Donald Trump: డొనాల్డ్ ట్రంప్ పై దుండగుల కాల్పులు.. అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ఏమన్నారంటే..

త్వరలో అమెరికా అధ్యక్ష ఎన్నికలున్న నేపథ్యంలో.. మరోసారి అధ్యక్ష పోటీలో ట్రంప్ ఉన్నారు. ఎన్నికల్లో భాగంగా ఆయన పెన్సిల్వేనియా ప్రాంతంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీకి ఓ వ్యక్తి తుపాకీతో హాజరయ్యాడు. వేదికపై ఉన్న ట్రంప్ ర్యాలీకి హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తుండగా.. ఆ దుండగుడు ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. దీంతో ట్రంప్ వేదిక పైనుంచి కింద పడిపోయారు. వెంటనే భద్రతా సిబ్బంది ట్రంప్ ను పైకి లేపి రక్షణ కల్పించారు. ఆయన చుట్టూ వలయం లాగా ఏర్పడ్డారు.

Written By: Anabothula Bhaskar, Updated On : July 14, 2024 9:14 am

Donald Trump

Follow us on

Donald Trump: శ్వేత దేశంలో కలకలం నెలకొంది. మరి కొద్ది రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు ఉన్నాయనగా అమెరికాలో సంచలనం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై దుండగుడు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఆయన గాయపడ్డారు. దీంతో ట్రంప్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. దుండగుడు జరిపిన కాల్పులకు ట్రంప్ చెవికి గాయమైంది. ఈ ఘటన అమెరికాలోని పెన్సిల్వేనియా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ కాల్పులు జరుగుతున్నప్పుడు ఓ వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం. మరోవైపు ఆ కాల్పులు జరిపిన వ్యక్తిని ట్రంప్ భద్రతను పర్యవేక్షించే బలగాలు హతమార్చాయి. బలగాలు వెంటనే స్పందించి కాల్పులు జరిపిన దుండగుడిని చంపేశారు. అతని వద్ద ఉన్న ఆధారాలు మొత్తం స్వాధీనం చేసుకున్నారు. వాటిని అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీకి పంపించారు. ఇదంతా కూడా నిమిషాల వ్యవధిలోనే జరగడం విశేషం.

త్వరలో అమెరికా అధ్యక్ష ఎన్నికలున్న నేపథ్యంలో.. మరోసారి అధ్యక్ష పోటీలో ట్రంప్ ఉన్నారు. ఎన్నికల్లో భాగంగా ఆయన పెన్సిల్వేనియా ప్రాంతంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీకి ఓ వ్యక్తి తుపాకీతో హాజరయ్యాడు. వేదికపై ఉన్న ట్రంప్ ర్యాలీకి హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తుండగా.. ఆ దుండగుడు ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. దీంతో ట్రంప్ వేదిక పైనుంచి కింద పడిపోయారు. వెంటనే భద్రతా సిబ్బంది ట్రంప్ ను పైకి లేపి రక్షణ కల్పించారు. ఆయన చుట్టూ వలయం లాగా ఏర్పడ్డారు. అనంతరం ట్రంప్ ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ట్రంప్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని భద్రతా అధికారులు చెబుతున్నారు. ఈ ఘటన అమెరికాలో సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. విచారణ జరుగుతున్నట్టు బైడన్ ప్రభుత్వం ప్రకటించింది.

ర్యాలీకి భారీగా జనం హాజరైన నేపథ్యంలో.. ఆ దుండగుడు కూడా అందులోనే కలిసిపోయాడు. ట్రంప్ ప్రసంగిస్తుండగా ఉన్నట్టుండి తుపాకీని అతడికి ఎక్కుపెట్టాడు. అయితే వెంట్రుకవాసిలో ప్రాణాపాయం నుంచి ట్రంప్ తప్పించుకున్నారు. దుండగుడి తుపాకీ నుంచి వచ్చిన బుల్లెట్ ట్రంప్ చెవిని తాకుతూ వెళ్ళింది. ఈ ప్రమాదంలో ఆయన చెవి నుంచి తీవ్రంగా రక్తం కారింది.. ఆ తర్వాత భద్రతా దళాలు ఆ దుండగుడిపై భద్రత దళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో అతడు అక్కడికక్కడే కన్నుమూశాడు. ఆ దుండగుడు కాల్పులు జరుగుతున్న సమయంలో ర్యాలీకి హాజరైన ఒక వ్యక్తి చనిపోయాడు. అయితే ఆ వ్యక్తి ఈ దుండగుడు జరిపిన కాల్పుల వల్ల చనిపోయాడా? లేక తొక్కిసలాట జరిగి చనిపోయాడా? అనేది తేలాల్సి ఉంది.

ట్రంప్ పై దాడి జరిగిన అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడన్ స్పందించారు. కాల్పుల ఘటనపై భద్రతా దళాలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. “ఈ ఘటన దురదృష్టకరం. భద్రత ఏజెన్సీలను వివరాలు అడిగి తెలుసుకున్నాను. అమెరికాలో హింసకు చోటు లేదని” బైడన్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ కాల్పుల ఘటనను అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమల హారీస్ తప్పు పట్టారు. కాల్పులు జరపడాన్ని ఖండించారు. ప్రశాంతతకు ఆలవాలమైన అమెరికాలో హింసకు చోటు లేదన్నారు. కాల్పుల్లో గాయపడిన ట్రంప్ తిరిగి కోలుకోవాలని.. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారాలని ఆమె కోరారు. కాల్పులకు తెగబడిన దుండగుడిని వెంటనే హతమార్చిన అమెరికన్ సీక్రెట్ సర్వీస్, భద్రతా దళాలను కమల అభినందించారు. తక్షణం స్పందించి చాకచక్యంగా వ్యవహరించారంటూ కొనియాడారు.