Medaram Jatara: తెలంగాణ కుంభమేళా.. ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర మొదలైంది. బుధవారం(ఫిబ్రవరి 21న) రోజు పగిడిద్ద రాజు, జంపన్న, సార లమ్మను గద్దెలపైకి తీసుకువచ్చి ప్రతిష్టించారు. దీంతో జాతర మొదలైంది. గురువారం(ఫిబ్రవరి 22న) చిలకల గుట్ట నుంచి సమ్మక్కను గద్దెలపైకి తీసుకురానున్నారు. దీంతో జాతరలో అత్యంత ప్రధాన ఘట్టం ఇదే. దీంతో మేడారానికి తెలంగాణతోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు విదేశాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారు.
ధరల మోత..
జాతరకు భారీగా భక్తులు వస్తుండడంతో అక్కడి వ్యాపారులు ధరల మోత మోగిస్తున్నారు. భక్తుల సంఖ్య పెరిగే కొద్ది ధరలను పెంచుతున్నారు. దీంతో సామాన్య భక్తులు ఇబ్బంది పడుతున్నారు. మేడారంలో అమ్మవారి దర్శనానికి ఎలాంటి టికెట్‌లేదు. అక్కడ ప్రసాధాలు అమ్మరు. వన దేవతలకు మొక్కులు చెల్లించుకునేందుకు ఎలాంటి ఖర్చు లేదు. అయినా భక్తుల జేబుకు చిల్లు పడుతోంది. అక్కడ ఏది కొనాలన్న భయపడాల్సిన పరిస్థితి. చిన్న ఆట వస్తువు నుంచి కోడి, యాట పిల్లల వరకు అన్ని ధరలూ మండిపోతున్నాయి.
కొన్నింటి ధరలు
భారీ రద్దీ నడుమ అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత చల్లని కూల్‌డ్రింక్ తాగాలన్నా భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఇక మందు తాగాలంటే రూ.500 నోటు తీయాల్సిందే. బయట మార్కెట్‌లో ధరలతో పోలిస్తే ఇక్కడి ధరలు రెండు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా ఇక్కడ కొబ్బరికా ధర రూ.20 నుంచి రూ.30 ఉంటుంది. కానీ మేడారంలో కొబ్బరికాయను రూ.100కు అమ్ముతున్నారు. ఇక జాతరలో కోడి, మేక కచ్చితం. అక్కడ కొనాలనుకుంటే కోడి కిలో రూ.400లకు, మేక, గొర్రెలను రూ.10 వేలకు విక్రయిస్తున్నారు. ఇక మధ్యం ధరలు అయితే మండిపోతున్నాయి. ఇక అమ్మవారికి అత్యంత ఇష్టమైన బంగారం (బెల్లం) బయటి మార్కెట్లో కిలో 40 రూపాయల నుంచి 50 వరకు ఉంది. మేడారంలో మాత్రం 100 రూపాయలకు పైననే అమ్ముతున్నారు.