిత్ ఇప్పుడు ఒకసారిగా సన్నగా మారిపోవడం వెనక ఏం జరిగి ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. అతని గురించి టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు..
కొంతకాలం క్రితం రోహిత్ ఒక టోర్నీ నిమిత్తం విదేశాలకు వెళ్లి వచ్చారు. ఆ సమయంలో అభిషేక్ కూడా అక్కడే ఉన్నారు. అప్పుడు రోహిత్ బరువు గురించి చర్చ జరిగింది. అది రోహిత్ శర్మను ఆలోచనలో పడేసింది. ఆ తర్వాత అతడు క్రమంగా బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడు. దానికి తగ్గట్టుగానే వ్యాయామం చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్ తర్వాత వచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మైదానంలో తీవ్రంగా కసరత్తులు చేశాడు..జిమ్ లో ఎక్కువ కాలం గడిపాడు. దీంతో రోహిత్ శర్మ అధిక బరువును కోల్పోయాడు. సన్న జాజి తీగ లాగా మారిపోయాడు. ఇదే విషయాన్ని అభిషేక్ నాయర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. బరువు తగ్గిన రోహిత్ శర్మ మైదానంలో చురుకుగా కనిపిస్తున్నాడు. తన బ్యాటింగ్ కు మరిన్ని మెరుగులు అద్దుకుంటున్నాడు. ఇటీవల ప్రాక్టీస్ సమయంలో బంతిని బలంగా కొట్టాడు. ఆ బంతి ఏకంగా లంబోర్ఘిని కారు అద్దాలను బద్దలు కొట్టింది. ఆ కారు కూడా రోహిత్ శర్మదే కావడం విశేషం.
అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా వన్డే సిరీస్ మొదలుపెడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ టీమిండియా కు ఆడుతున్నాడు. ఈసారి సారధిగా కాకుండా సాధారణ ఆటగాడి గానే అతడు రంగంలోకి దిగుతున్నాడు. టీమిండియా తరఫున రోహిత్ 11,168 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 92.80.. రోహిత్ ఖాతాలో 32 సెంచరీలు, 58 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రోహిత్ ఈ ఏడాది మార్చి 9 న న్యూజిలాండ్ జట్టుతో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా తరఫున తన చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు.