Team India : పాతతరం ఛాంపియన్ షిప్ గెలిచారు…యువతరం సిరీస్ కొట్టారు: వయసుతో సంబంధం లేకుండా వెలుగుతున్న భారత క్రికెట్..

టీమిండియా యువ జట్టు ప్రస్తుతం జింబాబ్వేలో పర్యటిస్తోంది. ఇటీవల వెస్టిండీస్ లో టి20 వరల్డ్ కప్ దక్కించుకున్న టీమిండియా.. పూర్తి యువ జట్టుతో జింబాబ్వేలో పర్యటిస్తోంది. గిల్ ఆధ్వర్యంలో 3-1 తేడాతో ఐదు టి20 మ్యాచ్లో సిరీస్ దక్కించుకుంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే విజేతగా నిలిచింది. నామమాత్రమైన ఐదవ టి20 మ్యాచ్ ఆదివారం జరుగుతుంది.

Written By: Bhaskar, Updated On : July 14, 2024 9:34 am
Follow us on

Team India : భారత క్రికెట్ వెలిగిపోతోంది. ఆటగాళ్ల వయసుతో సంబంధం లేకుండా కాంతులీనుతోంది. వరుస విజయాలతో యావత్తు ప్రపంచ క్రికెట్ ను తనవైపు చూసేలా చేస్తోంది.. ఏకంగా బలమైన జట్లను మట్టికరిపించి.. మెగా టోర్నీలను దక్కించుకొని.. సత్తా చాటుతోంది… మరీ ముఖ్యంగా అటు యువ జట్టు, ఇటు సీనియర్ జట్టు శనివారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన టోర్నీలలో విజేతలుగా నిలిచి.. భారత కీర్తి ప్రతిష్టలను రెపరెపలాడించాయి.

టీమిండియా యువ జట్టు ప్రస్తుతం జింబాబ్వేలో పర్యటిస్తోంది. ఇటీవల వెస్టిండీస్ లో టి20 వరల్డ్ కప్ దక్కించుకున్న టీమిండియా.. పూర్తి యువ జట్టుతో జింబాబ్వేలో పర్యటిస్తోంది. గిల్ ఆధ్వర్యంలో 3-1 తేడాతో ఐదు టి20 మ్యాచ్లో సిరీస్ దక్కించుకుంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే విజేతగా నిలిచింది. నామమాత్రమైన ఐదవ టి20 మ్యాచ్ ఆదివారం జరుగుతుంది. నాలుగవ టి20 మ్యాచ్లో టీమిండియా ఏకంగా 10 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. భారత్ ఎదుట 153 పరుగుల విజయ లక్ష్యాన్ని జింబాబ్వే ఉంచగా.. ఈ లక్ష్యాన్ని టీమిండియా ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా సాధించింది. యశస్వి జైస్వాల్ 93, గిల్ 58 పరుగులు చేశారు. వీరిద్దరూ జింబాబ్వే బౌలింగ్ ను ఒక ఆట ఆడుకున్నారు. మొదటి టి20 మ్యాచ్ లో ఓడిపోయిన టీం ఇండియా.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్లు గెలిచి సత్తా చాటింది. టి20 వరల్డ్ కప్ తర్వాత మరో సిరీస్ దక్కించుకుంది.

ఇక ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ క్రికెట్ టోర్నీ ఫైనల్ లో పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించింది. బర్మింగ్ హమ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు పాకిస్తాన్ ను మట్టి కరిపించింది. ఐదు వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి, 156 పరుగులు చేసింది. పాకిస్తాన్ ఆటగాడు షోయబ్ మాలిక్ 36 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఇతడు ఇన్నింగ్స్ లో మూడు సిక్సర్లు ఉన్నాయి. 41 పరుగులు చేయడం ద్వారా షోయబ్ మాలిక్ పాకిస్తాన్ ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు. సోహైల్ తన్వీర్ చివర్లో 9 బంతులు ఎదుర్కొని 19 పరుగులు సాధించాడు.. ఫలితంగా పాకిస్తాన్ 156 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో అనురీత్సింగ్ ఇప్పుడు వికెట్లు పడగొట్టాడు. ఇర్ఫాన్ పఠాన్, పవన్ నేగి, వినయ్ కుమార్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.

157 పరుగుల టార్గెట్ ను చేజ్ చేసేందుకు భారత జట్టు రంగంలోకి దిగింది. ఓపెనర్లు రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు తొలి వికెట్ కు 34 పరుగులు జోడించారు. అనంతరం ఊతప్ప అవుట్ కావడంతో.. గురు కీరత్ సింగ్ మాన్ క్రీజ్ లోకి వచ్చాడు. అంబటి రాయుడు – గురు కీరత్ కలిసి మూడో వికెట్ కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రాయుడు 30 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాయుడు క్యాచ్ ఔట్ అయిన తర్వాత.. గురు కీరత్ కూడా షోయబ్ మాలిక్ బౌలింగ్ లో వెనుతిరిగాడు. ఈ దశలో వచ్చిన యూసఫ్ పఠాన్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. 16 బంతుల్లో మూడు సిక్సర్లు కొట్టి సత్తా చాటాడు. మరో ఎండ్ లో ఉన్న యువరాజ్ సింగ్ తన శైలికి భిన్నంగా ఆడాడు. యూసఫ్ పఠాన్ అవుట్ అయిన తర్వాత.. ఇర్ఫాన్ పఠాన్ క్రీజ్ లోకి వచ్చాడు. యువరాజ్ సింగ్ – ఇర్ఫాన్ భారత జట్టును గెలిపించారు.

ఈ విజయం ద్వారా పాకిస్తాన్ పై ఎప్పటికీ భారత జట్టుదే పై చేయి అని నిరూపితమైంది. 40+ లో ఉన్న సీనియర్ ఆటగాళ్లు సైతం పాక్ జట్టును మట్టి కరిపించారు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్, మధ్యలో ఫీల్డింగ్ విభాగాలలో సత్తా చాటారు. యువరాజ్ సింగ్ తన శైలికి భిన్నంగా ఆడినప్పటికీ.. జట్టును అని రంగాలలో ముందుండి నడిపించాడు. సీనియర్ ఆటగాళ్లతో సమన్వయం చేసుకుంటూ పాకిస్తాన్ జట్టుపై ఒత్తిడి పెంచాడు. బౌలింగ్ లో వైవిధ్యాన్ని ప్రదర్శింపజేస్తూ భారత జట్టును విజేతగా నిలిపాడు. భారత సీనియర్ ఆటగాళ్ల జట్టు విజేతగా నిలవడంతో సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. “ఫార్మాట్ అదే. ఆడిన జట్టు కూడా అదే. వయసు మాత్రమే కాస్త ఎక్కువ. అయినప్పటికీ భారత జట్టే విజేత గా నిలిచిందని” సోషల్ మీడియాలో అభిమానులు వ్యాఖ్యలు చేస్తున్నారు.