IPL 2024: సస్పెన్స్ కు తెరపడింది. ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్న ఐపీఎల్ టి20 కి షెడ్యూల్ విడుదల కానుంది. మార్చి 22 నుంచి 17వ సీజన్ ప్రారంభం కానుంది. పోటీలకు సంబంధించి ప్రారంభ తేదీని ఐపిఎల్ టి20 లీగ్ చైర్మన్ అరుణ్ ధుమాల్ వెల్లడించారు. మొత్తం భారత్ లోనే జరుగుతుందని ఆయన ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో లీగ్ పోటీల నిర్వహణ ఆసక్తికరంగా మారింది. ” పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసాం. మార్చి 22 నుంచి 17వ ఎడిషన్ ప్రారంభిస్తాం. కేంద్ర ఏజెన్సీలతో కూడా సంప్రదింపులు మొదలుపెట్టాం. లీగ్ విభాగంలో కొన్ని మ్యాచ్ ల షెడ్యూల్ ముందుగానే విడుదల చేస్తాం. ఈ సీజన్ మొత్తం భారత్ లోనే జరుగుతుంది. ఎవరూ ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దని” ధుమాల్ ప్రకటించారు.
ఈసారి సీజన్ షెడ్యూల్ ను రెండుసార్లు ప్రకటించే అవకాశం ఉందని ధుమాల్ ప్రకటన ద్వారా తెలుస్తోంది. ఒకవేళ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన ఆలస్యమైతే ముందుగానే రెండు వారాలపాటు నిర్వహించే మ్యాచ్ లకు సంబంధించి షెడ్యూల్ విడుదలవుతుందని తెలుస్తోంది. మిగతా మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ తర్వాత విడుదల చేస్తారని తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికలు జరిగిన సమయంలో ఐపీఎల్ నిర్వాహకులు ఇదే విధంగా వ్యవహరించారు. అప్పుడు కూడా రెండుసార్లు షెడ్యూల్ ప్రకటించారు. ఈసారి కూడా అదే విధానాన్ని అనుసరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈసారి పోటీలను మార్చి 26 నుంచి ప్రారంభించాలని నిర్వాహకులు భావించారు. కేంద్ర ఏజెన్సీలు, ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి సంకేతాలు వచ్చాయో తెలియదు కానీ మార్చి 22 నుంచి పోటీలు ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. మార్చి 22 నుంచి మే 26 వరకు ఈ సీజన్ నిర్వహిస్తామని నిర్వాహకులు సంకేతాలు ఇచ్చారు. 2008లో ఐపిఎల్ సీజన్ మొదలు కాగా, 2009లో సీజన్ మొత్తాన్ని విదేశాల్లో నిర్వహించారు. అప్పట్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో భద్రతకు సంబంధించిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ విదేశాలలో ఐపీఎల్ నిర్వహించింది. ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో కాస్త షెడ్యూల్ అటూ ఇటూ మార్చి పోటీలు నిర్వహించాలని బిసిసిఐ భావిస్తోంది. మరో వైపు జూన్ 3 నుంచి అమెరికా , వెస్టిండీస్ వేదికగా టి20 వరల్డ్ కప్ ప్రారంభమవుతుంది. ఈ మెగా టోర్నీ కంటే పది రోజులు ముందుగానే ఐపీఎల్ 17వ ఎడిషన్ పూర్తిచేయాలని బిసిసిఐ భావిస్తోంది.
ఏ ముహూర్తాన లలిత్ మోడీ ఐపీఎల్ టి20కి అంకురార్పణ చేశాడో గానీ.. అది ఇంతితై వటుడింతై అన్నట్టుగా ఎదిగింది. ఎంతోమంది క్రీడాకారులను కోటీశ్వరులను చేసింది. అనామక ఆటగాళ్లను రాత్రికి రాత్రే స్టార్ లను చేసింది. కటిక పేదరికం నుంచి వారు ఐపీఎల్ వల్ల నాలుగు రాళ్లు వెనకేసుకున్నారు. ఐపీఎల్ వల్ల మన దేశ క్రీడాకారుల ప్రతిభ తగ్గిపోతుంది, మన మైదానాల మీద ఇతర ఆటగాళ్లకు అంచనా పెరుగుతోంది అనే ఆరోపణలు ఉన్నప్పటికీ ఐపీఎల్ విజయవంతంగా కొనసాగుతోంది. ఆర్థిక అవకతవకలు ఇంకా ఎన్నో విమర్శలు వినిపించినప్పటికీ ఐపీఎల్ నిరాటంకం గా దూసుకెళ్తూనే ఉంది. విజయవంతంగా 16 సీజన్లో పూర్తి చేసుకుని 17వ సీజన్లోకి అడుగు పెట్టింది.. 17వ సీజన్ కు సంబంధించి షెడ్యూల్ గురువారం విడుదల కానుంది. జియో సినిమాలో సాయంత్రం ఐదు గంటల నుంచి ఈ షెడ్యూల్ స్ట్రీమింగ్ అవుతుంది. మ్యాచ్ వేదికలు, తేదీలు, జట్లు వంటి వివరాలు బిసిసిఐ వెల్లడించనుంది. కాగా ఈ సీజన్ మార్చి 22 నుంచి మొదలై మే 29 వరకు కొనసాగవచ్చని తెలుస్తోంది..