https://oktelugu.com/

RCB Vs RR 2024: బట్లర్ సెంచరీ కి, విరాట్ సెంచరీ కి అదే తేడా !

బెంగళూరు తో జరిగిన మ్యాచ్లో సెంచరీ సాధించడం ద్వారా రాజస్థాన్ ఆటగాడు బట్లర్ అనేక రికార్డులు సృష్టించాడు. వాస్తవానికి బట్లర్ కంటే ముందు ఇదే మ్యాచ్లో విరాట్ కోహ్లీ 113 పరుగులు చేశాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : April 7, 2024 / 01:09 PM IST

    RCB Vs RR 2024

    Follow us on

    RCB Vs RR 2024:  వరుస విజయాలతో ఈ ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ జట్టు జోరు మీద ఉంది. ఎదురైన ప్రతి జట్టు మీద రేసుగుర్రం లాగా ప్రతాపం చూపిస్తోంది. సంజు సాంసన్, రియాన్ పరాగ్, బట్లర్ ఇలా ఒక్కొక్క ఆటగాడు.. ఒక్కో సందర్భంలో జట్టును ఆదుకుంటున్నారు. అప్రతిహత విజయాలు అందిస్తున్నారు.. శనివారం సొంత మైదానంలో జరిగిన మ్యాచ్లో.. బెంగళూరు విధించిన 183 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే రాజస్థాన్ ఊది పడేసింది. బట్లర్ శతకంతో సింహగర్జన చేశాడు. అతడికి కెప్టెన్ సంజు(69) సహకరించాడు. ఫలితంగా బెంగళూరు ఖాతాలో మరో ఓటమి చేరింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రాజస్థాన్ మొదటి స్థానానికి చేరుకుంది.

    బెంగళూరు తో జరిగిన మ్యాచ్లో సెంచరీ సాధించడం ద్వారా రాజస్థాన్ ఆటగాడు బట్లర్ అనేక రికార్డులు సృష్టించాడు. వాస్తవానికి బట్లర్ కంటే ముందు ఇదే మ్యాచ్లో విరాట్ కోహ్లీ 113 పరుగులు చేశాడు. చేజింగ్ లో బట్లర్ శతక గర్జన చేయడంతో విరాట్ కోహ్లీ చేసిన సెంచరీ మరుగున పడిపోయింది. అంతేకాదు 94 పరుగుల వద్ద ఉన్న బట్లర్ సిక్స్ కొట్టి తను సెంచరీ పూర్తి చేశాడు.. జట్టుకు మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందించాడు. ఈ సెంచరీ ద్వారా బట్లర్ 100వ ఐపీఎల్ మ్యాచ్లో 100 పరుగులు చేసిన తొలి విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ ఘనత సాధించిన రెండవ బ్యాటర్ గా కేల్ రాహుల్ తర్వాత స్థానంలో ఉన్నాడు. అంతేకాదు బట్లర్ రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధికంగా 11సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు అందుకున్న తొలి ఆటగాడిగా వినతి కెక్కాడు. అంతేకాదు రాజస్థాన్ జట్టు తరుపున అత్యధికంగా పరుగులు (2,831) చేసిన రెండవ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇతడి కంటే ముందు రాజస్థాన్ జట్టు తరఫున అజింక్య రహనే పదిసార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. బట్లర్ ఇప్పటివరకు 6 సెంచరీలు సాధించాడు. ఈ ఐపిఎల్ సీజన్లో ఒకే మ్యాచ్లో అటు విరాట్, ఇటు బట్లర్ సెంచరీలు సాధించడం కూడా ఒక రికార్డే. కాగా, బట్లర్ కంటే విరాట్ కోహ్లీ 8 సెంచరీలతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.

    కేవలం సెంచరీ ద్వారా మాత్రమే కాకుండా భాగస్వామ్యాల విషయంలోనూ బట్లర్ సరికొత్త రికార్డు సృష్టించాడు. 0 పరుగులకే యశస్వి జైస్వాల్ వికెట్ కోల్పోయినప్పటికీ.. కెప్టెన్ సంజు తో కలిసి రెండో వికెట్ కు బట్లర్ 148 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రెండో వికెట్ కు రాజస్థాన్ జట్టు ఇప్పటివరకు ఐపీఎల్లో నెలకొల్పిన భాగస్వామ్యాల్లో ఇది ముందు వరుసలో ఉంటుంది. బట్లర్, సంజు రెండో వికెట్ కు బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మ్యాచ్ పై రాజస్థాన్ పట్టు బిగించేలా చేసింది. సెంచరీ చేసి జట్టును గెలిపించిన నేపథ్యంలో బట్లర్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

    బట్లర్ సెంచరీ చేసిన నేపథ్యంలో.. అతడి ఆటను, విరాట్ కోహ్లీ ఆటను నెటిజన్లు పోల్చి చూస్తున్నారు. వాస్తవానికి విరాట్ కోహ్లీ నిదానంగా ఆడినప్పటికీ.. ఇతర బ్యాటర్లలో ఎవరూ అతడికి సహకరించలేదు..కెప్టెన్ డూ ప్లెసిస్ మినహా మిగతా వారంతా.. అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు.. మరోవైపు రాజస్థాన్ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో విరాట్ సెంచరీ చేసేందుకు ఎక్కువ బంతులు తీసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో అతనిపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. “నిదానంగా బ్యాటింగ్ చేశాడు. మనిషి పాండే సరసన నిలిచాడు.” అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో బట్లర్ తన జట్టును గెలిపించేందుకు సెంచరీ సాధించాడు.. తన జట్టుకు ఒక పరుగు కావాల్సిన సమయంలో.. తను 94 పరుగుల వద్ద ఉన్నప్పటికీ.. సెంచరీ కోసం ఆలోచించకుండా సిక్సర్ కొట్టాడు. సెంచరీ చేయడంతో పాటు జట్టును కూడా గెలిపించాడు. కోహ్లీ ఆటతీరును తప్పు పట్టలేకపోయినప్పటికీ.. కఠిన పరిస్థితుల్లో ఆటగాళ్లకు.. వ్యక్తిగత ప్రదర్శన కంటే.. జట్టు అవసరాలే కీలక ప్రాధాన్యంగా ఉంటాయి కాబట్టి ఇలాంటి విమర్శలు సహజమే అని క్రీడా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి విరాట్ కోహ్లీ సెంచరీ కంటే బట్లర్ చేసిన 100 పరుగులే ఉత్తమంగా నిలిచాయని వారు అంటున్నారు.