India Vs Ireland: ఐర్లాండ్ తో మ్యాచ్.. వారు రిజర్వ్ బెంచ్ కే .. భారత తుది జట్టు ఇదే..

యశస్వి రిజర్వ్ బెంచ్ కు పరిమితమైన నేపథ్యంలో టీమిండియా జట్టు ఇన్నింగ్స్ ను రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రారంభిస్తారు. సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, శివం దుబే తర్వాతి స్థానాలలో బ్యాటింగ్ కు వస్తారు..

Written By: Anabothula Bhaskar, Updated On : June 5, 2024 7:13 pm

India Vs Ireland

Follow us on

India Vs Ireland: టి20 వరల్డ్ కప్ ప్రయాణాన్ని భారత జట్టు బుధవారం నుంచి ప్రారంభించనుంది. న్యూయార్క్ వేదికగా ఐర్లాండ్ జట్టుతో భారత్ తలపడనుంది. బలాబలాల పరంగా చూసుకుంటే భారత జట్టుకు ఐర్లాండ్ జట్టుకు పోలికే లేదు. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఎనిమిది టి20 మ్యాచ్ లు ఆడాయి. ఇందులో ఏడు మ్యాచ్లు భారత్ గెలిచింది. ఒక మ్యాచ్ లో ఫలితం రాలేదు. అయితే ఈ మ్యాచ్ ద్వారా మెరుగైన ప్రాక్టీస్ సొంతం చేసుకోవాలని భారత క్రికెటర్లు భావిస్తున్నారు. అమెరికన్ మైదానాలకు అలవాటు పడేందుకు ఈ మ్యాచ్ ఉపకరిస్తుందని అంచనా వేస్తున్నారు.

అయితే న్యూయార్క్ మైదానం పై తేమ అధికంగా ఉంటుంది. ఇప్పటికే సౌత్ ఆఫ్రికా – శ్రీలంక మ్యాచ్ ద్వారా అది నిరూపితమైంది. ఆ మ్యాచ్లో రెండు జట్ల బౌలర్లు పండగ చేసుకున్నారు. ముఖ్యంగా శ్రీలంక జట్టు 77 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ఆ లక్ష్యాన్ని చేజ్ చేసేందుకు దక్షిణాఫ్రికా బ్యాటర్లు 16 ఓవర్ల పాటు మైదానంలో ఆడాల్సి వచ్చింది. చివరికి నాలుగు వికెట్లు కోల్పోయి సౌత్ ఆఫ్రికా లక్ష్యాన్ని సాధించింది. ఈ మైదానాన్ని చూసిన చాలామంది టి20 ఆడుతున్నారా? లేక టెస్ట్ క్రికెట్ కోసం సిద్ధం చేశారా? అంటూ ఐసీసీ పై విమర్శలు చేశారు. ఇలాంటి మైదానంపై ఆడుతున్న నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ జట్టులో ఎక్కువ ఆల్ రౌండర్లు ఉండేలా చూసుకుంటామని ఇప్పటికే ప్రకటించాడు. రోహిత్ చేసిన వ్యాఖ్యల ప్రకారం శివం దుబే కు అవకాశం లభించడం ఖాయంగా కనిపిస్తోంది. మరవైపు బంగ్లాదేశ్ జట్టుతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడని యశస్వి జైస్వాల్ ను ఈ మ్యాచ్ కు కూడా రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేసే అవకాశం కనిపిస్తోంది.

యశస్వి రిజర్వ్ బెంచ్ కు పరిమితమైన నేపథ్యంలో టీమిండియా జట్టు ఇన్నింగ్స్ ను రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రారంభిస్తారు. సూర్య కుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, శివం దుబే తర్వాతి స్థానాలలో బ్యాటింగ్ కు వస్తారు.. బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో అదరగొట్టిన అక్షర్ పటేల్ కు తుది జట్టులో అవకాశం లభించింది.. రవీంద్ర జడేజా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో అతని స్థానంలో అక్షర్ కు అవకాశం కల్పించినట్టు తెలుస్తోంది. పిచ్ స్పిన్ బౌలింగ్ కు సహకరిస్తే కులదీప్ యాదవ్ కు అవకాశం దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ పేస్ బౌలింగ్ కు అనుకూలంగా మారితే బుమ్రా తో పాటు సిరాజ్ కు తుది జట్టులో స్థానం లభిస్తుంది. వీరిద్దరితోపాటు అర్ష్ దీప్ సింగ్ కూడా పేస్ బౌలింగ్ దళాన్ని మోస్తాడు. స్పిన్ బౌలర్ల వైపు రోహిత్ మొగ్గుచూపితే సిరాజ్ స్థానంలోకి యజువేంద్ర చాహల్ వస్తాడని ప్రచారం జరుగుతోంది.

ఈ మ్యాచ్లో భారత్ గెలవడం లాంచనమే అయినప్పటికీ.. టీమిండియా ఐర్లాండ్ జట్టును అంత సులభంగా తీసుకోవడం లేదు. స్పెషలిస్ట్ ఆల్రౌండర్లతో బరిలోకి దిగుతోంది. మరోవైపు ఐర్లాండ్ జట్టులోనూ ఆరుగురు ఆల్ రౌండర్లు ఉన్నారు. వారే తుది జట్టులోనూ ఉంటారని ఇప్పటికే ఆ జట్టు యాజమాన్యం స్పష్టం చేసింది. పైగా వారికి టి20 లీగ్ లలో ఆడిన అనుభవం ఉంది.