KKR Flight: ఐపీఎల్ లో ఒక వేదిక నుంచి మరో వేదికకు ఆటగాళ్లను తరలించేందుకు విమానాలు వాడుతుంటారు. అలా తరలించే క్రమంలో విమానాలను ఒకటికి రెండుసార్లు చెక్ చేస్తారు. వాతావరణాన్ని కూడా విస్తృతంగా పరిశీలిస్తారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య హోటల్స్ నుంచి ఆటగాళ్లను విమానాశ్రయానికి తీసుకెళ్లి.. అక్కడినుంచి ప్రత్యేక ఫ్లైట్ ల ద్వారా ఇతర వేదికల వద్దకు తరలిస్తారు. అయితే ఇదంతా రొటీన్ గా జరిగేదే. అయితే ఈ సీజన్లో మాత్రం ఓ జట్టును విమాన ప్రయాణం తెగ ఇబ్బంది పడుతోంది. వాతావరణంలో అననుకూల మార్పుల వల్ల ఇప్పటివరకు ఆ జట్టు ఆటగాళ్లు తమ ప్రయాణాన్ని రెండుసార్లు మార్చుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఆ జట్టు యాజమాన్యం తన అధికారిక ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో పేర్కొన్నది. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఐపీఎల్ 17వ సీజన్లో కోల్ కతా జట్టు అదరగొడుతోంది. పాయింట్ల పట్టికలో ఆ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. 11 మ్యాచులు ఆడి ఎనిమిది విజయాలు అందుకొని, 16 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. ఆదివారం లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో 98 పరుగుల తేడాతో భారీ విజయాన్ని దక్కించుకుంది. ఈ విజయం నేపథ్యంలో కోల్ కతా ఆటగాళ్లు విపరీతమైన సంతోషంలో ఉన్నారు. ఆ ఉత్సాహంతోనే తదుపరి మ్యాచ్ కు సిద్ధమయ్యారు. అయితే వారి ఉత్సాహం మీద విమాన ప్రయాణం నీళ్ళు చల్లింది. వాతావరణంలో మార్పుల కారణంగా వాళ్లు ప్రయాణిస్తున్న చార్టర్డ్ ఫ్లైట్ ను రెండుసార్లు దారి మళ్లించాల్సి వచ్చింది.
లక్నో జట్టుతో విజయాన్ని అందుకున్న కోల్ కతా తమ తదుపరి మ్యాచ్ ను మే 11న ముంబై జట్టుతో ఆడనుంది. ఈ నేపథ్యంలో కోల్ కతా ఆటగాళ్లు లక్నో నుంచి చార్టర్డ్ ఫ్లైట్ లో కోల్ కతా బయలుదేరి వెళ్లారు. సోమవారం సాయంత్రం ఐదు గంటల 45 నిమిషాలకు వారు ఎక్కిన ఫ్లైట్ బయలుదేరింది. ఏడు గంటల 25 నిమిషాల సమయంలో ఆ విమానం కోల్ కతా లో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే ఆ ప్రాంతంలో విపరీతమైన వర్షాల వల్ల ప్రతికూల వాతావరణం నెలకొంది.
దీంతో కోల్ కతా ఆటగాళ్లు ప్రయాణిస్తున్న విమానాన్ని అధికారులు గుహవాటికి దారి మళ్ళించారు. ఆ ప్రాంతానికి చేరుకున్న విమానానికి కొంతసేపటికే కోల్ కతా వెళ్లేందుకు పర్మిషన్ వచ్చింది. అయితే ఈసారి కూడా కోల్ కతా లో ఫ్లైట్ ల్యాండ్ అయ్యేందుకు వాతావరణ సహకరించలేదు. దీంతో విమానాన్ని వారణాసికి రూట్ చేంజ్ చేశారు. అ విమానం అక్కడ దిగడంతో కోల్ కతా ఆటగాళ్లు అక్కడ ఒక హోటల్లో ఆ రాత్రికి బస చేశారు. మంగళవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో వారణాసి నుంచి కోల్ కతా కు ఆటగాళ్లు బయలుదేరారు. ఈ విషయాన్ని కోల్ కతా యాజమాన్యం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. ఈ ట్వీట్ చూసిన అభిమానులు వెరైటీగా స్పందిస్తున్నారు. విమానంతో ఇంత ప్రయాసపడే బదులు ఆర్టీసీ బస్సు బుక్ చేస్తే బాగుండేది కదా.. అని సలహాలు ఇస్తున్నారు.
Travel update: KKR’s charter flight from Lucknow to Kolkata diverted to Guwahati due to bad weather ⛈️
Flight currently standing at the Guwahati Airport tarmac. More updates soon pic.twitter.com/XFPTHgM2FJ
— KolkataKnightRiders (@KKRiders) May 6, 2024