Team India New Jersey: ఇటీవల జరిగిన ఆసియా కప్ లో టీమిండియా ప్లేయర్లు స్పాన్సర్ లేకుండానే జెర్సీ ధరించారు. టీమిండియా క్రికెట్ చరిత్రలో స్పాన్సర్ లేకుండా జెర్సీ ధరించడం కొత్త కాక పోయినప్పటికీ.. ఆధునిక క్రికెట్ ను భారత్ శాసిస్తున్నప్పటినుంచి ఇంతవరకు అధికారిక స్పాన్సర్ లేకుండా ఆటగాళ్లు జెర్సీ ధరించింది లేదు. అయితే ఈసారి ఏర్పడిన ప్రత్యేక పరిస్థితుల వల్ల టీమిండియా ప్లేయర్లు అధికారిక స్పాన్సర్ లేకుండానే జెర్సీ ధరించి ఆసియా కప్ ఆడారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుపై ఫైనల్ మ్యాచ్లో ఉత్కంఠ విజయం సాధించి ఆసియా కప్ అందుకున్నారు.
సుప్రీంకోర్టు విధించిన నిబంధనల వల్ల.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మన దేశంలో మూతపడ్డాయి. దీంతో అప్పటిదాకా టీమిండియా కు అధికారిక స్పాన్సర్ గా వ్యవహరించిన డ్రీమ్ 11 కంపెనీ తప్పుకుంది. ఏకంగా ఆ కంపెనీ కూడా మూతపడింది. దీంతో టీమ్ ఇండియా అధికారిక స్పాన్సర్ లేకుండానే ఆసియా కప్ ఆడాల్సి వచ్చింది. ఇక టీమ్ ఇండియాకు ఇప్పుడు అపోలో టైర్స్ అధికారిక స్పాన్సర్ గా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా సిరీస్ లో అపోలో టైర్స్ రూపొందించిన కొత్త జెర్సీని టీమిండియా ప్లేయర్లు ధరించారు. ఈ జెర్సీ ఆటగాళ్లకు సరికొత్త అందాన్ని తీసుకొచ్చింది..
భుజాల మీద త్రివర్ణ పతాకాలను రూపొందించారు. ముందు భాగంలో అపోలో టైర్స్ అధికారిక లోగో.. దాని కింద ఇండియా అనే అక్షరాలను రూపొందించారు. ఈ జెర్సీ ఆటగాళ్లకు సరికొత్త అందాన్ని తీసుకొచ్చింది. కొత్త జెర్సీని నితీష్ కుమార్ రెడ్డి, ధృవ్ జురెల్ ధరించి కనిపించారు. ఆ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక టీమిండియా కు అధికారిక స్పాన్సర్ గా అపోలో టైర్స్ ఒప్పందం కుదుర్చుకుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలితో 579 కోట్ల విలువైన ఒప్పందం మీద సంతకాలు కూడా చేసింది. భారత్ ఆడే ప్రతి మ్యాచ్ కు అపోలో టైర్స్ 4.5 కోట్లు చెల్లిస్తుంది.
అపోలో టైర్స్ మన దేశానికి చెందిన కంపెనీ. ఇది టైర్లను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఇతర దేశాలకు టైర్లను ఎగుమతి చేస్తూ ఉంటుంది. తన వ్యాపార కార్యకలాపాలను మరింత పెంచుకోవడానికి అపోలో టైర్స్ టీం ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగానే బిసిసిఐ కి వందల కోట్లు చెల్లించడానికి సిద్ధపడింది.. ఈ ఒప్పందం నాలుగేళ్ల పాటు అమల్లో ఉంటుందని తెలుస్తోంది.